అత్యవసరం అయితేనే... ఈ డాక్టర్ల దగ్గరికి..

ABN , First Publish Date - 2020-05-19T15:00:03+05:30 IST

కరోనా... వ్యాధులకూ, వైద్యులకూ మధ్య దూరాన్ని పెంచింది! మరీ ముఖ్యంగా భౌతికదూరంతో కంటి, దంత చికిత్సలకు అడ్డంకులు ఏర్పడ్డాయి!

అత్యవసరం అయితేనే... ఈ డాక్టర్ల దగ్గరికి..

ఆంధ్రజ్యోతి(19-05-2020):

కరోనా... వ్యాధులకూ, వైద్యులకూ మధ్య దూరాన్ని పెంచింది! మరీ ముఖ్యంగా భౌతికదూరంతో కంటి, దంత చికిత్సలకు అడ్డంకులు ఏర్పడ్డాయి! లాక్‌డౌన్‌ సడలినా ఈ విభాగాల వైద్యాలకు పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి! ఈ పరిస్థితిలో రోగులు ఎలా నడుచుకోవాలి? ఏ చికిత్సలను వాయిదా వేసుకోవచ్చు? మొదలైన విషయాల గురించి ప్రముఖ కంటి, దంత వైద్యులు ఏం అంటున్నారంటే...


లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర కంటి చికిత్సలకు తప్ప మిగతా చికిత్సలకు ఆస్కారం లేదు. సాధారణంగా కంటికి సంబంధించి సత్వర చికిత్స అవసరమయ్యేవీ, మందులతో సమసిపోయేవీ ఉంటాయి. అయితే కరోనా సోకే ప్రమాదం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సత్వర సర్జరీ అవసరం అయ్యే కంటి సమస్యలను కూడా వాయిదా వేయక తప్పని పరిస్థితి. ఈ సమస్యలకు టెలి, వీడియో కౌన్సెలింగ్‌ ద్వారా మందులను సూచించి, సమస్యను వైద్యులు అదుపులోకి తెస్తున్నారు. అయితే గ్లాకోమా, రెటీనాకు సంబంధించిన కొన్ని సమస్యల తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ సమయంలోనూ సర్జరీలు జరుగుతున్నాయి. పెరిగిన మధుమేహం వల్ల కన్ను తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, కంటి నరం వాచినప్పుడు, రెటీనల్‌ డిటాచ్‌మెంట్‌, రెటీనా రక్తస్రావం లాంటి ఎమర్జెన్సీ సమస్యలకు సత్వరమే చికిత్స అందిస్తున్నారు. అయినా అవగాహన లోపం, కంటి సమస్యకు అదనంగా తలెత్తే ఇతరత్రా అసౌకర్యాల కారణంగా, రోగులు ఆందోళనకు లోనవడం సహజం. అయితే ఈ పరిస్థితికి బెంబేలెత్తకుండా, వైద్యుల సూచనల ప్రకారం నడుచుకుంటే కళ్లకు ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు.


కళ్లకలకతో జాగ్రత్త!

ప్రస్తుతం ఎక్కువ మందిలో ‘కొవిడ్‌ - 19’లో కనిపించే కంటి ఇన్‌ఫెక్షన్‌ను పోలిన కళ్లకలక ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో అది ‘కొవిడ్‌’ అనే భయంతో రోగులు ఆస్పత్రికి పరుగులు పెట్టే పరిస్థితి. అయితే కళ్లకలక ‘ఎడినో వైరస్‌’ వల్ల కలుగుతుంది. కళ్లు ఎర్రబడడం, నీళ్లు కారడం, కొంత కంటి చూపు తగ్గడం, దవడల దగ్గర లింఫ్‌ గ్రంధుల వాపు లాంటి లక్షణాలు సాధారణ కళ్లకలకలో ఉంటాయి. ఇవే లక్షణాలు ‘కొవిడ్‌ - 19’లో ఉండవు. అయితే కరోనా కళ్ల ద్వారానే బయల్పడుతోందనీ, కంట్లోనే ఈ వైరస్‌ ఎక్కువగా ఉంటోందనీ ఇటీవలే హాంకాంగ్‌లో కూడా పలు ప్రయోగాల ద్వారా నిర్ధరించారు. ఊహాన్‌లో ప్రారంభంలో వెలుగులోకి వచ్చిన 80ు కేసుల్లో కళ్లు ఎరుపెక్కడం అనే లక్షణం ‘కొవిడ్‌ - 19’లో కనిపించింది. కాబట్టి కళ్లకలకను కొట్టి పారేసే పరిస్థితి లేదు.


