రెడ్‌ జోనైనా రావాల్సిందే..!

ABN , First Publish Date - 2020-06-25T10:21:07+05:30 IST

రెడ్‌జోన్లలో వున్న టీచర్లు పాఠశాల విధులకు హాజరుకాకుండా మినహాయింపును ఇస్తూ మంగళవారం ఇచ్చిన మౌఖిక ఉత్త

రెడ్‌ జోనైనా రావాల్సిందే..!

గైర్హాజరైతే చర్యలు తప్పవని టీచర్లకు విద్యా శాఖ ఆదేశాలు

అనుమతించబోమంటున్న పోలీసులు

మిగిలిన శాఖల్లో మినహాయింపు.. భయాందోళనలో టీచర్లు

డీఈవోకు పలువురి వినతి


ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 24:రెడ్‌జోన్లలో వున్న టీచర్లు పాఠశాల విధులకు హాజరుకాకుండా మినహాయింపును ఇస్తూ మంగళవారం ఇచ్చిన మౌఖిక ఉత్త ర్వులను బుధవారం నాటికి విద్యాశాఖ ఉపసంహరించుకుంది. కంటైన్మెంట్‌ జోన్లలోవున్న పాఠశాలలు మినహా మిగతా రెడ్‌జోన్లలో నివసిస్తున్న టీచర్లలంతా విధులకు హాజరు కావాల్సిందేనంటూ బుధవారం మధ్యాహ్నం పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు సవరించిన మౌఖిక ఉత్తర్వులు కలకలం సృష్టించాయి. దాదాపు రెండు వేల మందికిపైగా టీచర్లు జిల్లావ్యాప్తంగా రెడ్‌జోన్లలో ఉన్నారని భావిస్తున్నారు.


వీటి నుంచి బయటికి వచ్చేందుకు పోలీసులు ఎవరినీ అనుమ తించడం లేదని పలువురు జిల్లా విద్యాశాఖ దృష్టికి ఫోన్ల ద్వారా తెలియ జేయగా, ఈ విషయంలో తామేమీ చేయలేమని జిల్లా అధికారులు చేతు లెత్తేశారు. ‘ఐడీ కార్డులను చూపించి విధులకు వెళ్లండి. విద్యాధికారులు చేసిన సూచనలు మాకు తెలియదు’ అని రెడ్‌జోన్ల వద్ద గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు తమను వెనక్కి పంపిస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. మరోవైపు రెడ్‌జోన్లలో వున్న వ్యక్తులు బయటకు రావడంపై నిషేధపు ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ మిగతా శాఖల ఉద్యోగులు విధులకు హాజరు నుంచి మినహా యింపు పొందుతుండగా టీచర్లను మాత్రం విధులకు హాజరు కావాలనడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి టీచర్లకు ఇంత వరకూ ఫొటో ఐడీ కార్డులను ప్రభుత్వం సరఫరా చేయలేదు.  


అభ్యంతరాలు ఇలా ఉంటే ఎలా..

రెడ్‌జోన్లలో వున్న అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులకు కార్యాలయ విధుల నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిం ది. ఆ ప్రకారం వీరంతా రెడ్‌జోన్ల చెక్‌ పోస్టుల వద్ద పోలీసులు జారీచేసే నోటీ సులను తీసుకుని సంబంధిత డీడీవో లేదా హెచ్‌వోడీలకు పంపి మినహాయిం పు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీనికి అనుగుణంగానే అధి కారులు, ఉద్యోగులు మినహాయింపు పొందారు. కానీ విద్యా శాఖ తాజాగా చేసి న మౌఖిక ఉత్తర్వులతో టీచర్లు బెంబేలెత్తిపోతున్నారు.


రెడ్‌జోన్ల నుంచి ఏ ఒక్క రూ బయటికి రాకుండా కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం టీచర్లను పాఠశాల విధులకు ఎలా హాజరు కావాలంటోందని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్‌ అనుమతి ఉం టేనే రెడ్‌జోన్ల నుంచి బయటికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నా రని పలువురు టీచర్లు వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఉండే రెడ్‌ జోన్ల నుంచి టీచర్లను స్కూలు విధులకు హాజరుకమ్మనడం, ఆ మేరకు జిల్లా యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ ఎటువంటి అనుమతులను పోలీసుల నుంచి పొందకుండా టీచర్లపై ఒత్తిళ్లు తేవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రెడ్‌ జోన్‌ల నుంచి ఉద్యోగులు, అధికారులకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. 


గైర్హాజరీలపై చర్యలు తీసుకోండి

పాఠశాల విధులకు గైర్హాజరైన టీచర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ ఆదేశించింది. ఆ మేరకు డీవైఈవోలకు, ఎంఈవోలకు బుధవారం సమా చారం పంపారు. విధులకు గైర్హాజరైన టీచర్ల వివరాలను బుధవారం సాయం త్రం నాలుగు గంటల్లోగా పంపాలని ఆదేశించారు. జిల్లాలోని 2,870 ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు ఉండగా మొత్తం 13,747 మంది టీచర్లకుగాను 11,372 మంది ఈ-హాజరును నమోదుచేశారు. వీరిలో విఽవిధ రకాల సెలవులకు దరఖాస్తు చేసిన వారు పోనూ మొత్తం 10,026 మంది ఉపాధ్యాయులు సకాలంలో హాజరు నమోదు చేశారు.


కక్ష సాధింపు మానుకోవాలి

రెడ్‌జోన్‌లలోవున్న టీచర్లంతా పాఠశాలలకు వెళ్లాలని డీఈవో ఆదేశాలు జారీ చేయడంపై యూటీఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, గోపీ మూర్తి ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై విద్యా శాఖ ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలు చేపట్టారని విమర్శించారు. విద్యార్థులు లేకుండా పాఠశాలలకు వెళ్లాలనే సర్క్యులర్‌ 145 ఉత్తర్వులను జారీ చేశారన్నారు. రెడ్‌జోన్‌లో వున్న వారెవరినీ బయటకు పంపేదిలేదని పోలీసులు చెబుతున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి స్పందించి సర్క్యులర్‌ 145 ఉత్తర్వులను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాల ని డిమాండ్‌ చేశారు. 


మినహాయింపు ఇవ్వాలి

చాలా మంది టీచర్లు నివసించే ప్రాంతాలు రెడ్‌జోన్‌లలో ఉన్నందున పాఠ శాల విధులకు హాజరుకాలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యా య సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జిల్లా చైర్మన్‌ నారాయణ, సెక్రటరీ జనరల్‌ సాల్మన్‌రాజు బుధవారం సాయంత్రం డీఈవో రేణుకకు వినతి పత్రం అంద జేశారు. సంబంధిత టీచర్లతోపాటు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులుగా గుర్తిం చిన టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.

Updated Date - 2020-06-25T10:21:07+05:30 IST