2011 ప్రపంచకప్‌పై వివాదం రేపి.. మాటమార్చిన శ్రీలంక మంత్రి

ABN , First Publish Date - 2020-06-26T01:29:20+05:30 IST

2011 ప్రపంచకప్ ఫైనల్‌ను తమ జట్టు భారత్‌కు అమ్మేసుకుందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన

2011 ప్రపంచకప్‌పై వివాదం రేపి.. మాటమార్చిన శ్రీలంక మంత్రి

కొలంబో: 2011 ప్రపంచకప్ ఫైనల్‌ను తమ జట్టు భారత్‌కు అమ్మేసుకుందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీలంక అప్పటి క్రీడల మంత్రి అయిన తాజా మంత్రి మహిందానంద అలుత్‌గమాంగే తాజాగా నాలిక మడతేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రపంచకప్ ఫైనల్‌పై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. విచారణలో భాగంగా బుధవారం ప్రత్యేక పోలీసు బృందం మహిందానంద నుంచి వాగ్మూలం సేకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్‌ పిక్స్ అయినట్టు తనకు అనుమానాలు ఉన్నాయని మాత్రమే దర్యాప్తు సంస్థతో చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. విచారణ సందర్భంగా 30 అక్టోబరు 2011న ఐసీసీకి తాను చేసిన ఫిర్యాదు పత్రాన్ని దర్యాప్తు బృందానికి అందించినట్టు చెప్పారు. తాను వ్యక్తం చేసిన అనుమానాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలని అన్నారు. 


ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను తన దేశం అమ్మేసుకుందంటూ ఇటీవల మహిందానంద చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో దుమారం రేపాయి. ఆయన ఆరోపణలను అప్పటి శ్రీలంక జట్టు కెప్టెన్ కుమార సంగక్కర, మహేల జయవర్ధనే వంటి వారు ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, 2011 ప్రపంచకప్ ఫైనల్‌పై మాజీ సారథి అర్జున రణతుంగ కూడా అప్పట్లో ఆరోపణలు చేశాడు. 

Updated Date - 2020-06-26T01:29:20+05:30 IST