అమ్మకానికి బీపీసీఎల్‌

ABN , First Publish Date - 2020-03-08T06:48:30+05:30 IST

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)లో 52.98 శాతం వాటాలను విక్రయించేందుకు గాను ప్రభుత్వం శనివారం బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన సంస్థలు మే 2వ తేదీలోగా బిడ్లను దాఖలు చేయవచ్చని తెలిపింది.

అమ్మకానికి బీపీసీఎల్‌

బిడ్ల దాఖలుకు ఆహ్వానం


న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)లో 52.98 శాతం వాటాలను విక్రయించేందుకు గాను ప్రభుత్వం శనివారం బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన సంస్థలు మే 2వ తేదీలోగా బిడ్లను దాఖలు చేయవచ్చని తెలిపింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా బీపీసీఎల్‌లో ప్రభుత్వం తన వాటా ను విక్రయిస్తోందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) వెల్లడించింది.  అయితే.. నుమాలీగఢ్‌ రిఫైనరీ లిమిటెడ్‌లో బీపీసీఎల్‌కు ఉన్న 61.65 శాతం ఈక్విటీ షేర్లను మాత్రం.. ప్రభుత్వ చమురు సంస్థకు మాత్రమే విక్రయించనున్నట్లు పేర్కొంది. బీపీసీఎల్‌ బిడ్డింగ్‌ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) దశలో అర్హులైన బిడ్డర్లు, రెండవ దశలో ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.


వేలం నిబంధనల ప్రకారం.. 

నాలుగు సంస్థలకు మించి ఉన్న కన్సార్షియం, ప్రభుత్వ రంగ సంస్థలు బిడ్డింగ్‌కు అనర్హం. రూ. 74,000  కోట్ల విలువ కలిగిన ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చు


కన్సార్షియంలోని ప్రధాన సంస్థకు 40 శాతం వాటా ఉండాలి. మిగిలిన వాటాదారుల నికర విలువ కనీసం రూ. 7,400 కోట్లు ఉండాలి


బీపీసీఎల్‌ వాటాను చేజిక్కించుకున్న సంస్థకు భారత్‌లోని చమురు శుద్ధి సామర్థ్యంలో 14 శాతం వాటా, ఇంధన మార్కెట్‌లో నాలుగో వంతు వాటా దక్కుతుంది.

Updated Date - 2020-03-08T06:48:30+05:30 IST