రచ్చకెక్కిన రఘురామరాజు గొడవ!

ABN , First Publish Date - 2020-06-18T16:18:34+05:30 IST

సీఎం జగన్‌ ఛరిష్మాతో నరసాపురం ఎంపీగా గెలిచి పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై..

రచ్చకెక్కిన రఘురామరాజు గొడవ!

అగ్గి‘రాజు’కుంది!

ఎంపీ వ్యాఖ్యలపై సీరియస్‌


పశ్చిమ గోదావరి(ఆంధ్రజ్యోతి): ఫ్యాన్‌ గాలిలో ప్రకంపనలు వచ్చాయి.. సొంత పార్టీలోనే అగ్గిరాజుకుంది.. రఘురామకృష్ణంరాజు పార్లమెంటరీ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులే ఎంపీ దిష్టిబొమ్మలు దహనం చేసే స్థాయికి తీసుకెళ్లింది.. ఒక పక్క వైసీపీ నాయకులు.. మరో పక్క కుల సంఘాల నాయకులు విమర్శలతో హాట్‌..హాట్‌గా మారింది. మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుపై వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని.. లేదంటే పార్టీని వీడి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. 


సీఎం జగన్‌ ఛరిష్మాతో నరసాపురం ఎంపీగా గెలిచి పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై పలువురు నేతలు నిరసన వ్యక్తం చేశారు. మార్టేరు సెంటర్‌లో బుధవారం రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్తి విష్ణుకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు క్షమాపణ చెప్పకపోతే పార్లమెంట్‌ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. జగన్‌ భిక్షతో గెలుపొంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఆకివీడు వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆకివీడు వైఎస్‌ఆర్‌ సెంటర్‌లో బుధవారం ఎంపీ ఫ్లెక్సీపై పసుపు నీళ్లు చల్లి, గాజులు తొడిగి, కోడిగుడ్లు, టమోటాలతో కొట్టి ఆగ్రహజ్వాలలు వెళ్లగక్కారు. నిరసనను ఎస్‌ఐ వీఎస్‌.వీరభద్రరావు అడ్డుకొన్నారు.


ఆచంట కచేరి సెంటర్‌, పెనుగొండలో వైసీపీ నేతలు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఇతర ఎమ్మెల్యేలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణలు నిరాధారమని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సుంకర ఇందిరా సీతారాం, మామిడిశెట్టి కృష్ణవేణి, వైట్ల కిశోర్‌, గొడవర్తి వెంకన్నబాబు, మట్టా ఆనంద్‌కుమార్‌, వేదాల నాగరాజు, కర్రి వెంకట నారాయణ రెడ్డి, సత్తి వెంకటరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, కర్రి వేణుబాబు, సుభాషిణి, కేశిరెడ్డి మురళీ, శిరపు శ్రీను, అంబటి రమేష్‌, పుప్పాల పండు, విజయ్‌కుమార్‌,తిరుపతి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


ఎంపీ దిగజారుడుగా మాట్లాడడం బాధాకరం..

తాడేపల్లిగూడెం: ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై దిగజారుడుగా మాట్లాడడం బాధాకరమని వైసీపీ పట్టణాధ్యక్షుడు గుండుమోగుల నాగు అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిని చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్న విషయం గుర్తుచేసుకోవాలన్నారు. మాజీ జడ్పీటీసీ ముప్పిడి సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి శ్రీరంగనాథరాజు, ఇన్‌ఛార్జ్‌ మంత్రి పేర్ని నానిపై చేసిన అనుచిత  వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని గుంటూరి పెద్దిరాజు, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ చేకూరి సూరిబాబు డిమాండ్‌ చేశారు.


ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను అభ్యంతరకరమైన భాషలో విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర కాపు జేఏసీ సభ్యుడు ముచ్చర్ల శ్రీరామ్‌ అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కరరావు, కులుకులూరి ధర్మ రాజు, పత్సమట్ల సావితి,ముత్యాల ఆంజనేయులు, గుండుమోగుల సాంబయ్య, నల్లమిల్లి విజయానందరెడ్డి, కొవ్వూరి భాస్కరరెడ్డి, బాబు, రెడ్డిసూరిబాబు, గోకా వెంకటేశ్వరరావు, బాబి, కర్రివరహాల రెడ్డి, రుద్రరాజు శివాజీరాజు, కవిటం సొసైటీ చైర్మెన్‌ కర్రి శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ పడాల సత్యనారాయణరెడ్డి, పోతంశెట్టి సూర్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


కారుమూరిపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలి..

ఏలూరు రూరల్‌ : తణుకు ఎమ్మెల్యే  కారుమూరిపై చేసిన అవినీతి ఆరోపణలు తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా యాదవ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సంఘ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. కారుమూరిని,యాదవులను కించపర్చే విధంగా రఘు రామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కుసూరి గోపాలకృష్ణ, కె వెంకట్‌, చిదరబోయిన శ్రీను, కిలారపు బుజ్జి, మల్లిపూడి రాజు, కట్ట ఈశ్వరరావు, కొమ్మా నాగరాజు, చిన్ని రాంబాబు, ఎన్‌ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 


కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు : తాతాజీ

పాలకొల్లు టౌన్‌ : సొంత పార్టీని విమర్శించడం అంటే తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవడం వంటిదేనని డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణంరాజు కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి, ఆ తరువాత టీడీపీకి ఇప్పుడు వైసీపీకి మారారన్నారు. పార్టీలో ఉండడం ఇష్టం లేకుంటే పార్టీని వీడిపోవాలన్నారు. తోటి నాయకులను నిందించడం తగదన్నారు. వైసీపీ నాయకులు శ్రీనివాస్‌, ఆకుల సుబ్బారావు, కొప్పిశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


మంత్రి రంగరాజుపై చేసిన ఆరోపణలు నిరూపించాలి.. 

గణపవరం : మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆయన తనయుడు వెంకట నరసింహరాజుపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజును గణపవరం వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎంపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం కార్యక్రమం చేపట్టారు. రంగరాజు, ఆయన తనయుడు నరసింహరాజుపై విమర్శలు తగవని  గొట్టుముక్కల మార్రాజు, దినేష్‌ వర్మ అన్నారు.

Updated Date - 2020-06-18T16:18:34+05:30 IST