నగరంలో కొనసాగుతున్న వైరస్‌ విజృంభణ

ABN , First Publish Date - 2020-05-29T09:16:59+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నగరంలో పదిమంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది.

నగరంలో కొనసాగుతున్న వైరస్‌ విజృంభణ

10 మంది కానిస్టేబుళ్లకు కరోనా


అంబర్‌పేట/పద్మారావునగర్‌/ముషీరాబాద్‌/రామంతాపూర్‌/మంగళ్‌హాట్‌/అల్వాల్‌/బర్కత్‌పుర/కాప్రా/ఎర్రగడ్డ/బౌద్ధనగర్‌/ఎల్‌బీనగర్‌/జూబ్లీహిల్స్‌/అడ్డగుట్ట/కుత్బుల్లాపూర్‌/ఏఎస్‌రావునగర్‌/చిక్కడపల్లి/మెహిదీపట్నం/అఫ్జల్‌గంజ్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నగరంలో పదిమంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. ఓ వృద్ధుడు మృతి చెందాడు. కేసులు వెలుగు చూసిన ప్రాంతాలను అధికారులు కట్టడి చేస్తున్నారు. 


అంబర్‌పేటలో...

అంబర్‌పేటలో ఆరుగురు కానిస్టేబుళ్లకు, మరో మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంబర్‌పేట పీఎ్‌సలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు వలస కార్మికులను పలు రాష్ట్రాలకు పంపించే కార్యక్రమంలో పాల్గొనడంతో వారి నుంచి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. న్యూపటేల్‌ నగర్‌లో నివసిస్తున్న కానిస్టేబుల్‌ (28), కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తూ చెన్నారెడ్డినగర్‌లో ఉంటున్న కానిస్టేబుల్‌(33), గోల్నాక శంకర్‌నగర్‌లో ఉంటున్న మరో కానిస్టేబుల్‌(35)కు, తురాబ్‌నగర్‌లో ఉంటున్న ఓ మహిళకు కరోనా వైరస్‌ సోకింది.  


బోయిగూడ ఐడీహెచ్‌ కాలనీలో ముగ్గురికి.. 

బోయిగూడ ఐడీహెచ్‌ కాలనీలో ముగ్గురు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. రిటైర్డ్‌ ఉద్యోగి(67) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రైల్వే ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా. భార్యకు నెగెటివ్‌, కుమారుడి(24)కి పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. అదే కాలనీలో నివసిస్తున్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి(34)కి రెండు రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో ముషీరాబాద్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు ఉండడంతో గాంధీ ఆస్పత్రికి పంపించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది.  


భోలక్‌పూర్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి..

భోలక్‌పూర్‌ డివిజన్‌ సిద్ధిఖ్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. 50 సంవత్సరాల వయస్సుగల మహిళ, 32 సంవత్సరాల వ్యక్తి, 26 సంవత్సరాలుగల మరో మహిళకు పాజిటివ్‌ వచ్చింది. బంగ్లాదేశ్‌ మార్కెట్‌ సమీపంలో 42 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాంనగర్‌ జెమినీకాలనీలో వస్త్ర వ్యాపారి(42)కి పాజిటివ్‌ రావడంతో వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జెమినీకాలనీకి చెందిన వ్యక్తి ఇంట్లో నివసించే ఐదుగురిని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయా ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కట్టడి చేశారు.  


రామంతాపూర్‌లో.. 

రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌లో నివసించే కానిస్టేబుల్‌కు(32) కరోనా వైరస్‌ సోకింది. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించిన అతడు పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. భార్య, పిల్లలు స్వగ్రామంలో ఉండడంతో వారికి వైద్యాధికారులు సమాచారం ఇచ్చారు.  


ఫార్మసీలో పనిచేస్తున్న వ్యక్తికి.. 

ఫార్మసీలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అఫ్జల్‌సాగర్‌లో నివసిస్తున్న యువకుడు(20) ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోగల ఫార్మసీలో పనిచేస్తున్నాడు.  మూడు రోజుల క్రితం దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్నాడు. గురువారం వచ్చిన నివేదికలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


అల్వాల్‌లో ఇద్దరికి..

అల్వాల్‌లో ఇద్దరు కరోనా బారినపడ్డారు. ఒకరు బ్యాంక్‌ క్యాషియర్‌, మరొకరు సికింద్రాబాద్‌లో ఓ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బ్యాంక్‌ ఉద్యోగి అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 26న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. కానిస్టేబుల్‌ జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్షలు నిర్వహించగా గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


నర్సు భర్తకు.. 

