ఇమ్రాన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న ‘గోధుమలు’

ABN , First Publish Date - 2020-10-07T17:14:09+05:30 IST

ఈ అంశమే ప్రస్తుతం పాక్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత డిసెంబర్ లో కూడా

ఇమ్రాన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న ‘గోధుమలు’

ఇస్లామాబాద్: అటు విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడటం... ఇటు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకినట్లు పెరిగిపోవడంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ గడ్డు రోజులను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ లో ధరలు ఆకాశాన్నంటాయి. గోధుమలు కిలో 60 రూపాయలు. దీంతో అక్కడి ప్రజలు ఇమ్రాన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 కిలోలకు 2,400 రూపాయలైంది. ఇంత ధర కావడం పాక్ చరిత్రలోనే మొదటిసారి. ఈ అంశమే ప్రస్తుతం పాక్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత డిసెంబర్ లో కూడా గోధుమల ధర విషయంలో అచ్చు ఇలాంటి గడ్డు పరిస్థితే ఎదురైందని, ఆ పరిస్థితే మళ్లీ ఇప్పుడు వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది.


అంతేకాకుండా  డిసెంబర్ వచ్చే సరికి గోధుమల ధర విషయంలో పరిస్థితులు మరింత దిగజారే సూచనలున్నట్లు తెలుస్తోంది. గోధుమలు, ఇతర ధరలు పెరిగిన నేపథ్యంలో అక్కడి అసోసియేషన్లు... ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తిని కూడా చేశాయి. తమకు నిధులివ్వాలని... తద్వారా పంటలను సకాలంలో ఉత్పత్తి చేస్తామని, తద్వారా ధరలను అందుబాటులోకి తెచ్చే వీలుందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. ఇంత చెప్పినా... ఇమ్రాన్ సర్కార్ మాత్రం వారికి నిధులు సమకూరుస్తామన్న హామీని మాత్రం ఇవ్వలేకపోయింది.




ఇంతటి క్లిష్ట పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇమ్రాన్ సర్కార్ రష్యా నుంచి గోధుమలను తెచ్చుకుంటోంది. ఈ నెలలోనే దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రష్యా నుంచి పాక్‌కు చేరబోతోంది. గతంలో రొట్టెల ధరలను నిర్ణయించిన విధంగానే... గోధుమలు, చక్కెర ధరలతో పాటు చికె‌న్‌కు కూడా ఓ ధరను నిర్ణయించాలని ఇమ్రాన్ అధికారులను ఆదేశించారు. ఇక మరో విషయం కూడా ఇమ్రాన్ సర్కార్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. 24 గంటల్లోగా విత్తనాల ధరను నిర్ణయించాలని విత్తన సంస్థ సర్కార్‌కు అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంపై కూడా ప్రధాని దృష్టి సారించారు. నిత్యావసర ధరలు ఇలాగే కొనసాగితే.. దాయాది పాక్‌లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


రాజకీయంగా అష్ట దిగ్బంధంలో ఇమ్రాన్

ప్రధాని ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. ఉమ్మడి కార్యాచరణను కూడా ప్రకటించాయి. ఈ నెల 16 నుంచి డిసెంబర్ వరకూ అన్ని ప్రాంతాల్లోనూ సభలు, సమావేశాలు నిర్వహించాలని తలపోశాయి. వెంటనే ప్రధాని పదవికి ఇమ్రాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ చేస్తున్నాయి. 26 పాయింట్లను తయారు చేసుకున్న ఈ కూటమి.... వాటి ఆధారంగానే సభలు నిర్వహిస్తూ... ఇమ్రాన్‌ను రాజకీయంగా ఇరుకున పెట్టాలని నిర్ణయించాయి. దేశ అంతర్గత వ్యవహారాల్లో సైన్యం జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని, దీంతో మిగితా సంస్థలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఈ కూటమి మండిపడింది. 

Updated Date - 2020-10-07T17:14:09+05:30 IST