అనగనగా ఒక పక్షి కోసం..

ABN , First Publish Date - 2020-10-11T15:58:14+05:30 IST

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌.. యాభై కిలోమీటర్ల దూరంలో థార్‌ ఎడారి.. అందులో ఎడారి జాతీయపార్కు (డిజర్ట్‌ నేషనల్‌ పార్క్‌). మూడువేల చదరపు కిలోమీటర్లు...

అనగనగా ఒక పక్షి కోసం..

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌.. యాభై కిలోమీటర్ల దూరంలో థార్‌ ఎడారి.. అందులో ఎడారి జాతీయపార్కు (డిజర్ట్‌ నేషనల్‌ పార్క్‌). మూడువేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. అంత ఎడారిలోనూ కొన్ని ప్రత్యేక వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అక్టోబరు మాసం వస్తే చాలు. బైనాక్యులర్స్‌, కెమెరాలు, వీడియోలు పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వస్తారు పర్యాటకులు. ఆ అనంతమైన ఎడారిలో ప్రత్యేకించి ఒకే ఒక పక్షి కోసం.. రాత్రింబవళ్లు మైళ్లకు మైళ్లు ప్రయాణిస్తారు. ఇసుకమేటల్లో వజ్రాల వేటలా.. ఆ పక్షి కోసం కళ్లింతలు చేసుకుని అన్వేషిస్తారు. ఒక్కోసారి రోజులు, వారాలు వెదికినా కనిపించదు. ఒకవేళ ప్రత్యక్షమైనా రెండు మూడు క్షణాలకు మించి ఉండదు. అలాంటి పక్షి కోసం ఎందుకింత ఆరాటం? ఎందుకీ శ్రమ? ఈ భూమ్మీద ఎన్నో వింత జంతువులు, విభిన్నమైన పక్షులు ఉండగా.. ఆ పక్షి కోసమే ఎందుకొస్తున్నారు? ఎందుకంటే ప్రపంచంలో అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షి కనుక. ఈతరం తప్పితే మరో తరం చూడలేదు. ప్రముఖ పక్షిశాస్త్రవేత్త సలీం అలీ నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వరకు ఆ పక్షి సంరక్షణకు ఆరాటపడిన వాళ్లే! కోట్ల రూపాయల ధనం వెచ్చించి.. ప్రభుత్వాలు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. అయినా ఫలితం దక్కడం లేదు. ఇప్పటికీ అక్కడక్కడ ప్రత్యక్షమై.. మళ్లీ జీవశాస్త్రవేత్తల్లో ఆశలు రేపుతున్న దాని పేరు ‘బట్టమేక పక్షి’ 

(గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌).


నాలుగు అడుగుల ఎత్తు, పదిహేను కేజీల బరువుతో చూడముచ్చటగా అనిపిస్తుంది బట్టమేకపక్షి. మన దేశంలోని అనేక గడ్డి మైదానాల్లో హాయిగా సంచరిస్తూ బతికేది. ఇవెక్కడున్నా గుంపులు గుంపులుగానే జీవిస్తాయి. 1969లో ధర్మకుమార్‌ సిన్హాజీ అనే పర్యావరణ శాస్త్రవేత్త తొలిసారి బట్టమేక పక్షుల గణాంకాలను సేకరించాడు. అప్పుడు తేలిన సంఖ్య 1,260. అంతకు తొమ్మిదేళ్ల మునుపు ఇండియన్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశంలో.. బట్టమేక పక్షిని మన దేశ జాతీయ పక్షిగా ప్రకటించాలని ప్రముఖ పక్షి శాస్త్రవేత్త డా.సలీం అలీ డిమాండ్‌ చేశారు. ఈ పక్షి పేరు గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ కనుక.. దీన్ని తప్పుగా ‘బాస్టర్డ్‌’గా ఉచ్చరించే ప్రమాదం ఉంది కాబట్టి.. ఎందుకో ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. దాంతో నెమలి జాతీయ పక్షి అయ్యింది. ఆ తరువాత అనేకసార్లు చర్చలు సాగినా.. ఆ ప్రతిపాదన ఫలించలేదు. ఈ పక్షి గొప్పదనంపై అనేక పుస్తకాలు, పరిశోధనలు జరిగాయి. జర్నల్స్‌లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. డాక్యుమెంటరీలు తీశారు. 


అరబ్బులకు ఆహారం..

