చెక్కు చెదరకున్నా.. చెడగొట్టి మరీ...!

ABN , First Publish Date - 2020-10-19T13:03:04+05:30 IST

గ్రేటర్‌లో ఇంతకంటే అధ్వాన ఫుట్‌పాత్‌లు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పునరుద్ధరణ, పాడైన ప్రాంతాల్లో మరమ్మతు పనులపై శ్రద్ధ పెట్టని ప్రభుత్వ విభాగాలు... బాగున్న ఏరియాల్లోనూ ఆధునికీకరణ, అదనపు హంగులు, సిటీ లుక్‌ మార్చేందుకంటూ కొత్తగా పనులు చేపడుతున్నారు.

చెక్కు చెదరకున్నా.. చెడగొట్టి మరీ...!

హైదరాబాద్‌ : గ్రేటర్‌లో ఇంతకంటే అధ్వాన ఫుట్‌పాత్‌లు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పునరుద్ధరణ, పాడైన ప్రాంతాల్లో మరమ్మతు పనులపై శ్రద్ధ పెట్టని ప్రభుత్వ విభాగాలు... బాగున్న ఏరియాల్లోనూ ఆధునికీకరణ, అదనపు హంగులు, సిటీ లుక్‌ మార్చేందుకంటూ కొత్తగా పనులు చేపడుతున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఇరు వైపులా నాలుగేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ఫుట్‌పాత్‌ నిర్మించింది. సాగర్‌ వైపు కొన్ని ప్రాంతాల్లో నిమజ్జన సమయంలో క్రేన్ల ఏర్పాటుతో కొంతమేర పాడయ్యాయి. వాటిని మరమ్మతు చేయడంతోపాటు.. క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేపడితే కనీసం మరో మూడు, నాలుగేళ్ల వరకు ప్రస్తుత ఫుట్‌పాత్‌లను వినియోగించుకునే అవకాశముంది. ప్రమాణాలు, నాణ్యతతో నిర్మిస్తే ఫుట్‌పాత్‌లు పదేళ్లపాటు చెక్కు చెదరవని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. నిర్వహణ మెరుగ్గా ఉండి.. తవ్వకాలు చేపట్టకుంటే మరో రెండు, మూడేళ్లూ ఉండే అవకాశముంది. 


అయితే ట్యాంక్‌బండ్‌పై మాత్రంవేసిన నాలుగేళ్లకు కూడా చెక్కు చెదరకుండా ఉన్న ఫుట్‌పాత్‌లను తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారు. పర్యాటక ప్రాంతానికి అదనపు హంగులు అద్దే క్రమంలోనే గ్రానైట్‌తో ఫుట్‌పాత్‌ నిర్మిస్తున్నామని, వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ డక్ట్‌ కూ డా వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నిమజ్జన సమయంలో నిర్ణీత ప్రాంతా ల్లో క్రేన్లు ఏర్పాటు చేసేలా కాబూల్‌ స్టోన్‌తో నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రూ.13 కోట్లతో చేపట్టింది. దీనిపై పౌరులు విమర్శలు గుప్పిస్తున్నారు. వసతుల కల్పనకు సంబంధించిన పనులు చేయకుండా.. ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశంతో పైపైన రంగులు పూసే పనులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సాగర్‌ లేక్‌ వైపు మెజార్టీ ఫుట్‌పాత్‌ తొలగించి కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించగా.. బండ్‌పై విగ్రహాలు ఉన్న వైపు 30 శాతం వరకు ఫుట్‌పాత్‌ తొలగించారు.

Updated Date - 2020-10-19T13:03:04+05:30 IST