తిరిగొచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. గవర్నర్‌ను కలిసిన గెహ్లాట్

ABN , First Publish Date - 2020-07-19T02:15:53+05:30 IST

రాజస్థాన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన

తిరిగొచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. గవర్నర్‌ను కలిసిన గెహ్లాట్

జైపూర్: రాజస్థాన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ప్రాంతీయ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కొచ్చారు. తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నారు. అయితే, మళ్లీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆ వెంటనే గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసిన గెహ్లాట్ వారి మద్దతు లేఖను అందించినట్టు తెలుస్తోంది. 

 

బీటీపీ ఎమ్మెల్యేలు తమ రాష్ట్ర కార్య నిర్వాహక అధికారులను కలిసి వారి డిమాండ్లపై చర్చించిన తర్వాత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినట్టు గెహ్లాట్ ట్వీట్ చేశారు. వారి నుంచి మద్దతు లేఖను అందుకుంటున్న ఫొటోలను సీఎం కార్యాలయం షేర్ చేసింది. సచిన్ పైలట్ తిరుగుబాటు తర్వాత రాజస్థాన్‌లో గత వారం జరిగిన డ్రామాలో బీటీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా హెడ్‌లైన్స్‌లోకి ఎక్కారు. 


వారు పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గెహ్లాట్ తమ ఇష్టానికి వ్యతిరేకంగా లగ్జరీ హోటల్‌లో ఉంచారని ఆ వీడియోలో వారు ఆరోపించారు.  వీరు ఆ తర్వాత ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం బలం పడిపోయింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ తిరిగి రావడంతో గెహ్లాట్ ఊపిరి పీల్చుకున్నారు.  

Updated Date - 2020-07-19T02:15:53+05:30 IST