మా నీళ్లే మేం వాడుతున్నాం!

ABN , First Publish Date - 2020-05-19T09:05:51+05:30 IST

‘‘రాయలసీమకు గోదావరి జలాలను మళ్లించుకోవచ్చు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా గోదావరిలో నీళ్లు ఉన్నయ్‌.

మా నీళ్లే మేం వాడుతున్నాం!

కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు

ఏపీ కూడా అలాగే ఉండాలి

ఉంటే మంచిమాట.. లేదంటే కొట్లాట!

సీమకు గోదావరి నీళ్లు తీసుకెళ్లొచ్చు

అదేమాట గతంలో చెప్పాను

ఇప్పటికీ అన్యోన్యంగానే ఉన్నాం

మా ప్రయోజనాలపై రాజీపడం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘‘రాయలసీమకు గోదావరి జలాలను మళ్లించుకోవచ్చు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా గోదావరిలో నీళ్లు ఉన్నయ్‌. ఎవరు తీసుకెళ్లినా మాకు అభ్యంతరం లేదు’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పోతిరెడ్డిపాడు కాల్వల విస్తరణపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై తెలంగాణ అభ్యంతరాలు... అదే సమయంలో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులతో రెండు రాష్ట్రాల మధ్య జల జగడం మొదలైన సంగతి తెలిసిందే.


సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ ఈ అంశాలపై స్పందించారు. పోతిరెడ్డిపాడుపై తమ పాలసీ తమకుందని చెప్పారు. తెలంగాణ హక్కులు, కేటాయింపుల మేరకే రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకున్నామని ప్రకటించారు. ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆ మేరకే ఉండాలని  కోరుకుంటున్నామని చెప్పారు.  ‘‘మేం చట్ట పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేం కట్టుకుంటున్నాం. మేం ఎక్కడా ఉల్లంఘించలేదు. అతిక్రమించలేదు. అతిక్రమిస్తే ఇతరులు ఊరుకోరు. కాబట్టి మేం వివాదాలకు పోదల్చుకోలేదు’’ అని కేసీఆర్‌ తెలిపారు.


కలిసే, అన్యోన్యంగా ఉన్నాం: ‘‘బేసిన్లు లేవు... భేషజాలు లేవు.. బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి... మేం వాడుకుంటాం.. మీరూ వాడుకోండి. ఇరురాష్ట్రాలకు సరిపోను ఇంకో 1,000 టీఎంసీలున్నాయి’’ అని ఏపీ ప్రభుత్వానికి చెప్పానని కేసీఆర్‌ తెలిపారు. పిచ్చి కొట్లాట అనవసరమని తెలిపామన్నారు. గోదావరి జలాల్లో మరో 650 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ‘‘ఏపీతో ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నాం. మాకేం వివాదాలు లేవు. ఇప్పటివరకు అన్యోన్యంగా కలిసి ఉన్నాం’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో చొరవ తీసుకోమని కేంద్రాన్ని కోరతారా.. అని ఓ విలేకరి అడగబోగా.. ‘నీకేదో కిరికిరి, పంచాయతీ పెట్టాలని కోరిక ఉన్నట్లుంది.. అదేం జరగదు. మీదారిన మీరు ఉండమని ఏపీకి చెబుతున్నం. ఉంటే మంచిమాట. లేదు.. కొట్లాటంటే కొట్లాట’ అని కేసీఆర్‌ బదులిచ్చారు.


కేంద్రం ప్యాకేజీ దుర్మార్గం: కేంద్రం దుర్మార్గ్గమైన ప్యాకేజీ ప్రకటించిందని.. నియంతృత్వ వైఖరితో ఉందని తెలంగాణ సీఎం విమర్శించారు. ‘‘మెడ మీద కత్తిపెట్టినట్లుగా షరతులు విధించి, కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు అమలు చేస్తే అదనంగా రుణాలు తీసుకోవచ్చునట. ఇదేం పద్ధతి! కేంద్రానిది దుర్మార్గపు ప్యాకేజీ. పచ్చి మోసం, దగా, అంకెలా గారడీ మాత్రమే.  సమాఖ్య వ్యవస్థలో అనుసరించాల్సిన విధానం కాదు. రాష్ట్రాల మీద పెత్తనాలు చెల్లించాలనుకోవడం దుర్మార్గం. ప్రధాని చెబుతున్న ‘సహకార సమాఖ్య’ డొల్ల, బోగస్‌ అని తేలింది. ఈ ప్యాకేజీతో కేంద్ర ప్రభుత్వం తన పరువు తానే తీసుకుంది. ఇది రాబోయే రోజుల్లో బయటపడుతుంది’’ అని తెలిపారు. రాష్ట్రాలను కేంద్రం బిక్షగాళ్లుగా భావిస్తోందని విమర్శించారు.

Updated Date - 2020-05-19T09:05:51+05:30 IST