నోటికి, లాఠీకి పని చెప్పడమే కట్టడా?

ABN , First Publish Date - 2020-03-25T08:40:06+05:30 IST

‘‘బహదూర్‌పురాకు చెందిన యువకుడు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. విధి నిర్వహణ కోసం వెళ్తున్న అతడిపై పోలీసులు ప్రశ్నించకుండానే చేయి చేసుకున్నారు.’’ ‘‘అత్యవసర సేవల్లో పని చేసే మరో ఉద్యోగి విధి...

నోటికి, లాఠీకి పని చెప్పడమే కట్టడా?

పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు

గుర్తింపు కార్డులున్నా దండ ప్రయోగం

వ్యూహం లేకుండా ట్రాఫిక్‌ నియంత్రణతో కొత్త చిక్కులు

సామాజిక దూరాన్ని అమలు చేయటంలో పట్టని ప్రాధాన్యత

ఉన్నతాధికారులు ఒకలా.. కిందిస్థాయి సిబ్బంది మరోలా

కొందరు పోలీసులు చేస్తున్న తప్పులకు అందరిపైనా అపకీర్తి

విధులకు హాజరు కాలేకపోతున్న అత్యవసర సేవల ఉద్యోగులు


హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘‘బహదూర్‌పురాకు చెందిన యువకుడు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. విధి నిర్వహణ కోసం వెళ్తున్న అతడిపై పోలీసులు ప్రశ్నించకుండానే చేయి చేసుకున్నారు.’’ ‘‘అత్యవసర సేవల్లో పని చేసే మరో ఉద్యోగి విధి నిర్వహణ కోసం ఎస్‌ఆర్‌ నగర్‌ సమీపంలో పోలీసుల చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది.’’ ‘‘కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో ఆసుపత్రికి వెళ్తున్న ఓ పెద్దాయనను పోలీసు అధికారి అడ్డుకున్నారు. అతను చెప్పేది వినకుండా నోటికి పని చెప్పారు. వయసును కూడా చూడకుండా తిట్టారు.’’  ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. హైదరాబాద్‌ మహానగరంలోని హైదరాబాద్‌.. సైబరాబాద్‌.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పలువురు ఇలాంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కొంటున్నారు. కరోనా వేళ అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే. మందు లేని ఈ మహమ్మారికి పరిష్కార మార్గం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటమే. అయితే అత్యవస పరిస్థితిల్లో కొందరి మినహాయింపు ఉన్నా.. అవేమి పట్టకుండానే పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రి చేతులు జోడించి మరీ వేడుకుంటున్నప్పటికీ ఇళ్లల్లో నుంచి రోడ్ల మీదకు వస్తున్న వారిని వెనక్కి పంపించే విషయంలోనూ.. వారికి అవగాహన కలిగించే విషయంలో పోలీసుల పాత్రను తక్కువ చేయలేం. అయితే.. కొందరికి మినహాయింపు ఉందన్న విషయాన్ని మర్చిపోయి.. అందరినీ ఒకేగాటున కట్టేయటం.. వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం. గుర్తింపు కార్డులు చూపిస్తున్నా వినకుండా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఎంత చెప్పినా వినట్లేదా?

తాము ఎంత చెప్పినా.. ప్రజలు వినటం లేదన్న మాట పలువురు పోలీసుల నోట వస్తోంది. వైరస్‌ ప్రమాదకరమైనదే అయినా.. ప్రాణాల మీదకు తీసుకొస్తుందన్న విషయంపై అవగాహన లేమి.. ప్రజల్ని బయటకు వచ్చేలా చేస్తోంది. దీనికి తోడు స్థానిక నాయకులు ఎవరికి వారు ఇంటికే పరిమితం కావటంతో.. ప్రజల్ని అప్రమత్తం చేసే వారు లేకపోయారు. ఇదంతా పోలీసుల పని భారాన్ని మరింత పెంచింది. ఇలాంటి సమయాల్లో చాలావరకు అధికారులు సంయమనంతో వ్యవహరిస్తుంటే.. కొందరు మాత్రం మిగిలిన పోలీసులకు చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు.


పోలీసులూ ఇది గుర్తించండి...

ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రాకుండా చూడాల్సిన భారమంతా పోలీసులే మోస్తున్నారు. దీన్ని కాదనలేం. ఆ పేరుతో అత్యవసర సేవల కోసం పని చేస్తున్న మిగిలిన వారి పట్ల చులకనా భావం.. తక్కువ చేసి చూడటం.. ఎంత మాట పడితే అంత మాటలు అనడం పోలీసులకు చెడ్డ పేరు తెస్తోంది. అత్యవసర సేవల కోసం పని చేసే వారు పోలీసులకు మించిన ఒత్తిడిని.. భారాన్ని మోస్తున్నారన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. అడుగడుగునా పోలీసు చెక్‌ పోస్టులను దాటుకోవడం.. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. కొందరు అధికారుల దురుసుతనాన్ని భరిస్తూ పని చేయాల్సి రావటానికి మించిన ఒత్తిడి ఇంకేం ఉంటుంది? ఈ విషయాన్ని కింది స్థాయి పోలీసు సిబ్బంది గుర్తించాల్సి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


ప్రణాళికాబద్ధతే పెద్ద సమస్య...

ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులు ప్రణాళిక బద్ధంగా పని చేయకపోవటమే పెద్ద సమస్యగా మారింది. రోడ్ల మీద వచ్చే వారిని ఎలా నియంత్రించాలన్న విషయం మీద వారు లాఠీని నమ్ముకుంటున్నారే తప్పించి.. స్మార్ట్‌ వర్క్‌ చేయటం లేదన్న అపవాదు వారి మీద ఉంది. అనవసరంగా రోడ్లఎలాంటి అవసరం లేకుండా బయటకు వచ్చే వాహనదారుల వివరాల్ని సేకరించటం.. వారికి భారీ ఎత్తున జరిమానాలు విధించటం చేయొచ్చు. కొందరు ఉన్నతాధికారులు అనుసరించినట్లుగా సామాజిక సేవ చేయించేలా చేయటం ద్వారా.. రోడ్ల మీదకు రాకుండా చేయాలి. కొన్ని సందర్భాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసే అలవాటు పోలీసు శాఖలో ఎప్పటి నుంచో ఉంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో వార్డుల వారీగా అలాంటి కమిటీలను ఏర్పాటు చేసి ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా చూసే బాధ్యతను అప్పజెప్పి ఉంటే.. రోడ్ల మీదకు చాలా వరకు వాహనాలు వచ్చేవి కాదు. అలాంటి ప్రయత్నం ఇప్పటి వరకూ జరగలేదు. 


వ్యూహాత్మకంగా లేని చెక్‌ పోస్టులు

ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయటానికే సరిపెట్టిన పోలీసులు.. కరోనా వేళ.. తీసుకోవాల్సిన ప్రత్యేక అంశాల్ని మర్చిపోయారు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించే విషయంలో ఇంట్లో నుంచి రాకపోవటం ఒకటైతే.. ఒకరికి మరొకరికి మధ్య కనీసం మీటరు సామాజిక దూరం చాలా అవసరం. చెక్‌ పోస్టుల వద్ద వాహనాలు ఆగటం.. అవన్నీ దగ్గర దగ్గరగా ఉండటం చూసినప్పుడు ప్రాథమికంగా పాటించాల్సిన సామాజిక దూరం అన్నది కనిపించదు.


చెక్‌పోస్ట్‌ వద్ద చేయాల్సింది ఇలా...

 చెక్‌ పోస్టుల వద్ద అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ ఐజీ ఒకరు ఇలా చెప్పుకొచ్చారు. ‘‘చెక్‌ పోస్టులకు వంద మీటర్ల ముందు.. రెండు వరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేయాలి. ద్విచక్ర వాహనాలు ఒకవైపు.. కార్లు.. మిగిలిన వాహనాల్ని మరోవైపు వెళ్లేలా ఉండాలి. బారికేడ్లకు వంద మీటర్ల ముందే పోలీసులు మార్గదర్శనం చేయాలి. బారికేడ్లకు వచ్చేవారిలో అవసరం.. అనవసరం అయనోళ్లు ఎవరన్నది గుర్తించాలి. అవసరమైన వారిని ఆలస్యం చేయకుండా వదిలేయాలి. అనవసరమైన వారిని ముందుకు తీసుకెళ్లి వరుసగా ఆపాలి. అక్కడికక్కడే గంట నుంచి రెండు గంటల వరకూ సామాజిక సేవ చేయించాలి. ఈ సందర్భంగా తిట్టు.. అరుపులు.. లాఠీలకు పని చెప్పకుండా గాంధీగిరి చేయాలి. అదే సమయంలో వారి వాహన వివరాలు.. సెల్‌ ఫోన్‌ నెంబరు.. చిరునామా సేకరించాలి. ఆ వివరాల్ని సంబంధిత పోలీసుస్టేషన్‌కు పంపాలి. వారికి విడిగా కౌన్సెలింగ్‌ చేయటంతోపాటు.. మరోసారి ఆ తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్న హెచ్చరిక చేయాలి. ఇలాంటివి మొదట్లో కాస్త శ్రమతో కూడుకున్నవే అయినా.. రెండు మూడు రోజులకే ఫలితం రావటంతో పాటు.. ఉల్లంఘనులు ఎవరో ఇట్టే అర్థమైపోతారు’’ అని చెప్పారు.


అయినా మార్పు రావడం లేదు..

కరోనా వేళ.. పోలీసింగ్‌ విషయంలో ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలన్న విషయంపై అత్యున్నత అధికారులు..  ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఎంతగానో కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఇప్పుడు సాధ్యం కాకున్నా.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా.. కొందరిలో మార్పు రావటం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుందన్న విషయాన్ని ఆసక్తికర రీతిలో ఒక మాజీ డీఐజీ విశ్లేషించారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే విషయంలో జాగ్రత్తలు అవసరం. నైపుణ్యం చాలా ముఖ్యం. లా అండ్‌ ఆర్డర్‌.. ట్రాఫిక్‌ పోలీసులు డీల్‌ చేసినంత స్మూత్‌గా టాస్క్‌‘‘ఫోర్స్‌’’. ఎస్‌ వోటీ అధికారుల్లో ఉండదు. అందుకే వాహనదారుల్ని డీల్‌ చేసే అంశాన్ని లా అండ్‌ ఆర్డర్‌.. ట్రాఫిక్‌ పోలీసులకు అప్పుచెప్పాలి. అధికారుల మధ్య సమన్వయం..  ఇతర అంశాలకు మిగిలిన వారికి అప్పజెబితే మరింత ప్రభావంతంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇలాంటి అంశాల విషయంలో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారులు ప్రణాళిక బద్ధంగా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. కీలక సమయాల్లో కర్రపెత్తనం కంటే కళ్లలో కరకుదనం కనిపించేలా చేస్తూ.. ప్రజల్ని బాధ్యతగా వ్యవహరించేలా చేయటం చాలా ముఖ్యమన్నది మరవకూడదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Updated Date - 2020-03-25T08:40:06+05:30 IST