అడవిలో ఆటో.. అందులో కన్నతల్లి.. అటుగా ఏనుగు.. చివరికి..

ABN , First Publish Date - 2020-03-02T17:56:00+05:30 IST

కన్నతల్లిని ఏనుగు బారి నుంచి కాపాడేందుకు కేరళలో ఓ వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరుపై ప్రశంసల...

అడవిలో ఆటో.. అందులో కన్నతల్లి.. అటుగా ఏనుగు.. చివరికి..

కన్నతల్లిని ఏనుగు బారి నుంచి కాపాడేందుకు కేరళలో ఓ వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కని పెంచిన తల్లిదండ్రులను బతికుండగానే కాటికి సాగనంపుతున్న కొడుకులున్న ఈరోజుల్లో తల్లి కోసం ఆ కొడుకు పడిన తాపత్రయం నిజంగా అభినందనీయం. కేరళలోని కొట్టాయంకు చెందిన మనోజ్(35) ఆటో డ్రైవర్. అతని తల్లి పేరు ఒమన(60). శబరిమల అటవీ ప్రాంతానికి సమీపంలో వీరి స్వగ్రామం ఉంది. ఆదివారం తన తల్లితో కలిసి ఆటోలో దుస్తులు ఉతుక్కునేందుకు సమీపంలోని అడవిలో ఉన్న నదీ ప్రాంతానికి వెళ్లారు. ఆటోను ఓ చోట నిలిపి తల్లిని ఆటోలోనే ఉండమని చెప్పి సమీపంలో మనోజ్ దుస్తులు ఉతుకుతున్నాడు.


ఇంతలోనే ఓ ఏనుగు ఆటోను సమీపిస్తూ రావడాన్ని మనోజ్ గమనించాడు. ఆటోలో ఉన్న మనోజ్ తల్లికి కాలూచేయీ ఆడలేదు. ఆమె వృద్ధురాలు కావడంతో ఆటోలో నుంచి దిగి తప్పించుకోవడానికి కూడా వీలు కుదరలేదు. ఇంతలో ఆటోను సమీపిస్తున్న ఏనుగును మనోజ్ తన చేతిలో ఉన్న కండువా చూపిస్తూ.. పెద్దగా అరుస్తూ దృష్టి మరల్చాడు. దీంతో.. ఏనుగు మనోజ్‌ను వెంబడిస్తూ వెళ్లింది. ఇంతలో మనోజ్ తల్లి ఆటోలో నుంచి దిగి సురక్షిత ప్రాంతానికి వెళ్లింది. మనోజ్‌ను దాదాపు కిలోమీటర్ మేర వెంబడించిన ఆ ఏనుగు అతను కనిపించకపోవడంతో కోపంతో మళ్లీ అదే ఆటో వద్దకు వచ్చి ఆటోను ధ్వంసం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. మనోజ్ చూపిన సమయస్ఫూర్తిని తల్లి ఒమన అభినందించారు. దాదాపు 40 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నామని.. ఇంతవరకూ తమకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-03-02T17:56:00+05:30 IST