పన్నీర్ సెల్వం ఓ మెట్టు ఎందుకు దిగారంటే....

ABN , First Publish Date - 2020-10-07T20:42:32+05:30 IST

అధికార అన్నాడీఎంకేలో ‘కుర్చీ’ రచ్చ సుఖాంతమైంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామికి మధ్య ఉన్న

పన్నీర్ సెల్వం ఓ మెట్టు ఎందుకు దిగారంటే....

చెన్నై : అధికార అన్నాడీఎంకేలో ‘కుర్చీ’ రచ్చ సుఖాంతమైంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామికి మధ్య ఉన్న విభేదాలు ప్రస్తుతానికి చల్లారాయి. సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం పళని స్వామికే మరో అవకాశం దక్కింది. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను మాత్రం పన్నీర్ సెల్వంకు అప్పజెప్పారు. ఈ వ్యవహారంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే... ఉప్పు నిప్పులా ఉండే ఈపీఎస్, ఓపీఎస్.. ఉన్నట్టుండి... ఎందుకిలా మారిపోయారన్నది చర్చ నడుస్తోంది. ముఖ్యంగా... పన్నీర్ సెల్వం.. పళని స్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఎందుకు అంగీకరించారన్న ఆసక్తి సర్వత్రా పెరిగిపోయింది.




‘సుస్థిర’ మార్గం కోసమే పన్నీర్ ఓకే?

ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకేలో సంక్షోభం ఏర్పడింది. శశికళ జోక్యం, అప్పటి పరిణామాల నేపథ్యంలో సీఎం కుర్చీలో పళని స్వామి కూర్చున్నారు. అప్పటి నుంచి.. పన్నీర్‌కు, పళనికి ఏమాత్రం పొసగడం లేదు. ఈ విషయం బహిరంగం కాకపోయినా... నివురు గప్పిన నిప్పులా నడిచింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. సమావేశ వేదికగా వీరిద్దరి మధ్య వాగ్యుద్ధం కూడా జరిగింది. చివరికి... సీఎం అభ్యర్థిగా పళని స్వామి అభ్యర్థిత్వాన్ని పన్నీర్ సెల్వం అంగీకరించారు.


అయితే.. జయలలిత మృతి చెందిన తర్వాత.. శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికపై అప్పట్లోనే పన్నీర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పళని కూడా వ్యక్తం చేశారు కానీ... సీఎం చేయగానే మిన్నకుండిపోయారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో శశికళ జైలు పాలయ్యారు. 


ఆమె జైలు జీవితం వాస్తవానికి ఫిబ్రవరి 2021 తో ముగియనుంది. అయితే సత్ర్పవర్తన కారణంగా ఆమెను ఐదు నెలల ముందుగానే విడుదల చేయనున్నారు. అయితే... తేదీని మాత్రం ఇప్పుడు ప్రకటించకూడదన్న నిబంధనను శశికళ జైలు అధికారుల ముందు ఉంచారు. శశికళ విడుదల అవుతున్న నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తున్నారన్న ప్రచారం తమిళ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.


జైలు నుంచి విడుదల కాగానే.. పన్నీర్ సెల్వం.. ఆమెవైపుకు మొగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో తనకు పార్టీలో భంగపాటు తప్పదని పన్నీర్ ముందస్తుగానే గ్రహించారని సీనియర్ల వాదన. పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి, శశికళ, ఈపీస్ ద్వయాన్ని మచ్చిక చేసుకొని.. పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలన్న ‘దీర్ఘదర్శి’ సూత్రాన్ని పన్నీర్ అప్లై చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. అందుకే మధ్యే మార్గంగా పళనిని అంగీకరించారని అన్నాడీఎంకే వర్గాల టాక్.

Updated Date - 2020-10-07T20:42:32+05:30 IST