రైతుల నిరసనలు... ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం...

ABN , First Publish Date - 2020-12-13T15:16:45+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను

రైతుల నిరసనలు... ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం...

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేసేందుకు రైతులు నిర్ణయించడంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో అదనపు సిబ్బందిని ఢిల్లీ పోలీసులు మోహరించారు. నిరసన కార్యక్రమాల వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. ఏయే మార్గాల్లో ప్రయాణించవచ్చునో తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 


సింఘు బోర్డర్‌లో రైతు నేత కన్వల్‌ప్రీత్ సింగ్ పన్ను శనివారం మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జైపూర్-ఢిల్లీ రహదారిపై రాజస్థాన్‌లోని షాజహాన్ పూర్ నుంచి ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొంటారన్నారు. ఇతర ప్రాంతాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రానున్న రోజుల్లో తమ నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామన్నారు. 


ఇదిలావుండగా, హర్యానాకు చెందిన 29 మంది రైతు నేతలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను శనివారం కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. ఈ చట్టాలను రద్దు చేస్తే తాము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని విలేకర్లతో చెప్పారు. 


Updated Date - 2020-12-13T15:16:45+05:30 IST