అనుకున్నది జరిగితే జీవితం కాదు: మంగ్లీ...

ABN , First Publish Date - 2020-03-01T06:48:37+05:30 IST

‘‘నేను లంబాడీ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. నా అసలు పేరు సత్యవతి. ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వలస వెళ్లి బతికే జీవితాలు మావి. అలా నాకు ఊహ తెలిసే సరికి బసినేపల్లి తండాలో ఉన్నాం. మా జాతిలో...

అనుకున్నది జరిగితే జీవితం కాదు: మంగ్లీ...

మంచి మాటకారి! పాటకారి!! జానపద గేయాలతో వచ్చిన గుర్తింపుతో సినీ గీతాలు పాడారు. ఇటీవల బంజారా భాషా చిత్రం ‘గోర్‌ జీవన్‌’ (తెలుగులో ‘స్వేచ్ఛ’ )లో కథానాయికగానూ నటించారు. తన ప్రయాణాన్ని ‘నవ్య’తో పంచుకున్నారిలా...


‘‘నేను లంబాడీ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. నా అసలు పేరు సత్యవతి. ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వలస వెళ్లి బతికే జీవితాలు మావి. అలా నాకు ఊహ తెలిసే సరికి బసినేపల్లి తండాలో ఉన్నాం. మా జాతిలో ఆడపిల్ల పుడితే అమ్మేయడమో, చంపేయడమో చేస్తారు. కానీ మా కుటుంబంలో అలా జరగలేదు. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లూ, ఓ తమ్ముడూ ఉన్నారు. నాన్న కాస్త చదువుకుని, బాధ్యత తెలిసిన వ్యక్తి. కాకపోతే మాది ఆర్థికంగా వెనకబడిన కుటుంబం. ఆరో సంవత్సరం నుంచే నాకు కష్టాలంటే ఏంటో తెలుసు. ఉదయాన్నే అమ్మానాన్న పొలం పనులకు వెళితే.. చెల్లెళ్ళనూ తమ్ముడినీ దగ్గరుండి చూసుకునే దాన్ని. స్కూల్‌ సెలవుల్లో నాన్నతోపాటు పొలం పనులు చేేసేదాన్ని. చిన్నప్పటి నుంచే నాకు పాటలంటే ఇష్టం. ఎదిగే క్రమంలో పొలం పనులు వదిలేశా. కానీ పాటల్ని మాత్రం వదులుకోలేకపోయాను. అలా సంగీతం మీద దృష్టి సారించా. అందుకు ఓ ఎన్జీఓ సంస్థ నాకు సహకరించింది. మా లంబాడీ కుటుంబాల్లో కట్టుబాట్లు ఎక్కువ. వయసు వచ్చిన అమ్మాయి ఊరు దాటి అడుగేయడమే కాదు.. గట్టిగా నోరు విప్పి మాట్లాడినా తప్పే. మరి వేదికలెక్కి పాడటానికి ఇంకెన్ని లెక్కలు ఉంటాయో ఆలోచించడండి. కానీ నాన్న ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్‌ చేశారు. పంజాబ్‌ జాతీయ పోటీల్లో మొదటి బహుమతి రావడంతో పూర్తిస్థాయిలో సంగీతంపై దృష్టిపెట్టా. ఆర్డీటీ సభ్యుల ఆర్థిక సాయంతో పదో తరగతి తర్వాత ఎస్వీ విశ్వవిద్యాలయం మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ డిప్లొమా కోర్సులో చేరాను.


అమ్మకు పెళ్లైన 12 ఏళ్లకు కడుపు పండితే అందరూ అబ్బాయే పుడతారని ఎదురుచూశారు. ఆడపిల్ల పుట్టడంతో తలొక మాట అనడం మొదలుపెట్టారట. పైగా అప్పట్లో ఆడపిల్ల పుడితే చంపేయడమో.. అమ్మేయడమో చేసేవారు. నా బతుకు ఏమవుతుందోని అమ్మ భయపడేదట. ‘నాకెందుకిలా ఆడబిడ్డని ఇచ్చావు దేవుడా’ అని బాధపడి ఏడ్చేదంటా. ఈ మధ్యనే ఆ విషయం నాకు చెప్పింది. ఇప్పుడు అమ్మ నన్ను చూసి చాలా గర్వపడుతుంది. ఇంటికి పెద్ద కొడుకులా ఉన్నానని చాలా ఆనందిస్తుంది. ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది. నాన్న ఇచ్చిన స్వేచ్ఛతోనే నేను అనుకున్నది సాధిస్తున్నా. 


మనం అనుకున్నది జరిగితే జీవితం కాదది. అనుకోనిది జరిగితే అదే జీవితం. మన పేరున రాసి పెట్టింది ఎక్కడికీ పోదని నేను నమ్ముతా. కొత్త రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఎవరికైనా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సక్సెస్‌ వచ్చే వరకూ అన్నీ భరించాలి. వాటిని అధిగమిస్తేనే ఓ మెట్టు ఎక్కగలం. హీరోయిన్‌గా నటించాలని నాకు లేదు. సింగింగ్‌ కెరీర్‌గా ఎంచుకుని వచ్చా. చివరికి వరకూ సంగీతంతోనే ఉంటా. నా అల్టిమేట్‌ గోల్‌ బాలీవుడ్‌ సింగర్‌ కావడం. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నా.