1970 ప్రాంతంలో అరబ్బులు మన దేశానికి విపరీతంగా తరలొచ్చారు. ఒకవైపు వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించారు. వాళ్ల దేశం నుంచీ వచ్చే విదేశీమారకానికీ మన ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చేవి. అరబ్బుల జీవనశైలి భిన్నంగా ఉంటుంది. వాళ్లు మాంసప్రియులు. బట్టమేక పక్షి మాంసం రుచిగా ఉంటుందని, వేటాడి చంపడం మొదలుపెట్టారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం వేటాడటం నేరం. అయితే వాళ్ల పరపతి ముందు చట్టానికి విలువ లేకుండా పోయింది. అప్పట్లో ఇందిరాగాంధీ కూడా బట్టమేకను అరుదైన పక్షిగా గుర్తించి, తపాలాబిళ్లను విడుదల చేశారు కూడా. ఆ కాలంలో ఇవి ఎక్కువగా సంచరించే రాజస్థాన్‌, మహారాష్ట్ర ప్రాంతాల్లో పక్షుల పరిరక్షణ కోసం ఇందిరాగాంధీ సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ ప్రయత్నం కొంతవరకే ఫలించింది. 1978 వచ్చేసరికి ఈ పక్షుల సంఖ్య 750 కి పడిపోయింది. ఇక పరిస్థితి విషమిస్తోందని ముందుకొచ్చిన రాజస్థాన్‌ ప్రభుత్వం... పరిరక్షణ కేంద్రాలను నెలకొల్పింది. 1982లో తమ రాష్ట్ర పక్షిగా ఆ రాష్ట్రం ప్రకటించింది. ‘బొంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీ’ కూడా రంగంలోకి దిగింది. ఈ పక్షి జాతిని అభివృద్ధి చేసేందుకు.. పరిశోధనలు చేసింది. దీనివల్ల కొన్ని చోట్ల పక్షుల సంఖ్యను స్వల్పంగా పెంచగలిగారు. 2008 వచ్చేసరికి మూడొందల బట్టమేక పక్షులు మాత్రమే ఉన్నట్లు తేలింది. అలా రాను రాను అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. వీటి సంఖ్య తగ్గడానికి వేట ఒక కారణం అయితే.. సహజ నివాస ప్రాంతాలైన గడ్డి మైదానాలు తగ్గిపోతుండటం మరొక కారణం. 


గడ్డిమైదానాలే ఆవాసాలు..

పక్షుల రక్షిత అభయారణ్య ప్రాంతాల్లోని గడ్డి మైదాన భూములు ఎక్కువ భాగం ప్రైవేటు వ్యక్తులవి. ఉదాహరణకు మహారాష్ట్రలోని బట్టమేక పక్షుల పరిరక్షణ కేంద్ర ప్రాంతం 8,500 చదరపు కిలోమీటర్లు విస్తరించిన గడ్డి మైదానంలో తొంభై అయిదు శాతం ప్రైవేటు వ్యక్తులకు చెందినదే. అందువల్ల అటవీ శాఖ అధికారులకు ఈ భూములపై నియంత్రణ లేకుండా పోయింది. రక్షిత అభయారణ్యాలకు దగ్గరగా ఉన్న పంట పొలాలలోని గింజలను తినడానికి వస్తుంటాయివి. అయితే ఈ మధ్య రైతులు రకరకాల పంటలను మారుస్తుండటంతో పక్షులకు తిండి లేకుండా పోయింది. రసాయన మందుల ప్రభావానికీ గురవుతున్నాయివి.

బట్టమేక పరిరక్షణ కోసం అభయారణ్యాల్లో ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ.. శ్రద్ధ పెట్టడం లేదు. గడ్డి మైదానాల్లోకి, అరణ్యాల్లోకి పశువులు వెళుతుండటంతో పక్షులు కలత చెందడం వల్ల.. గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి అవరోధంగా మారుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అడవుల్లో వీటి సంఖ్య తగ్గిపోతున్నా.. ప్రభుత్వ నివేదికలు మాత్రం వాస్తవాన్ని దాచిపెడుతున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్‌, గుజరాత్‌లలో తప్ప.. మిగిలిన చోట్ల వీటి జాడ దాదాపు కనిపించడం లేదనే చెప్పాలి. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నందికొట్కూరులోని రోళ్లపాడు సమీపంలోని అడవులకు గత పదేళ్ల నుంచి వెళుతున్నాను. 1992 జూన్‌ మొదటివారంలో అక్కడ మూడు రోజులు ఉంటే.. కేవలం రెండు బట్టమేక పక్షులు కనిపించాయి. ఆ తరువాత ఎన్నిసార్లు వెళ్లినా కనిపించలేదు..’’ అన్నారు ఈ పక్షులపై అధ్యయనం చేస్తున్న వ్యాస రచయిత. 