కాచిగూడ డివిజన్‌ కుత్బిగూడలో నివసిస్తున్న కేరళకు చెందిన నర్సు గచ్చిబౌలిలో ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది ఆమె భర్త(54) లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత ఇంటి సమీపంలోగల సెలూన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా బారిన పడ్డాడు. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి భార్య, ఇద్దరు కుమారులను నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించినట్లు ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు.


కాప్రా సర్కిల్‌లో..

కాప్రా సర్కిల్‌ హెచ్‌బీ కాలనీ డివిజన్‌, కృష్ణానగర్‌లో నివసిస్తున్న కానిస్టేబుల్‌(45) కొద్ది రోజుల నుంచి గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడు పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి భార్య, కుమార్తె, కుమారుడిని వైద్య పరీక్షల నిమిత్తం కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు.  


చిలకలగూడలో టైలర్‌కు..

చిలకలగూడ దూద్‌బావిలో నివసిస్తున్న ఓ వ్యక్తి(48) టైలర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల నుంచి షాపు ఓపెన్‌ చేయలేదు. నాలుగు రోజుల క్రితం షాపును శుభ్రం చేశాడు. జ్వరం రావడంతో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించి కరోనా లక్షణాలు ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.   


సరూర్‌నగర్‌ సర్కిల్‌లో తొమ్మిది.. 

సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో కొత్తగా 9 కరోనా పాజిజివ్‌ కేసులు వెలుగు చూశాయి. న్యూగడ్డిఅన్నారం కాలనీలో ఓ వ్యక్తి(38) మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడి తండ్రి, తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎన్‌టీఆర్‌నగర్‌ ఫేజ్‌-3కి చెందిన వ్యక్తి(50)కి మంగళవారం పాజిటివ్‌ వచ్చింది. అతడి కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించగా తల్లి(68), సోదరుడు(30), కుమారుడు(20)కి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఎన్‌టీఆర్‌నగర్‌ ఫేజ్‌-1కు చెందిన పండ్ల వ్యాపారి(35)కి మంగళవారం కరోనా బారినపడ్డాడు. అతడి కుటుంబ సభ్యులతోపాటు ముగ్గురు ఆర్‌ఎంపీ వైద్యులు, మరొక వైద్యుడిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పండ్ల వ్యాపారి భార్య (30), ఇద్దరు కొడుకులు(8, 6), కుమార్తె(5)తోపాటు ఆర్‌ఎంపీ వైద్యుడి(77)కి పాజిటివ్‌ వచ్చింది.  


జూబ్లీహిల్స్‌లో..

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తోటి ఉద్యోగికి కరోనా సోకడంతో సహోద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 


జియాగూడలో.. 

జియాగూడలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గురువారం డివిజన్‌ పరిధిలో పలు కరోననా  కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సాయి దుర్గానగర్‌లో ఒకే ఇంట్లో అన్నదమ్ముల్లో ఒకరు (37), మరొకరు (30) కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధప డుతున్నారు. వారిని స్థానిక వైద్య సిబ్బంది పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీనర్సింహనగర్‌లో వృద్ధురాలు(63)కి కరోనా పాజిటివ్‌ తేలింది. ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదైన వెంకటేశ్వర్‌నగర్‌లో ఓ వ్యక్తి(30)కి కూడా కరోనా సోకినట్లు తేలడంతో అధికారులు వారిద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మాక్బర ప్రాంతంలో మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.  


కమలానగర్‌లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల గుర్తింపు

ఏఎ్‌సరావునగర్‌ డివిజన్‌ కమలానగర్‌లో ఓ వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకడంతో వైద్య సిబ్బంది కాలనీలో 570 ఇళ్లు ఉండగా 170 ఇళ్లలో సర్వే నిర్వహించారు. వృద్ధురాలితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఉన్న మొత్తం 20 మందిని గుర్తించారు. ప్రైమరీ కాంటాక్టు ఉన్న వారు 28 రోజులు, సెకండరీ కాంటాక్టు ఉన్న వారు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని చేతికి స్టాంపు వేసినట్లు వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామింగ్‌ అధికారి డాక్టర్‌ రాంకుమార్‌, డాక్టర్‌ స్వప్నారెడ్డి, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T09:16:59+05:30 IST