ఇంటర్‌ విద్య ఎలావుండాలి?

ABN , First Publish Date - 2020-05-29T05:48:31+05:30 IST

తెలంగాణా రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొంచం ఎక్కువ. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక భాగం ఇంటర్ విద్యార్థులు ప్రయివేటు కళాశాలలో చదువుతున్నవారే...

ఇంటర్‌ విద్య ఎలావుండాలి?

ఉన్నత విద్యకు పునాది ఇంటర్మీడియట్ విద్య. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న ఇంటర్ విద్య స్థితిగతుల విషయంలోను, కరోనా సమయంలోనూ, కరోనా అనంతరము ఆ విద్యా రూపు రేఖలు ఎలా ఉండాలి అన్న విషయంలోనూ తక్షణ చర్చ అవసరం. దీనిపై ప్రభుత్వ పెద్దలు, విద్యావేత్తలు ఆలోచించాలి, స్పందించాలి.


తెలంగాణా రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొంచం ఎక్కువ. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక భాగం ఇంటర్ విద్యార్థులు ప్రయివేటు కళాశాలలో చదువుతున్నవారే. అందునా రెండు రాష్ట్రాలలో విస్తరించి కొద్ది సంఖ్యలో ఉన్న యాజమాన్య సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువ. సామాజిక కారణాలు ఏవైనా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా హైస్కూలు చదువు అయిపోయిన తర్వాత తమ పిల్లలను ప్రయివేటు జూనియర్ కళాశాలల్లో చేర్పించటానికే మొగ్గు చూపుతున్నారు. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనంతో కుంగిపోతున్న కింది తరగతి ప్రజలే ప్రభుత్వ విద్యాలయాలవైపు చూస్తున్నారు.


విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమయినది ఇంటర్మీడియట్ దశ అన్నది వాస్తవమని విద్యావేత్తలందరూ ఒప్పుకున్నారు. ప్రజలు అందరూ అక్షరాస్యులు కావడానికీ, తమ దైనందిన జీవితాలు మెరుగ్గా జీవించడానికి స్కూలు విద్య వరకు సరిపోతుంది గాని, సమాజానికి అవసరమయిన మేధావి వర్గం కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, శాస్త్రవేత్తలు కావాలన్నా, ప్రొఫెసర్లు కావాలన్నా, అధికారవర్గం కావాలన్నా పటిష్ఠంగా ఉండాల్సింది ఉన్నత విద్య. ఆ ఉన్నత విద్యకు పునాది ఇంటర్మీడియట్ విద్య. అందుకే మొదట్లో దీనిని ప్రియూనివర్సిటీ కోర్స్ (పియుసి) అని పిలిచే వాళ్ళు. ఆ తర్వాత కొన్ని సంస్థాగతమయిన మార్పులు చేసి ఇంటర్మీడియట్ విద్య అని పేరు మార్చారు. అంటే ఇది ఉన్నత విద్యకు సముచితమయిన ప్రవేశద్వారంలాంటిది. విద్యార్థులు కూడా నవ యవ్వన ప్రాయంలో ఉండే పిల్లలు. వయస్సులోను, మనస్సు లోను పరిపక్వత పూర్తిగా లేని పిల్లలు. తమ చుట్టూ ఉన్న మంచిచెడులకు సులభంగా ఆకర్షితులయ్యే మానసిక స్థితిలో ఉండే పిల్లలు.


ఇంటర్మీడియట్ వ్యవస్థకున్న ఈ నేపథ్యంలో కరోనా కల్లోలం ప్రపంచం మొత్తంతో పాటు విద్యారంగాన్నీ ఆవహించింది. ఆన్‌లైన్ విద్యను ప్రవేశపెట్టాలని తొందరపడుతున్న యుజిసి డిగ్రీ, పిజి కోర్సులలో కంప్యూటర్ ఆధారిత వర్చువల్ బోధన ద్వారా క్లాసులు నిర్వహించండని సూచనలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ‘పి యం -విద్య’ పేరుతో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు డిజిటల్, ఆన్‌లైన్ చదువుకు శ్రీకారం చుట్టండని మార్గదర్శకత్వం చేసింది. సిబిఎస్‌ఇ సిలబస్‌లో చదివే విద్యార్థులకోసం 12 టివి ఛానళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు.


