ఆమె చూపంతా న్యాయం వైపే!

ABN , First Publish Date - 2020-09-03T05:30:00+05:30 IST

న్యాయదేవత మాదిరిగానే ఆమె కూడా చూడలేరు. కానీ న్యాయం ఏ పక్షాన ఉందో స్పష్టంగా గ్రహిస్తారు. సామాజిక న్యాయం కాంక్షిస్తూ ఒక సంస్థను కూడా స్థాపించారు. మద్రాసు హైకోర్టులో దృష్టి లోపం ఉన్న తొలి మహిళా లాయర్‌ కర్బగం మాయవన్‌ తనలాంటి ఎందరికో అండగా నిలుస్తున్నారు...

ఆమె చూపంతా న్యాయం వైపే!

న్యాయదేవత మాదిరిగానే ఆమె కూడా చూడలేరు.  కానీ న్యాయం ఏ పక్షాన ఉందో స్పష్టంగా గ్రహిస్తారు.  సామాజిక న్యాయం కాంక్షిస్తూ ఒక సంస్థను కూడా స్థాపించారు. మద్రాసు హైకోర్టులో దృష్టి లోపం ఉన్న తొలి మహిళా లాయర్‌ కర్బగం మాయవన్‌ తనలాంటి ఎందరికో అండగా నిలుస్తున్నారు.


‘వ్యక్తులు నన్ను ఎగతాళి చేసినప్పుడు కలిగిన బాధ కన్నా వ్యవస్థల నుంచి ఎదురైన అవమానాలే ఆవేదన కలిగించాయి. జీవితం పట్ల నా దృక్పథాన్ని అవి పూర్తిగా మార్చాయిు’ అంటారు ఇరవయ్యారేళ్ళ కర్బగం మాయావన్‌. శారీరకమైన వైకల్యాలున్న వ్యక్తులను సమాజం ఎంత హీనంగా చూస్తుందో ఆమెకు తెలుసు. చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోయినా ఆమె పట్టుదలగా ఇంజనీరింగ్‌ చదివారు. ఆ తరువాత న్యాయ విద్య అభ్యసించారు. తమిళనాడులోని మద్రాసు హైకోర్టులో దృష్టి లోపం కలిగిన తొలి మహిళా న్యాయవాదిగా మారారు. సామాజిక అసమానతలకు బాధితులైనవారి కోసం పోరాటం సాగిస్తున్నారు. 


కర్బగం తల్లితండ్రులు నిరక్షరాస్యులు. చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబం వారిది. బాల్యంలోనే కర్బగానికి కుడి కంటిలో సమస్య ఏర్పడింది. వైద్యులు ఆమెను పరీక్షించి ‘కంజెనిటల్‌ గ్లూకోమా’ అని తేల్చారు. అప్పటికే ఆలస్యమైంది. ఆ కన్ను దృష్టి పూర్తిగా పోయింది. మరోవైపు ఎడమ కంటి చూపు సైతం రోజు రోజుకూ క్షీణించింది. చెన్నైకి చెందిన ఆమె బంధువు ఒకరు శస్త్రచికిత్స చేయించారు. దానివల్ల పాక్షికంగా ఒక కంటితో చూడగలిగినా, అది కూడా ముప్ఫై శాతమే! 


ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా వ్యవస్థలను కర్బగం నిలదీస్తున్నారు. చీఫ్‌ జస్టిస్‌ తహిల్రామణిని చెన్నై నుంచి మేఘాలయకు బదిలీ చేయడంపై ఆమె పిల్‌ దాఖలు చేశారు.  ముఖ్యమంత్రి సహాయ నిధి లావాదేవీల్లో పారదర్శకతను కోరుతూ ప్రభుత్వంపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ చర్చనీయాంశమయింది.


చదువెందుకన్నారు...  