వేచి ఉండవలసిన చికిత్సలైతే...

ఈ కరోనాకాలంలో కొన్ని కంటి సర్జరీలను వాయిదా వేసుకోవచ్చు. రెండు కళ్లలో శుక్లాలు, పిల్లల్లో లేజర్‌ చికిత్సలు, మెల్ల కన్ను, గ్లాకోమా, కనురెప్పలకు సంబంధించిన సర్జరీలు, కంట్లో కెనాల్స్‌ పూడుకుపోయి కంటి నుంచి నీళ్లు కారే సమస్యలు, కార్నియా సంబంధిత సర్జరీలు వాయిదా వేయదగినవే! వీటికి సంబంధించిన ఇబ్బందులను మందులతో అదుపులోకి తెచ్చే వీలుంది. ఇలా వాయిదా వేసిన సర్జరీలను లాక్‌డౌన్‌ పూర్తిగా సడలించిన తర్వాత చేయించుకోవచ్చు. కాబట్టి ఆలోగా టెలి, వీడియో కన్సల్టేషన్‌ ద్వారా వైద్యులకు సమస్యను వివరించి, వారిచ్చే సలహాలు, సూచనలు పాటిస్తే సరిపోతుంది. 


ఇది జలుబు వైరస్‌గా మారవచ్చు!

జలుబును కలిగించే వైర్‌సను సంహరించే మందు లేదు. మందులు వాడినా, వాడకపోయినా ఆ వైరస్‌ ఎలాగైతే క్రమేపీ ఉధృతి తగ్గించుకుని, చల్లబడిపోతుందో, కరోనా వైరస్‌ కూడా కొంత కాలానికి అదే తీరుకు ఒదిగిపోతుంది. ఆ సమయం వచ్చే వరకూ జాగ్రత్తగా మసలుకోవడం అవసరం.


కళ్లజోడుతో సేఫ్‌!

రోజులో మనం చాలాసార్లు చేతులతో కళ్లను నలుపుకుంటూ ఉంటాం. దురద పెట్టినా, మంట పుట్టినా అసంకల్పితంగా మనం చేసే మొదటి పని చేతులతో కళ్లను రుద్దుకోవడం. దీంతో కరోనా వైరస్‌ కళ్లలోకి తేలికగా ప్రవేశిస్తుంది. కాబట్టి మాస్క్‌ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటు, కళ్లకు కళ్లజోడు పెట్టుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాల్లోకి వెలువడిన తుంపర్లు కళ్లలో పడకుండా కళ్లజోడు అడ్డుకుంటుంది. చేతులతో కళ్లు రుద్దుకోబోతే కళ్లజోడు అడ్డుపడుతుంది.

వైద్యుల కనుసన్నల్లో...

ఎమర్జెన్సీ కేసుల విషయంలో...

‘‘లాక్‌డౌన్‌ కారణంగా ఒక కంటితో పాటు, రెండవ కంటికి శుక్లం తొలగించడం వీలుపడకపోతే, విపరీతమైన తలనొప్పి రోగులను వేధిస్తుంది. డయాబెటిక్‌ రెటినోపతి సమస్య తలెత్తినా సత్వర చికిత్స తప్పదు. అదుపుతప్పిన మధుమేహం కారణంగా కంట్లో రక్తస్రావం జరిగినా వెంటనే చికిత్స చేయవలసిందే! ఇలాంటి కేసుల్లో లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా సర్జరీలు జరుగుతున్నాయి.’’ 


- డాక్టర్‌ కాసు ప్రసాద్‌ రెడ్డి

నేత్రవైద్యులు, మాక్స్‌విజన్‌ ఐ కేర్‌ సెంటర్‌, హైదరాబాద్‌.
వాటికి తొందర లేదు!