ఏడాదికి ఒక గుడ్డు..

బట్టమేక పక్షులు అంతరించిపోవడానికి వాటి అరుదైన సంతానోత్పత్తి కూడా ఒక ప్రధాన సమస్య. ఒక ఆడ పక్షి ఏడాదికి కేవలం ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. అది కూడా నేల మీద ఎలాంటి గూడు కట్టుకోకుండా.. ఎండుగడ్డి లేదా పొదల్లో పెడుతుంది. గడ్డి మేయడానికి వచ్చే పశువులు గుడ్లను తొక్కినప్పుడు పగిలిపోతుంటాయి. అలా ఒక పక్షి గుడ్డు నాశనం అయితే.. అది మళ్లీ గుడ్డు పెట్టడానికి ఏడాది పడుతుంది. కొన్నిసార్లు ఎడారి జాతీయ పార్కులో ఇలాంటి గుడ్లను ఎడారి నక్కలు, అడవి కుక్కలు తినేస్తుంటాయి. దీంతో బట్టమేక పక్షుల సంతానోత్పత్తికి తీవ్రమైన అవరోధం కలుగుతోంది. 2018 నాటి సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కేవలం 150 బట్టమేక పక్షులు మాత్రమే మిగిలాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం మన దేశంలో బతికి ఉన్న నూటా యాభై బట్టమేక పక్షుల్లో.. నూటా ఇరవై రెండు వరకు ఎడారి జాతీయ ఉద్యానవనంలోనే ఉన్నాయి. ఇక్కడ కూడా వీటికి రక్షణ లేదు. ఎందుకంటే ఈ మధ్య కొన్నేళ్ల నుంచి ఎక్కడ చూసినా గాలిమరల సంఖ్య పెరుగుతోంది. అత్యధిక వోల్టేజి విద్యుత్‌ తీగలు శాపంగా మారాయి. కరెంటు తీగల్ని, వేగంగా తిరిగే గాలిమరల్ని ఢీకొని.. ఎక్కువగా చనిపోతుండటం బాధాకరం. బట్టమేక పక్షులు సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది కేజీల బరువు ఉండటంతో.. ఎక్కువ ఎత్తుకు ఎగరలేవు. ఎదురుగా ఏదైనా అడ్డంకి ఉన్నా గుర్తించలేవు. దాంతో చనిపోతున్నాయి. ఏటా ఇక్కడి ఎడారి ఉద్యానవనంలోని బట్టమేక పక్షులలో పదిహేను శాతం వరకు ఇలా విద్యుత్‌ తీగలకు బలవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పినా పక్షుల సంరక్షణ అనేది ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోతున్నది. 


కేంద్రం ప్రత్యేక ప్రాజెక్టు..

ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతి పక్షి.. కళ్ల ముందే అంతరించిపోతుంటే జీవశాస్త్రవేత్తలు తట్టుకోలేకపోతున్నారు. ఈ భూగోళం మీద జీవ వైవిధ్యం నశిస్తే చాలా ప్రమాదం. ప్రతి జీవీ బతికిబట్టకట్టాలి. దాని జాతిని సంరక్షించుకోవాలి. ఇలా ఒక్కో ప్రాణి అంతరించిపోతుంటే.. పర్యావరణానికి హాని తలెత్తినట్లేనని గుర్తించి.. మార్పులు తీసుకురావాలి. ఇది యావత్తు ప్రపంచం ఆలోచించాల్సిన పెద్ద విషయం. ఈ నేపథ్యంలో- బట్టమేక పక్షుల పరిరక్షణ కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పందించింది. బట్టమేక పక్షుల పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఎడారి జాతీయ ఉద్యానవనం (డిసర్ట్‌ నేషనల్‌ పార్క్‌)లో ‘భారత వన్య ప్రాణుల ఇనిస్టిట్యూషన్‌’తో కలిసి, స్థానిక ప్రభుత్వ సహకారంతో కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు సైతం నిధులు అందించాయి. ఆ పరిశోధన సంస్థలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు.. అడవుల్లో మైళ్లకు మైళ్లు తిరుగుతూ.. ఆడబట్టమేక పక్షులు గుడ్లు పెట్టే ప్రాంతాల్ని కనుక్కుంటున్నారు. ఆ గుడ్లను సేకరించి.. భద్రంగా ఒక ప్రత్యేక వాహనంలో కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రానికి తరలిస్తున్నారు. అలా గత సంవత్సర కాలంలో పది గుడ్లను సేకరించగా.. వాటిలో తొమ్మిది గుడ్లను విజయవంతంగా ఇన్‌క్యుబేటర్స్‌ (కృత్రిమంగా గుడ్లను పొదిగించే యంత్రం)లో ఉంచి, పిల్లలను పొదిగించారు. అందులో జన్మించిన బుల్లి బట్టమేక పక్షులను కంటికిరెప్పలా కాపాడుతున్నారు. పిల్లలకు ద్రవరూపంలోను, ఘనరూపంలోనూ ఆహారాన్ని అందిస్తూ.. అవి మనుషులతో కలిసి బతికేలా సున్నితమైన శిక్షణ కూడా ఇస్తున్నారక్కడ. పది నెలల కాలంలో కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రంలోనే పెంచిన తరువాత.. వాటిని సహజ నివాసిత ప్రాంతాలైన గడ్డిమైదానాల్లోకి వదిలివేస్తున్నారు. ఇది కొంత ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో.. రాజస్థాన్‌ ప్రభుత్వం రూ.12.9 కోట్లు కేటాయించింది.

డా.సుమిత్‌ ఢోకియా అనే పరిశోధకుడు వందమంది ఔత్సాహికులైన యువకులతో పశ్చిమ రాజస్థాన్‌లో, ఇతర పరిశోధకులతో కలిసి 2015 నుంచి.. ఈ బట్టమేక పక్షుల పరిరక్షణ ప్రాజెక్టుని కొనసాగిస్తున్నారు. ఈ వాలంటీర్లు అడవుల్లో తిరుగుతూ పక్షుల ఉనికిని గమనిస్తూ.. వాటి అక్రమ వేటను గుర్తించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తారు. వీరి కృషి అభినందనీయం. కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు మరింత సఫలం అయితే.. ఈ భూగోళం మీద మాయమైపోతున్న మరో అద్భుతజీవిని బతికించుకున్న వాళ్లం అవుతాం. జీవవైవిధ్యాన్ని కొంతైనా కాపాడగలుగుతాం. ఈ తరంలో ఒక పక్షి అంతరించిపోవచ్చు. మరో తరానికి మరొక జంతువు కనుమరుగు కావొచ్చు. ఇలాగే ప్రాణుల అంతర్థానం జరిగితే.. కొన్ని లక్షల ఏళ్లకు మనిషి కూడా మాయమైపోతాడేమో? అందుకే మనమంతా జంతుజాలాన్నీ పక్షుల్నీ సమస్త జీవుల్నీ ప్రేమిద్దాం. వాటికి కష్టమొస్తే స్పందిద్దాం.. సమస్త శక్తుల్నీ వినియోగించి అయినాసరే.. బతికించుకుందాం. 


జన్యు వైవిధ్యం కోల్పోలేదు..

ఏటికేడు గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ పక్షులు తగ్గిపోతున్నప్పటికీ.. వీటికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో గుంపులు గుంపులుగానే ఇప్పటికీ జీవిస్తాయవి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఎడారి ప్రాంతంలో మనుగడ సాగిస్తున్నప్పటికీ.. జన్యుపరమైన వైవిధ్యాన్ని మాత్రం కోల్పోలేదని పరిశోధనల్లో తేలింది. ఇది ఈ పక్షి జాతిని అభివృద్ధి చేసుకోవడానికి కొంత ఊరట కలిగించే విషయం. కానీ, చాలా కట్టుదిట్టమైన చర్యలతో ఈ ఎడారి ఉద్యానవనంలోని పక్షుల సహజ నివాస ప్రాంతాలను కాపాడుకోకపోతే, కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రంలో అభివృద్ధి చేస్తున్న పిల్లలు బతికిబట్టకట్టకపోతే... రానున్న కొన్నేళ్లలోనే ఈ జాతి పక్షులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.


కర్నూలు జిల్లాలోనూ ఉన్నాయి..