ఉద్యోగమే దిక్కు అనుకున్నా...

డిప్లొమా మొదటి ఏడాది పూర్తికావొచ్చే సమయానికి కుటుంబ కష్టాలు మరింత పెరిగాయి. చదువు ఖర్చులు ఆర్డీటీ సంస్థ భరిస్తున్నా మిగతా ఖర్చులు కుటుంబానికి భారంగా మారాయి. పంట వల్ల వచ్చే ఆదాయం తిండికే సరిపోయేది. మా చదువుల కోసం అప్పులు పెరిగాయి. కనీస అవసరాలకు అమ్మానాన్న ఇబ్బంది పడుతుంటే నేను చదువుకోవడం ఏంటనే బాధ నన్ను వెంటాడింది. డిప్లొమా మూడో సంవత్సరానికి రాగానే సంగీతం మానేస్తానని మా గురువులకి చెప్పాను. వాళ్లు ఎంత భరోసా ఇచ్చినా నాకు ఓ పక్క అమ్మానాన్న కళ్లల్లో మెదిలేవారు. అంతే కాలేజీ వదిలేసి మా తండాకి వెళ్లిపోయి ఇక ఉద్యోగమే దిక్కు అని హైదరాబాద్‌ వచ్చేశా. 


అలా.. పాపులర్‌ అయ్యా...

ఓ ప్రైవేట్‌ స్కూల్లో మ్యూజిక్‌ టీచర్‌గా చేరి, హోమ్‌ ట్యూషన్‌లు చెప్పేదాన్ని. పదివేలు చేతికొచ్చేవి. అలా టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేశా. జానపద గాయకుడు భిక్షునాయక్‌ పరిచయంతో జానపదాల కోసం గొంతు సవరించాను. ఓ ఛానెల్‌కు పాట పాడడం కోసం వెళితే.. అక్కడ యాంకర్‌గా అవకాశం ఇచ్చారు. అతి తక్కువగా మాట్లాడే నేను యాంకరింగ్‌ అనగానే భయపడ్డా. యాంకర్‌ అవతారమెత్తాక సత్యవతి పేరు కాస్తా.. మంగ్లీగా మారింది. ‘మాటకారి మంగ్లీ’ పేరుతో మొదలైన షోతో నాలో అంత హుషారుంటుందని ఊహించలేదు. తీన్మార్‌ న్యూస్‌తో తెలంగాణ ఇంటింటికీ చేరువయ్యా. ఈ బిజీలో ఎక్కడో.. పాటలకి దూరం అవుతున్నాననే భావన కలిగింది. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పాడిన ‘రేలా... రేలా’ పాట ‘సెలబ్రిటీ సింగర్‌’ని చేసింది. ఆ తర్వాత గోపీ సుందర్‌ సంగీత దర్శకత్వంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ టైటిల్‌ సాంగ్‌ పాడాను. ‘నీదీ నాదీ ఒకటే కథ’, ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మీ’ సినిమాల్లో పాడాను.


ఇవన్నీ ఒక ఎత్తైతే ‘అలవైకుంఠపురంలో’ సినిమాలో ‘రాములో రాములా’ పాట నన్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. తమన్‌గారు నా వాయిస్‌ ఎప్పుడు విన్నారో తెలియదు కానీ నాకు అవకాశం ఇచ్చారు. నా వాయిస్‌ కొత్తగా అనిపించి త్రివిక్రమ్‌గారూ, బన్నీగారూ ఓకే చెప్పారు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాట అది. అలాగే చిరంజీవిగారి పుట్టినరోజున మణిశర్మగారి సంగీత దర్శకత్వంలో పాట పాడాను. ఆ పాట విని పవన్‌ కల్యాణ్‌గారు లేచి నిల్చొని మరీ దండం పెట్టడం మరచిపోలేను. అకస్మాత్తుగా ఓ రోజు చిరంజీవి గారినుంచే పిలుపొచ్చింది. తడబడుతూ ఆయన దగ్గరికి వెళ్లా. ‘మా బన్నీ సినిమాలో ‘రాములా’ పాట నువ్వే పాడవంట కదమ్మా బావుంది’ అన్నారు. ఆ ఉత్సాహంలో ‘కొణిదెల ఇంటి..’ పాట అందుకున్నా. భావోద్వేగంతో ఆయన కళ్లు చెమర్చడం చూశా. మరు జన్మకైనా ఆ రోజును మరువలేను. 


మొదట చేయనన్నా...

‘సేవ్‌ గాళ్స్‌, సేవ్‌ ట్రీస్‌’ అనే సందేశంతో మూడేళ్ల క్రితం ‘గోర్‌ జీవన్‌’ అనే బంజారా సినిమా చేశా. పెద్ద హిట్టు. అదే సినిమా ఇటీవల తెలుగులో ‘స్వేచ్ఛ’ టైటిల్‌తో విడుదలైంది.’’

- ఆలపాటి మధు

Updated Date - 2020-03-01T06:48:37+05:30 IST