మన రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న ఇంటర్ విద్య స్థితిగతులు, కరోనా సమయంలోనూ, కరోనా అనంతరము దాని రూపు రేఖలు ఎలా ఉండాలి అన్న విషయంలో తక్షణ చర్చ అవసరం. దీనిపై ప్రభుత్వ పెద్దలు, విద్యావేత్తలు ఆలోచించాలి, స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 12 ఛానళ్ల విద్య తెలుగు రాష్ట్రాల ఇంటర్ విద్యార్థులకు ఎంత మాత్రము పనికి రాదు. ఎందుచేతనంటే, ఆ పాఠాలు సిబిఎస్‌ఇ సిలబస్‌లో ఉంటాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్యప్రణాళికలు వేరు. పరిణతి చెందిన వయస్సు, ఆలోచనలు కలిగి ఉండే డిగ్రీ, పిజి విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యతో కొంచమయినా ప్రయోజనం ఉండవచ్చునేమో గాని, అపరిపక్వ మానసిక దశలో ఉన్న ఇంటర్ విద్యార్థుల విషయంలో పర్యవేక్షణ లేకుండా ఆన్‌లైన్ సౌకర్యం అసంబద్ధమయిన, అవాంఛనీయమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్‌లు కేవలం 8 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఒక సర్వేలో వెల్లడయింది.


తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారి సమాచారం ప్రకారం డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో 20 శాతం మందికి మాత్రమే సాంకేతిక పరికరాలు, విజ్ఞానం అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకూ సంబంధించి ఈ శాతం ఇంకా తగ్గిపోతుంది. ఆన్‌లైన్ విద్య వల్ల సమాజంలో ఇప్పటికే పాతుకొని పోయి ఉన్న ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలు ఇంకా మితిమీరుతాయని అంతర్జాతీయ సంస్థ యునెస్కో అభిప్రాయం పడింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దశాబ్దాలుగా నియామకాలు లేవు. తత్ఫలితంగా 40, 50 ఏళ్ళు దాటిన అధ్యాపకులే పనిచేస్తున్నారు. వారు ఈ లేటు వయసులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకోవటం కష్టంతో కూడుకున్నది. ఆ పరిజ్ఞానాన్ని వారు కష్టపడి అలవరచుకున్నా, ఉపాధ్యాయునికి కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ఎప్పటికీ ప్రత్యామ్యాయం కాదు, కాబోదు కూడా. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, పరికరాలద్వారా విజ్ఞాన పెంపుదలకు అవసరమయిన సమాచార సేకరణ సులభమవుతుంది కానీ, ఉపాధ్యాయుని ముఖతః బోధన ద్వారా, సంభాషణ ద్వారా వచ్చే స్ఫూర్తివంతమయిన జ్ఞానం విలువే వేరు.


ఈ ఆన్‌లైన్ విద్యకు మరో పరిమితీ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్‌లో సైన్స్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. సైన్స్ అంటే ప్రాక్టికల్స్. ప్రయోగశాల లేకుండా, ప్ర యోగాలు లేకుండా సైన్స్ విద్య ఉండదు. ఈ లోటును ఎట్లా  భర్తీ చేస్తారు? అయినప్పటికీ, కరోనా వలన కలిగిన ఈ ఉత్పాతం దృష్ట్యా ఆన్‌లైన్ విద్యను పూర్తిగా తిరస్కరించలేము. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించవలసిన అవసరమూ ఉంది. మధ్యే మార్గంగా ఆన్‌లైన్ టెక్నాలజీని వాడుకుంటూనే, కరోనా విషయం తేలేంతవరకు జూనియర్ కళాశాలలను షిఫ్ట్ పద్ధతిలో నడిపే ఏర్పాటు గురించి ఆలోచించవచ్చు. ఒక క్లాసుకు 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించి, కళాశాలను మూడు షిఫ్ట్‌లలో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు నడపవచ్చు. దీనికి ఉపాధ్యాయుల కొరత ప్రధాన ఆటంకంగా నిలుస్తుంది. కళాశాలలలో తాత్కాలిక నియామకాలు చేపట్టాలి. ప్రతి సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య పూర్తి చేసుకున్న యువత రెండు రాష్ట్రాలలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండే విధంగా తాత్కాలిక నియామకాలు చేపట్టి ఈ కరోనా ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యను ఎక్కువ నష్టాలు లేకుండా కాపాడుకోవచ్చు.

రాజేంద్ర బాబు అర్విణి

రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల 

ప్రిన్సిపాళ్ల సంఘం పూర్వ అధ్యక్షులు

Updated Date - 2020-05-29T05:48:31+05:30 IST