‘కాలా చావల్‌’ కహానీ!

ABN , First Publish Date - 2020-09-20T18:19:21+05:30 IST

నల్లబియ్యాన్ని సూపర్‌మార్కెట్లలో చూడటమే కానీ.. మన చేలల్లో కనిపించవు. ఆ కొరతను తీర్చేందుకు ముందుకొచ్చింది ఒక సన్నకారు మహిళా రైతు..

‘కాలా చావల్‌’ కహానీ!

నల్లబియ్యాన్ని సూపర్‌మార్కెట్లలో చూడటమే కానీ.. మన చేలల్లో కనిపించవు. ఆ కొరతను తీర్చేందుకు ముందుకొచ్చింది ఒక సన్నకారు మహిళా రైతు..


మనందరికీ సాధారణంగా తెల్ల బియ్యంతో వండే అన్నం మాత్రమే తెలుసు. అయితే ఈమధ్య అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో బ్రౌన్‌ రైస్‌ వైపు చూస్తున్నారు. కానీ బియ్యంలో కేవలం ఒకటి రెండు రకాలే కాదు... సుమారు యాభై రకాలున్నాయి. తెల్ల బియ్యం మాత్రమే తెలిసిన మనకు నల్లబియ్యం, ఎర్ర బియ్యం రుచులను పరిచయం చేస్తున్నారు సిద్ధిపేట జిల్లాకు చెందిన మహిళా రైతు జక్కుల రేణుక. ఆమె తన భర్తతో కలిసి మూడు ఎకరాల్లో, అరుదైన వరి వంగడాలతో అనేక ప్రయోగాలు చేస్తున్నారు.


మణిపూర్‌ సాంప్రదాయ వైద్యంలో నల్లబియ్యాన్ని ఔషధంగా వినియోగిస్తారు. సామూహిక ఉత్సవాల్లో ఈ బియ్యంతో వండిన ‘చాక్‌హావో’ అనే వంటకాన్ని వడ్డిస్తారు. నల్లబియ్యంలో అనేక పోషక విలువలతో పాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్టుగా పరిశోధనల్లో వెల్లడయ్యింది. ‘‘బ్రౌన్‌ రైస్‌తో పోల్చితే బ్లాక్‌రైస్‌లో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, విటమిన్‌-బి, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ బియ్యాన్ని పై పొర తొలగించకుండా (పాలిష్‌ చేయకుండా) వండుకుని తింటే, గ్లైసిడిన్‌ తక్కువగా ఉండటం వల్ల షుగర్‌ పేషంట్లకు మేలు చేస్తుంది’’ అంటున్నారు నల్లగొండ జిల్లాలోని వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సీహెచ్‌ దామోదర్‌రాజు.  


ఇప్పుడంటే ప్రజలు పాలిష్‌ బియ్యానికే అలవాటు పడ్డారు. తెల్లగా, ముత్యాల్లా మెరిసే ఫలానా బియ్యంతో వండితేనే కానీ నోట్లోకి ముద్ద దిగదని చెబుతుంటారు. కానీ పూర్వకాలంలో రైతులు పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాలను సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా కాపాడారు. హరిత విప్లవంతో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు అందుబాటులోకి రావడంతో సంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యాయి. అలాంటి వాటిల్లో ‘బ్లాక్‌ రైస్‌’, ‘రెడ్‌ రైస్‌’ ముఖ్యమైనవి. వాటికి తిరిగి జీవం పోయాలని ప్రయత్నిస్తున్నారు సిద్ధిపేట జిల్లా, తొగుట మండలంలోని లింగాపూర్‌ గ్రామానికి చెందిన జక్కుల రేణుక. ఆమె తన భర్త తిరుపతితో కలిసి మూడు ఎకరాల్లో సేంద్రీయ పద్ధతుల్లో నల్ల వరిని సాగుచేస్తున్నారు. 


మూడెకరాలు... 51 రకాలు...

రెండేళ్ల క్రితం రేణుక ‘భారత్‌ బీజ్‌ స్వరాజ్‌’ సంస్థ నుంచి కాలాబట్టి (నల్ల బియ్యం), చింతలూరు సన్నాలు, దశుమతి రకం, చిట్టి ముత్యాలు వంటి విత్తనాలను సేకరించి పండించారు. వాటికి డిమాండ్‌ ఏర్పడటంతో ప్రస్తుతం మూడెకరాలను చిన్న కమతాలుగా మార్చి 51 రకాల వరి విత్తనాలు అభివృద్ధి చేశారు. వాటిలో నల్లధాన్యం, ఎర్రధాన్యం ముఖ్యమైనవి. కరువు ప్రాంతాల్లో కూడా దిగుబడినివ్వడం వీటి ప్రత్యేకత. వీటి పైరుతో పాటు ధాన్యం కూడా కారు నలుపులో, ఊదారంగులో ఉంటాయి. వండిన అన్నం కూడా అదే రంగులో రుచికరంగా ఉంటుంది. గంజిలో పోషకాలు అధికం. ‘‘ఈ పంటలో మేము రసాయనాల జోలికి వెళ్లం. పశువులు పేడ, మూత్రాన్ని సేకరించి అందులో శనగపిండి, బెల్లం కలిపి జీవామృతం తయారుచేసి, వారానికోసారి పొలంలో చల్లుతున్నాం’’ అన్నారు రేణుక. కషాయాలు, జీవామృతం తయారీలో ఆమె భర్త సహకరిస్తున్నారు. 


2 కిలోల విత్తనాలు చాలు...

రెండేళ్ల నుంచి రేణుక నల్లబియ్యాన్ని శ్రీవరి విధానంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వరి కోసం ఒక ఎకరానికి 50 నుంచి 60 కిలోల విత్తనాలు అవసరం. అయితే శ్రీవరి పద్ధతిలో 2 కిలోలు సరిపోతాయి. కలుపు నివారణ సులువుగా ఉంటుంది. ఎకరానికి 20 బస్తాల (75 కిలోలు) వరకు దిగుబడి వస్తుంది. దీని పంటకాలం నాలుగు నెలలు. దీనితో పాటు సుగంధాన్నిచ్చే బియ్యం, ఎర్ర బియ్యాన్ని (నవర) కూడా సాగు చేస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరో 50 మంది రైతులు కూడా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ‘‘సాధరణ వరి రకాలతో పోల్చితే సగం దిగుబడి మాత్రమే వచ్చే ఈ వంగడాన్ని అరుదుగా పండిస్తున్నారు. కాబట్టి డిమాండ్‌ పెరిగి కిలో బియ్యం రూ.150కి పైగా ధర పలుకుతోంది. మాతో పాటు ప్రకృతి సాగు చేస్తున్న రైతులతో త్వరలోనే నాటు వరి విత్తనాల జాతరను నిర్వహించాలని అనుకుంటున్నాం’’ అంటున్న రేణుకను 9000269724 నెంబర్‌లో సంప్రదించవచ్చు.


శ్యాంమోహన్‌ (94405 95858)

Read more