కరోనా దెబ్బకు టూరిజం డౌన్.. ట్యాక్సీ డ్రైవర్లు కుదేల్!

ABN , First Publish Date - 2020-09-13T00:55:36+05:30 IST

ప్రపంచంపై కరోనా ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల మంది ప్రాణాలను బలిగొంది. కోట్ల మందిని నిరుపేదలుగా, అన్నార్తులుగా మార్చి వీధిపాలు చేసింది. మన దేశంలో కూడా ఈ మహమ్మారి కారణంగా...

కరోనా దెబ్బకు టూరిజం డౌన్.. ట్యాక్సీ డ్రైవర్లు కుదేల్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంపై కరోనా ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల మంది ప్రాణాలను బలిగొంది. కోట్ల మందిని నిరుపేదలుగా, అన్నార్తులుగా మార్చి వీధిపాలు చేసింది. మన దేశంలో కూడా ఈ మహమ్మారి కారణంగా 20 కోట్ల మంది వరకు రోజు గడవని స్థాయికి దిగజారిపోయారు. అందులో ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఉన్నారు. పగలనకా, రేయనకా కస్టమర్లను వారి గమ్యాలకు చేర్చుతూ నాలుగు రాళ్లు వెనకేసుకునేవారు. కానీ వారి జీవితంలో ఎన్నడూ చూడని పెను ప్రమాదం కరోనా రూపంలో ఎదురైంది. ప్రయాణికుల ఊసే లేదు. ట్యాక్సీ ఎక్కే నాథుడే లేడు. దీంతో సంపాదన కరువై కుటుంబాన్ని పోషించలేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 


కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా టూరిజంపై ఆధారపడి ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అయితే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో ఇప్పటికే వందల సంఖ్యలో ట్యాక్సీ డ్రైవర్లు ఉద్యోగాలు కోల్పోయారు. మరో 4000 వేల మందికి పైగా ఉద్యోగాలు పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నారు. దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. రోజు వారీ సంపాదన కరువై ఇప్పటికే అవస్థలు పడుతున్న ట్యాక్సీ డ్రైవర్లు, ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో ఇకపై తమ భార్యా, పిల్లలను ఎలా పోషించుకోవాలో తెలియక కన్నీరు పెట్టుకుంటున్నారు.


డ్రైవర్లే కాకుండా సొంత ట్యాక్సీలను తిప్పుతూ ఇన్నాళ్లూ దర్జాగా గడిపిన వారు కూడా ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉన్న ట్యాక్సీలను అమ్ముకుంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. కరోనాకు ముందు హిమాచల్‌ ప్రదేశ్‌లో దాదాపు 80 వేల ట్యాక్సీల వరకు తిరిగేవని, అయితే కరోనా నేపథ్యంలో వాటి ఓనర్లు ఇప్పటికే 20వేలకు పైగా ట్యాక్సీలు అమ్ముకున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. మరో 40 వేల ట్యాక్సీలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని వాపోతున్నారు. 


ప్రభుత్వ ఇప్పటికైనా ఎలాగైనా తమకు సాయం చేయాలని ట్యాక్సీ డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల మాదిరిగానే తమ వాహనాల ట్యాక్సేషన్‌ రద్దు చేయాలని కోరుతున్నారు. తమ ఈఎంఐలను కూడా వాయిదా వేయాలని, దానిపై ఎటువంటి వడ్డీ లేకుండా చర్యలు తీసుకోవాలని అర్థిస్తున్నారు. అంతేకాకుండా కొత్త ట్యాక్సీలకు కూడా పర్మిట్‌ ఇవ్వవద్దని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-09-13T00:55:36+05:30 IST