‘అన్నలు’ వచ్చారు..

ABN , First Publish Date - 2020-03-13T11:29:20+05:30 IST

ఏజెన్సీ ఉద్రిక్తంగా మారుతోంది. మావోయిస్టులు జి ల్లాల్లో అడుగుపెట్టారనే ప్రచారం సాగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో

‘అన్నలు’ వచ్చారు..

ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోకి మావోయిస్టు యాక్షన్‌ టీంలు

ఛత్తీ్‌సగఢ్‌నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలోకి..

నాలుగు బృందాలు  ప్రవేశించినట్టు  ప్రచారం


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

ఏజెన్సీ ఉద్రిక్తంగా మారుతోంది. మావోయిస్టులు జి ల్లాల్లో అడుగుపెట్టారనే ప్రచారం సాగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో పోలీసుల భారీ కూంబింగులు, డ్రోన్‌, హెలికాప్టర్లతో గాలింపు సరిహద్దుల్లో మళ్లీ అలజడి రేపుతోంది. ఛత్తీ్‌సగఢ్‌లో ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ కొనసాగుతుండడంతో మావోయిస్టులు ఆ రాష్ట్ర నుంచి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. నాలు గు యాక్షన్‌ టీంలు అడుగుడపెట్టాయనే ప్రచారం జరుగుతుండడంతో రాజకీయ నేతల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం  ప్రజాప్రతినిధులను కలవరానికి గురిచేస్తోంది. 


‘ఆపరేషన్‌ ప్రహార్‌’తో తెలంగాణ వైపు..

మావోయిస్టులకు కేరా్‌ఫగా మారిన ఛత్తీ్‌సగఢ్‌లో అక్కడి ప్రభుత్వం ఆపరేషన్‌ ప్రహార్‌ చేపట్టింది. ఇందు లో భాగంగా సుమారు రెండు వేల మందికిపైగా  పోలీస్‌ బలగాలతో మావోయిస్టుల ఏరివేతకు సిద్ధమైంది. నక్సల్‌ ప్రాబల్యం ఉన్న బీజాపూర్‌, సుక్మా, దంతెవాడ, బస్తర్‌, పూజర్‌కాంకేడ్‌ తదితర జిల్లాల్లో ఈ ఆపరేషన్‌ కొనసాగుతోంది. డ్రోన్‌ కెమెరాలతో నక్సల్స్‌ స్థావరాలను గుర్తిస్తూ ఆ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఇటీవల ఛత్తీ్‌సగఢ్‌  అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి వస్తుండడంతో అడవుల్లో ఆకులు రాలిపోనున్నాయి. తమ స్థావరాలను డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు సులభంగా గుర్తిస్తుండటంతో మావోయిస్టులు తెలంగాణ వైపు వస్తున్నారని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లో ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉండడంతో గోదావరి దాటి మావోయిస్టులు ప్రవేశించారని నిఘావర్గాలు సైతం పేర్కొంటున్నాయి. 


అణువణువూ గాలింపు

మావోయిస్టు యాక్షన్‌ టీంలు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ప్రవేశించాయనే ప్రచారంతో పోలీసులు అప్రమత్తవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ములుగు, భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి సమాచారంతో ఆ ప్రాంతంలోని పోలీసులను అలర్ట్‌ చేశారు. ఇప్పటికే కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, చర్ల, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాదేవపూర్‌, అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పోలీస్‌ బలగాలు హెలిక్యాప్టర్‌లో మావోయిస్టుల కోసం సెర్చింగ్‌ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. అడవుల్లో ఎక్కడ దాగి ఉన్నా కనిపెట్టేలా ఎక్కువ మెగా పిక్సెల్‌ డ్రోన్‌ కెమెరాలను సైతం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 


రెండు రోజులు నుంచి హెలికాప్టర్‌ ద్వారా కూడా గోదావరి పరీవాహక ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి పోలీస్‌ టీంలు సెర్చ్‌ చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహాదేవపూర్‌, మహాముత్తారం మండలాల్లో పోలీస్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రతీ ఒక్కరి వద్ద ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపుకార్డులను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి రానివ్వొద్దంటూ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌తో పాటు ములుగు జిల్లాలోని సమ్మక్క బ్యారేజీల వద్ద పోలీసుల బందోబస్తును పెంచారు. ఎప్పటికప్పుడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల వద్ద డ్రోన్‌ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 


నేతల గుండెల్లో  రైళ్లు..

పోలీసుల హెచ్చరికలు నేతలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మూడు జిల్లాల పోలీసులు ఇప్పటికే అధికార పార్టీ నాయకులను, మావోయిస్టు టార్గెట్లను అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో గ్రామాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అధికార పార్టీ జడ్పీటీసీ, ఎంపీపీల తో పాటు ఎంపీటీసీ, సర్పంచ్‌లను సైతం స్థానికంగా ఉండకపోతేనే మంచిందంటున్నారు. ఎవరైనా అనుమానితులు గ్రామంలో కనబడితే వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్థులను పోలీసులు కోరుతున్నారు. మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించారని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తుండటంతో నేత లు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందోననే ఉత్కంఠతతో ఏజెన్సీ, సరిహద్దు ప్రాంత ప్రజలు, రాజకీయ నేతలు బిక్కుబిక్కుమంటున్నారు.  

Updated Date - 2020-03-13T11:29:20+05:30 IST