కలకలం రేపుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆడియో టేపులు

ABN , First Publish Date - 2020-11-25T16:59:35+05:30 IST

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ

కలకలం రేపుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆడియో టేపులు

పాట్నా :  స్పీకర్ ఎన్నిక బిహార్ రాజకీయంలో కాక పుట్టిస్తోంది. జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత అక్కడి నుంచే యాక్టివ్ అయిపోయారు. ఏకంగా బీజేపీ నేతలకు ఫోన్లు కూడా చేశారు. స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉండాలని, ఆర్జేడీకి మద్దతివ్వాలని లాలూ బీజేపీ ఎమ్మెల్యేలను కోరారు. ఈ ఆడియో టేపులను బీజేపీ బయటపెట్టింది. లాలూ ప్రసాద్ వేస్తున్న ఎత్తులు ఏవికూడా సఫలం కావని తెగేసి చెబుతోంది. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ట్విట్టర్ వేదికగా  సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచే తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నితీశ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేశారు. ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మహాఘట్ బంధన్‌కు సహాయపడాలని లాలూ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారని సుశీల్ మోదీ ఆరోపించారు.


‘‘8051216302 అనే ఫోన్ నంబర్ నుంచి లాలూ ప్రసాద్ యిదవ్ ఎన్డీయే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. మంత్రి పదవులు గ్యారెంటీ అని భరోసా కూడా కల్పిస్తున్నారు. నేను ఫోన్ చేసినపుడు లాలూ ప్రసాద్ యాదవే ఫోన్ లిప్ట్ చేశారు. జైలు నుంచే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవద్దని నిర్మొహమాటంగా చెప్పేశాను. ఇందులో విజయవంతం కూడా కాలేరని లాలూతో చెప్పేశాను.’’ అని సుశీల్ మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 


పశుగ్రాసం అవినీతి కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నా.... లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏమాత్రం ప్రాపకం తగ్గలేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాంచీ నుంచే లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్డీయే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారని, మంత్రి పదవులు ఇస్తామన్న హామీలు కూడా చేస్తున్నారని సుశీల్ మోదీ ట్వీట్ చేశారు. 

Read more