రష్యా వ్యాక్సిన్‌తో సత్ఫలితాలు... 85శాతం వాలంటీర్లకు నో సైడ్‌ఎఫెక్ట్స్!

ABN , First Publish Date - 2020-10-27T16:21:58+05:30 IST

కరోనా కల్లోలంతో యావత్ ప్రపంచం తల్లడిల్లిపోతోంది. ఈ నేపధ్యంలో...

రష్యా వ్యాక్సిన్‌తో సత్ఫలితాలు... 85శాతం వాలంటీర్లకు నో సైడ్‌ఎఫెక్ట్స్!

న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో యావత్ ప్రపంచం తల్లడిల్లిపోతోంది. ఈ నేపధ్యంలో కరోనాకు వ్యాక్సిన్ రూపొందించేందుకు వైద్యశాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదే తరుణంలో తామే అందరికన్నా ముందుగా వ్యాక్సిన్ రూపొందించామని రష్యా ప్రకటించుకుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ప్రయోగ ఫలితాలు వెల్లడయ్యాయి. రష్యా కరోనా వ్యాక్సిన్ స్పూత్నిక్-5 ఎంతో సురక్షితమైనది. ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న సుమారు 85 శాతం వాలంటీర్లలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు.



ది మాస్కో టైమ్స్ నివేదికను అనుసరించి కరోనా వ్యాక్సిన్ స్పూత్నిక్-5 తీసుకున్న వాలంటీర్లలోని 85 శాతం మందిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ఈ విషయాన్ని వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలే స్వయంగా ప్రకటించారు. రష్యా ఈ స్పూత్నిక్-5 వ్యాక్సిన్‌ను మాస్కోకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీ, మైక్రోబయోలజీల సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని రష్యా గత ఆగస్టులోనే వెల్లడించింది. తాజాగా ఈ వ్యాక్సిన్ గురించి గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీకి చెందిన శాస్త్రవేత్త అలగ్జాండర్ గింటూస్బర్గ్ మాట్లాడుతూ స్పూత్నిక్-5 కారణంగా స్వల్పదుష్ఫ్రభావాలు ఎదురవుతున్నాయని, స్వల్ప జ్వరం, తలనొప్పి మొదలైనవి కనిపిస్తున్నాయన్నారు. ఇటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ కేవలం 15 శాతం మందిలోనే కనిపిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 85 శాతం వాలంటీర్లలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపారు.  

Updated Date - 2020-10-27T16:21:58+05:30 IST