‘‘నాకు చూపు సరిగా లేదని నా తల్లితండ్రులు బడిలో చెప్పలేదు. టీచర్‌ రాసింది చూడాలంటే బ్లాక్‌ బోర్డ్‌కు బాగా దగ్గరగా వెళ్ళేదాన్ని. మిగిలిన పిల్లల్ని డిస్ట్రబ్‌ చేస్తున్నానని టీచర్లు ఫిర్యాదు చేసేవారు. దీంతో స్పెషల్‌ స్కూల్లో చేర్పిస్తానని మా అమ్మా నాన్నా చెప్పారు. అయితే మా హెడ్‌ మిస్ట్రెస్‌ జోక్యం చేసుకోవడంతో అదే బడిలో కొనసాగాను. నా తోటి విద్యార్థులు ఇంగ్లీష్‌ పాఠాలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి సాయం చేసేదాన్ని. కానీ పరీక్షల సమయంలో నేను చెబుతూ ఉంటే రాయడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఏది ఏమైనా డాక్టర్‌ కావాలన్నది నా కోరిక. ఎంట్రన్స్‌లో తగిన మార్కులు కూడా సంపాదించాను. కానీ నా వైకల్యం కారణంగా సీటు రాలేదు. దాంతో ‘అన్నా విశ్వవిద్యాలయం’లో బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌లో చేరాను. ఆ సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయిు’’ అంటూ ఆ సంఘటనలను కర్బగం గుర్తు చేసుకున్నారు. 


‘‘వికలాంగుల కోటాలో నాకు సీటు వచ్చింది. డిజేబిలిటీ సర్టిఫికెట్‌ కోసం నన్ను, మరికొందరిని ఓ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళమని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ఆసుపత్రిలో మమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టారు. మా వైకల్యాన్ని ఎగతాళి చేశారు. ‘వికలాంగులైన మీకు చదువెందుకన్నా’రు. ఆవేదనగా, అవమానంగా అనిపించింది’’ అని చెప్పారామె. లాలో గోల్డ్‌ మెడల్‌... 

మరోసారి ఆమె బస్‌ పాస్‌ పోయింది. ఫిర్యాదు చేసి, ఎన్‌ఓసీ తీసుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళారు. అక్కడా అవమానాలే. కర్బగం ఫిర్యాదు తీసుకోవడం మాట అటుంచితే, ఆమె మాట కూడా ఎవరూ వినిపించుకోలేదు. చివరకు సీఎం సెల్‌కు ఫిర్యాదు చేశాక సమస్య పరిష్కారమైంది. ‘‘ఇలాంటి అనుభవాలు నాలో ఆలోచనలు రేకెత్తించాయి. నేనే కాదు, శారీరక వైకల్యాల కారణంగా అవమానాలు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించే స్థాయికి చేరాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ అవకాశాలు వచ్చినా వదిలేసి, లా స్కూల్‌లో చేరాను’’ అన్నారు కర్బగం. ప్రతిష్టాత్మకమైన ‘డాక్టర్‌ అంబేద్కర్‌ లా యూనివర్సిటీ’ నుంచి న్యాయ విద్యలో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారామె. 


తనలాంటివారికి చేయూత... 

లా పూర్తి చేశాక క్రిమినల్‌ లాలో మెలకువలు నేర్చుకోవడానికి ఓ సీనియర్‌ న్యాయవాది దగ్గర చేరారు కర్బగం. అయితే ఆమెను న్యాయస్థానానికి తీసుకువెళ్ళడానికి ఆ న్యాయవాది ఇష్టపడేవారు కాదు. ఆ తరువాత మరో సంస్థలో చేరారు. సీనియర్ల సహాయంతో కేసులు వాదించడం మొదలుపెట్టారు. మొదట్లో ఆమెను తేలిగ్గా తీసుకున్నవారే ఆ తరువాత ఆమె ప్రతిభను గుర్తించి గౌరవించడం మొదలుపెట్టారు. ‘‘నా వైకల్యాన్ని అడ్డుపెట్టుకొని బాధ్యతల నుంచి తప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను డ్రాఫ్ట్‌ చేయగలను. కేసులు ఫైల్‌ చెయ్యగలను. కోర్టులో వాదించగలను. నాలాంటి ఇబ్బందులున్న వ్యక్తులకు వీలైనంత సాయం చెయ్యాలన్న తపనతో ‘వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌లెస్‌ పీపుల్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేశాను. వైకల్యాలున్న వారికి సాధికారత కల్పించడం దీని లక్ష్యం’’ అంటారామె. వినిడికి సమస్య ఉన్న ఏడుగురు వ్యక్తులు చెన్నైలో రెస్టారెంట్‌ తెరవడానికి ఈ సంస్థ సాయపడింది. ఆ రెస్టారెంట్‌లో వంట, వడ్డన, బిల్లింగ్‌... ఇలా అన్నీ సైగలతోనే జరిగిపోతాయి. 