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా నోటి ద్వారానే జరుగుతుంది కాబట్టి దంత సంబంధ చికిత్సలకూ అడ్డంకులు ఏర్పడ్డాయి. అత్యవసర చికిత్సలు మినహా అధికశాతం దంత సమస్యలన్నిటికీ మందులనే సూచిస్తున్నాం అంటున్నారు వైద్యులు!


కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా పిప్పి పళ్ల చికిత్సలు మొదలు రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్ల వరకూ దంతాలకు సంబంధించిన చికిత్సలన్నీ వాయిదా పడ్డాయి. ఇందుకు లాక్‌డౌన్‌ ఒక కారణమైతే, కరోనా సోకే వీలు ఎక్కువగా ఉన్నది దంత చికిత్సావిభాగం కావడం మరో కారణం. అయితే దంతాలకు సంబంధించిన ఇబ్బందులన్నీ కొంతకాలం పాటు వాయిదా వేసుకోగలిగినవే! కాబట్టి టెలి కన్సల్టేషన్‌ ద్వారా, పరిస్థితి తీవ్రతను బట్టి వీడియో కన్సల్టేషన్‌ ద్వారా దంత వైద్యులు రోగులకు సూచనలు ఇస్తున్నారు. అత్యవసర సర్జరీలు అవసరమయ్యే రోడ్డు ప్రమాదాల బారిన పడిన రోగులు మినహా సాధారణ దంత సమస్యలకు చికిత్సలన్నీ వాయిదా వేసుకోవడమే మంచిది.


దంత చికిత్సలు చేసే సమయంలో లాలాజలం తుంపర్లు గాల్లోకి ఎగసిపడకుండా చూసుకోవాలి. కాబట్టి పరికరాలు వాడే వీలున్న చికిత్సలన్నీ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలోనే కాదు, లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైన తర్వాత కూడా అత్యవసర చికిత్సలు మినహా, వాయిదా వేసే వీలున్న దంత సమస్యలకు ప్రత్యక్షంగా చికిత్సలు చేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. సర్జరీ ద్వారా కరోనా ప్రబలకుండా ఉండాలంటే, వైద్యులతో పాటు ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ పి.పి.ఇ సూట్స్‌ ధరించవలసి ఉంటుంది. ఆ విధంగా సూట్ల కొరత తలెత్తే మరో ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి ఎత్తు పళ్లు సరిచేయడం, స్కేలింగ్‌ లాంటి కాస్మటిక్‌ చికిత్సలకు మరికొన్ని నెలల పాటు వీలు పడదు.


నొప్పికి మాత్రలున్నాయ్‌!

‘‘దంతాలకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా యాంటీబయాటిక్స్‌, నొప్పి తగ్గించే మందులనే ఫోన్‌ కన్సల్టేషన్స్‌లో సూచిస్తున్నాం. నొప్పిని తగ్గించే సమర్ధమైన మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నాలుక అడుగున మాత్ర పెట్టుకుంటే దంతాలకు సంబంధించిన ఎంతటి నొప్పి అయినా 20 నిమిషాల్లో అదుపులోకి వస్తుంది. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత కూడా అత్యవసర రోగులకే చికిత్సలు అందిస్తున్నాం. ఆస్పత్రికి వచ్చే ముందే ఫోన్‌ ద్వారా, రోగి ప్రయాణ వివరాలతో పాటు, కుటుంబసభ్యుల వివరాలు, ఇంట్లో ఉన్న వృద్ధుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. వైద్యులను కలిసే ముందు రోగులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ జరిపి, అన్ని విధాలుగా కరోనా సోకలేదనే నమ్మకం కలిగిన తర్వాతే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నాం. శరీర ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ ఎక్కువగా ఉన్నా, రోగులకు వెనక్కి పంపేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే రోగులను పరీక్షించేటప్పుడు పి.పి.ఇ సూట్లు ధరిస్తున్నాం. ప్రతి దంత సమస్యనూ... ఎమర్జెన్సీ, అర్జెంట్‌, ఎలెక్టివ్‌ ఇలా మూడు విభాగాలతో సరిపోల్చి, డెంటల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చికిత్సలను అందిస్తున్నాం!’’


- డాక్టర్‌ ఆకుల శ్రీనివాస్‌,

కన్సల్టెంట్‌ డెంటల్‌ సర్జన్‌,

హైదరాబాద్‌.


Read more