గల్వాన్‌లో బిహారీ బిడ్డల ప్రాణత్యాగం: మోదీ

ABN , First Publish Date - 2020-10-24T08:31:30+05:30 IST

జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే 370వ అధికరణాన్ని తాము అఽధికారంలోకొస్తే పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు, ఇతర విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు...

గల్వాన్‌లో బిహారీ బిడ్డల ప్రాణత్యాగం: మోదీ

ససారం-గయ (బిహార్‌), అక్టోబరు 23: జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే 370వ అధికరణాన్ని తాము అధికారంలోకొస్తే పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు, ఇతర విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. చేతనైతే ఆ హామీ మీద బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లడగాలని ఆయన సవాల్‌ విసిరారు. ’ గల్వాన్‌ లోయలో చైనాతో పోరాడుతూ అనేకమంది బిహారీ బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. పుల్వామా దాడిలోనూ ప్రాణాలు కోల్పోయారు. త్రివర్ణ పతాకం కోసం ఆత్మబలిదానం చేశారు తప్ప భారత మాతను తలదించుకోనివ్వలేదు. కానీ వీరు (విపక్షాలు) ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ దేశాన్ని బలహీనపర్చే శక్తులతో చేయికలుపుతున్నారు.. ఇది బిహారీలను అవమానించడమే’ అని ఆయన దుయ్యబట్టారు. లద్దాఖ్‌లో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని బిహారీ సైనికులు సరిహద్దులను కాపలా కాస్తున్నారని, కానీ విపక్ష నేతలు శత్రు దేశాలకు ఊతమిచ్చేట్లు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ’1990 నుంచి పదిహేనేళ్లపాటు కొనసాగిన ఆర్జేడీ పాలన అంతా హత్యలు, దోపిడీలు, డబ్బు కోసం బలవంతపు వసూళ్లు, కిడ్నాపులు, నేరాలు, అవినీతితో నిండిపోయింది. వారి నేతలూ జైల్లోనే ఉన్నారు. బిమారు(బిహార్‌-మధ్యప్రదేశ్‌-రాజస్థాన్‌-యూపీ) రాష్ట్రంగా బిహార్‌కు ఓ మచ్చతెచ్చిపెట్టిన ఘనత ఆర్జేడీదే... రాష్ట్రప్రజలు మళ్లీ బీమార్‌ (అనారోగ్య-పీడితులు) కావాలనుకోవడం లేదు.. మళ్లీ అలాంటి పాలన వద్దనుకుంటున్నారు. నితీశ్‌తో మా ప్రయాణం మూడునాలుగేళ్ల కిందటే మొదలైనప్పటికీ ఎంతో అభివృద్ది చేసి చూపాం. లాంతరు(ఆర్జేడీ చిహ్నం) చీకట్లు పోయా యి.. విద్యుత్‌ వెలుగులు వచ్చాయి. ఈ డబుల్‌ ఇంజిన్‌(కేంద్ర-రాష్ట్ర) వృద్ధి కొనసాగాలి’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2020-10-24T08:31:30+05:30 IST