ప్రజాహితం కోసం... 

ఇలా వైకల్యాలు ఉన్నవారికి న్యాయపరంగా, సామాజికపరంగా సాయం అందిస్తూనే మరోవైపు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా వ్యవస్థలను కర్బగం నిలదీస్తున్నారు. చీఫ్‌ జస్టిస్‌ తహిల్రామణిని చెన్నై నుంచి మేఘాలయకు బదిలీ చేయడంపై కర్బగం పిల్‌ దాఖలు చేశారు. ఆ కేసులో గెలవకపోయినా ఆమె పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి లావాదేవీల్లో పారదర్శకతను కోరుతూ ప్రభుత్వంపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ చర్చనీయాంశమయింది. 


‘సౌకర్యాల’ కోసం పోరు... 

‘‘వ్యవస్థల దృక్పథంలో మార్పు వస్తేనే సామాజిక న్యాయం సాధ్యం. దానికోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. తమిళనాడులో ‘హిందూ రెలిజియస్‌ అండ్‌ ఛారిటబుల్‌ ఎండోమెంట్‌ బోర్డు’ పరిధిలో 38 వేల ఆలయాలున్నాయి. వాటిల్లో శారీరక వైకల్యాలు ఉన్నవారు దర్శించుకోడానికి వీలైన సౌకర్యాలు గలవి 18 మాత్రమే. అన్ని ఆలయాల్లో తగిన సౌకర్యాల కోసం కేసు వేశాను. అది నడుస్తోంది. అంతెందుకు, ఆఖరికి న్యాయస్థానాలు కూడా వైకల్యాలు ఉన్నవారికి అనుకూలంగా లేవు. ఒక ర్యాంప్‌ ఏర్పాటు చేసినంత మాత్రాన డిజేబుల్డ్‌ ఫ్రెండ్లీ కాబోదు’’ అంటారు కర్బగం. ప్రస్తుత కరోనా సమయంలో ఎలాంటి సాయానికీ నోచుకోని ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల పునరావాసం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు. 


సమాజ దృక్పథం మారాలి... 

‘‘శారీరక వైకల్యాలున్న వారి హక్కుల గురించి చాలామందికి ఇప్పటికీ అవగాహన లేదు. ఇది మానవహక్కుల సమస్యగా గుర్తిస్తున్నా, సమాజం ధోరణిలో అవసరమైన మార్పు రావడం లేదు. అలాంటి మార్పు కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. నా జీవితంలో ప్రతి రోజూ పోరాటమే. నాలాంటి వారి కోసం చేస్తున్న ఆ పోరాటాన్ని ఆపేది లేదు. వైకల్యాలున్న వారంటే అందరికీ చిన్నచూపే. ఈ పరిస్థితి మారాలి. వారి పట్ల సమాజం దృక్పథంలో మార్పు రావాలి. వారి అవసరాలను భిన్నంగా చూడాలి. అది జరగాలంటే వైకల్యాలున్న మహిళలు న్యాయ రంగంలో ఎక్కువగా రావాలన్నది నా ఆకాంక్ష’’ అంటారామె. ఆ ఆకాంక్ష నెరవేరడానికి స్పూర్తి ఆమే అవుతారనడంలో సందేహం లేదు.
Updated Date - 2020-09-03T05:30:00+05:30 IST