ఎమ్మెల్సీ కవితను కలిసిన ప్రవాసీయుల బృందం.. సంక్షేమ బోర్డుకు డిమాండ్!

ABN , First Publish Date - 2020-12-06T23:52:07+05:30 IST

గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర సంక్షేమ చర్యలు చేపట్టాలని గల్ఫ్ ప్రవాసీ ప్రముఖుల బృందం ఆదివారం తెరాస నాయకులకు విజ్ఞప్తి చేసింది. నిధుల కేటా

ఎమ్మెల్సీ కవితను కలిసిన ప్రవాసీయుల బృందం.. సంక్షేమ బోర్డుకు డిమాండ్!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర సంక్షేమ చర్యలు చేపట్టాలని గల్ఫ్ ప్రవాసీ ప్రముఖుల బృందం ఆదివారం తెరాస నాయకులకు విజ్ఞప్తి చేసింది. నిధుల కేటాయింపుతో చట్టపరమైన బోర్డు నెలకొల్పాలని ప్రవాసీ బృందం టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను కలిసి విజ్ఞప్తి చేసింది. స్థానిక సంస్థల ప్రతినిధులు, గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారితో కలిపి మొత్తం 25 మంది సభ్యులతో ఓ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఆ బోర్డు ఛైర్మన్‌కు క్యాబినేట్ ర్యాంకు కల్పించి.. బోర్డుకు రూ.500కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ నిధులతో గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే వారికి పునరావాసం కల్పించడంతోపాటు గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5లక్షల పరిహారాన్ని చెల్లించాలని కోరారు. విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతినిధుల బృందం అభ్యర్థించింది.

 


తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీతోపాటు గృహ వసతి పథకాలలో ప్రవాసీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ బృందం కవితను కోరింది. అంతేకాకుండా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసే దళారులపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని కోరారు. కోటపాటి నర్సింహా నాయుడు ఆధ్వర్యంలో సమావేశమైన ఈ బృందంలో దాసరి సంపత్, గుగ్గిళ్ళ రవిగౌడ్, ఏముల రమేశ్, జనగామన శ్రీనివాస్, గంగుల మురళీధర్ రెడ్డి, జంగం బాలకిషన్, పరికిపండ్ల స్వదేశ్ ఉన్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు బి.బి.పాటిల్‌ను కూడా ఈ బృందం కలిసింది. 


Updated Date - 2020-12-06T23:52:07+05:30 IST