అదే మా విజయ రహస్యం

ABN , First Publish Date - 2020-08-20T09:56:52+05:30 IST

జాతీయ బ్యాడ్మింటన్‌ సంఘం.. నా డబుల్స్‌ భాగస్వామి చిరాగ్‌ శెట్టితో పాటు నా పేరును అర్జున అవార్డుకి సిఫారసు

అదే మా విజయ రహస్యం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ పదో ర్యాంకర్‌.. వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు కఠోరంగా శ్రమిస్తున్న యువ కెరటం సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి.. ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం అర్జునకు ఎంపికై తెలుగు ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. క్రీడాశాఖకు అవార్డు ఎంపిక కమిటీ సిఫారసు చేసిన జాబితాలో ఇరవై ఏళ్ల ఈ కుర్రాడి పేరు ఖరారైంది. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో సాత్విక్‌ పంచుకున్న విశేషాలు అతని మాటల్లోనే.. 


‘అర్జున’ ఊహించలేదు

మా ఇద్దరిలో ఒకరికే వస్తుందనుకున్నాం

‘ఆంధ్రజ్యోతి’తో షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌


ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌

జాతీయ బ్యాడ్మింటన్‌ సంఘం.. నా డబుల్స్‌ భాగస్వామి చిరాగ్‌ శెట్టితో పాటు నా పేరును అర్జున అవార్డుకి సిఫారసు చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు దరఖాస్తులు పంపినప్పటి నుంచి ఒకటే చర్చ. ‘ఎంతటి ప్రతిభావంతులైనా.. ఇద్దరికీ అవార్డు వచ్చే అవకాశాలు తక్కువ. ఒకరికే వస్తుంది’ అంటూ చాలామంది చేసిన విశ్లేషణలు విని కొంచెం బాధ అనిపించింది. మా ఇద్దరికీ అవార్డు వస్తే బాగుంటుందని మనసులో అనుకునేవాణ్ణి. మొత్తానికి ఇద్దరం పురస్కారానికి ఎంపికవడంతో అంతులేని సంతోషానికి లోనయ్యా.

వారి పాత్ర వెలకట్టలేనిది..

నా కెరీర్‌ ఎదుగుదలలో అమ్మ రంగమణి, నాన్న  కాశీ విశ్వనాథ్‌ పాత్ర ప్రధానమైనది. నా ప్రతి అడుగులో వారి తపన, కష్టం ఉంది. ఇక, ఆటలో ఈ స్థాయికి చేరానంటే దానికి ముఖ్య కారణం గోపీచంద్‌ సార్‌. సాధనలో నాకు చక్కటి సహకారమందించే సహచర ఆటగాళ్లకు, సంకట పరిస్థితుల్లో వెన్నంటి నిలిచే ఆప్త మిత్రులకు, ఇలా అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

ఒలింపిక్స్‌ సన్నద్ధతకు..

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడడం నిరాశ కలిగించింది. ఎందుకంటే ఒలింపిక్స్‌ ముందు థాయ్‌లాండ్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సత్తా చాటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాం. ఆ ఊపుతో ఒలింపిక్స్‌ కోసం ఉత్సాహంగా సన్నద్ధమవుతున్న తరుణంలో వాయిదా నిర్ణయం నిరుత్సాహన్ని కలిగించింది. అయితేనేం.. ఇప్పుడు అర్జున అవార్డు వరించిందని తెలియగానే నూతనోత్తేజం ఆవరించింది. జీవితంలో ఇంతకుముందెన్నడూ అనుభూతి చెందని.. వర్ణించలేని ఉద్విగ్నభరిత క్షణాలివి. ఈ పురస్కారం రావడంతో ఆటగాడిగా, పౌరుడిగా నా మీద బాధ్యతలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటి నుంచి ఒలింపిక్స్‌ లక్ష్యంగా మరింత ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తా.


చిరాగ్‌ సూపర్‌..

మా ఇద్దరిది ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యం. మేం జత కట్టిన కొత్తలో చిరాగ్‌తో మాట్లాడేందుకు ఇబ్బంది పడేవాడిని. కారణం చిరాగ్‌కు తెలుగు రాదు. నాకు హిందీ రాదు. అయితే, కొద్దిరోజుల్లోనే ఆ సమస్యను అధిగమించాం. మా జోడీ విజయవంతంగా కొనసాగడానికి ముఖ్య కారణం ఒకరిపై ఒకరికున్న అపార నమ్మకం. గేమ్‌ ఆడుతున్నప్పుడు పాయింట్లు సాధించే క్రమంలో ఒక్కోసారి తప్పులు దొర్లుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఎప్పుడూ ఒకరినొకరు తప్పుబట్టుకునే వాళ్లం కాదు. పరిపక్వతతో మెలిగేవాళ్లం. అదే మా విజయ రహస్యం.

Read more