‘‘పుట్టిన ప్రతి ప్రాణికీ ఒక జీవవైవిధ్య విలువ ఉంటుంది. అది వెలకట్టలేనిది. పరిశోధనలకు సైతం అందనిది. ఇప్పుడెన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయని మనమంతా ఆందోళన చెందుతున్నాం. అందులో ఒకటి బట్టమేక పక్షి. కొన్నేళ్ల నుంచి నేను ఆ పక్షిపై జరుగుతున్న అధ్యయనాలు, పరిశోధనలను తెలుసుకుంటూ వస్తున్నాను. పర్యావరణ ప్రేమికునిగా ఆ సమాచారం సేకరిస్తున్నాను. అందులో భాగంగానే కొన్నేళ్ల కిందట నేను బట్టమేక పక్షులను చూసేందుకే రాజస్థాన్‌లోని ఎడారి జాతీయ పార్కుకు వెళ్లాను. ఒక జీపు తీసుకుని ప్రతి రోజు వెళ్లేవాణ్ణి. కానీ ఆ పక్షులు ఒక్క రోజు కూడా కనిపించలేదు. ఆఖరి రోజు ఆశతో మళ్లీ వెళ్లాను. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో రెండు బట్టమేక పక్షులను చూసే భాగ్యం కలిగింది. ఆ సువిశాలమైన ఎడారి ఇసుక ఎత్తుపల్లాలలో.. జీపులో నుంచి ఎక్కడ పడిపోతామోనన్న భయం ఒక వైపు.. దేశంలో అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షిని చూడబోతున్నామన్న ఉద్విగ్నిత మరో వైపు. ఎందుకంటే నేను వెళ్లిన అదే సంవత్సరం జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బట్టమేక పక్షుల అభయారణ్యంలో రెండు బట్టమేక పక్షుల్ని చూశాను. రాజస్థాన్‌లోని ఎడారి జాతీయ పార్కులో కూడా రెండు పక్షుల్ని మాత్రమే.. అదీ దూరం నుంచీ.. బైనాక్యులర్స్‌తో చూశాను. అలా చూస్తుండగానే రెండు నిమిషాల్లోనే ఎగిరిపోయాయి. ఈ పక్షులు ఏ మాత్రం అలికిడి అయినా.. దూరం నుంచీ వాహనాల శబ్దాలు విన్నా.. వెంటనే తుర్రుమన్నాయి. అందువల్ల టెలిలెన్స్‌ అమర్చిన కెమెరాలతో వీటిని ఫోటోలు తీయడం కూడా కష్టమే. పరిశోధనలో భాగంగా దేశ విదేశీ పరిశోధకులు కూడా బట్టమేకపక్షుల్ని వెతుక్కుంటూ వస్తుంటారు..’’ అన్నారు రత్నకుమార్‌.


ఆడపక్షిని ఆకర్షించేందుకు..

ఈ పక్షులు జతకట్టే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మగ పక్షి ఆడ పక్షితో జతకట్టే కాలంలో దాని మెడ కింద భాగంలో.. బాగా పెద్దగా, పొడవుగా ఉండే తిత్తిలాంటి భాగం వేలాడుతూ ఉంటుంది. మగ పక్షి తన నోరు తెరచి ఈ తిత్తిలాంటి భాగంలోకి బాగా గాలి పీల్చి.. అది ఉబ్బిన తరువాత.. ఆ గాలిని తిరిగి బయటికి వదులుతూ.. ఒక వింత శబ్ధం చేస్తుంది. అదో రకమైన గర్జనలా ఉండే ఆ అరుపు సుమారు ఒక కిలోమీటరు దూరం వరకు వినిపిస్తుంది. ఆ శబ్ధాలతో చుట్టుపక్కల ఉండే ఆడ బట్టమేక పక్షుల్ని ఆకర్షిస్తుంది. అలా దగ్గరకు వచ్చిన నాలుగైదు ఆడ పక్షులతో మగ పక్షి జత కడుతుంది. బట్టమేక పక్షి గుడ్డు సుమారు 160 గ్రాముల బరువు ఉంటుంది. ఆడ పక్షి ఈ గుడ్డును 27 నుంచి 32 రోజుల పాటు పొదిగి పిల్లను చేస్తుంది.

- జి. రత్న కుమార్‌,

 పర్యావరణ పాత్రికేయుడు

ratnakumargeddam@gmail.com


Updated Date - 2020-10-11T15:58:14+05:30 IST