పుణ్య స్నానాలకు దారేదీ..!

ABN , First Publish Date - 2020-11-16T05:16:28+05:30 IST

నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్నది. ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పుణ్య స్నానాలకు దారేదీ..!
కార్తీక స్నానాలకు అనువుగా లేని కుక్కునూరు గోదావరి తీరం

స్నాన ఘట్టాల వద్ద ఏర్పాట్లు కరువు.. 

  గోదావరిలో ప్రమాద నివారణ చర్యలు శూన్యం

నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్నది. ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పుణ్యస్నానాలు చేసే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాట్లు కరువయ్యాయి. ఇటీవల వరదల కారణంగా నదిలోకి దిగే మెట్ల వద్ద బురద మట్టి పేరుకుపోయింది. ఆయా పంచాయతీల అధికారులు మెట్ల వద్ద శుభ్రం చేసే పనులు చేపట్టలేదు. పైగా మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కూడా బరకాలతో గదులు ఏర్పాటు చేయలేదు. నదికి వెళ్ళే మార్గంలో లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. గోదావరిలో లోతును తెలిపే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


 రేవుల్లో పేరుకుపోయిన మట్టి
తాళ్లపూడి, నవంబరు 15 : కార్తీకమాసం చొరబడినా ఇప్పటివరకు స్నానఘట్టాల వద్ద ఆయా పంచాయతీలు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. వరదలకు కొట్టుకు వచ్చిన మట్టి స్నానఘట్టాల వద్ద పేరుకుపోయింది. వ్యక్తిగత మరుగుదొడ్లు అస్తవ్యస్థంగా మారాయి. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఇప్పటివరకు గదులు ఏర్పాటు చేయలేదు. వేకువజాము నుంచి  పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తుతారు. రేవుల వద్ద విద్యుత్‌ దీపాలు సైతం ఏర్పాటు చేయలేదు.  సోమవారం వేకువజాము నుంచి నుంచి గోదావరినదిలో పుణ్యస్నానాలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తారు. రేవులు శుభ్రంచేయకపోతే స్నానాలు చేయడానికి వచ్చే భక్తులకు నదిలోతు ఎక్కడ ఎంత ఉంటుందో తెలియక ముందుకు వెళితే  ప్రమాదం పొంచి ఉంటుంది. తాళ్లపూడి స్నానఘట్టాని భక్తులు అధిక సంఖలో తరలివస్తారు. రహదారికిరువైపులా గోదావరి నుంచి కొట్టుకువచ్చిన కలపను పడేశారు. దీంతో చీకట్లో రహదారి కనేబడే అవకాశంలేదు. వాస్తవానికి కార్తీకమాసం వస్తుందంటే వారం ముందు నుంచి శుభ్రంచేసే పనిలో సిబ్బంది నిమగ్నమవుతారు. ఈ ఏడాది శుభ్రం చేయకుండా గాలికొదిలేశారు. మండలంలో తాడిపూడి, ప్రూక్కిలంక, తాళ్లపూడిలో –3 వేగేశ్వరపుం, బల్లిపాడు గ్రామాలలో గతం నుంచి స్నానఘట్టాలు కొనసాగుతున్నాయి.


పోలవరంలో  కరువైన సౌకర్యాలు
పోలవరం, నవంబరు 15: పోలవరం మండలంలో కార్తీక మాస పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయి. పోలవరం మండల కేంద్రంలో గోదావరి నదికి ఏర్పాటు చేసిన నెక్లెస్‌బండ్‌ నిర్మాణం వలన స్నానాల రేవులకు దిగడానికి మార్గం లేకుండా పోయింది. దీనికితోడు ఇటీవల వరదలకు నెక్లెస్‌బండ్‌ రక్షణ కోసం నెక్లెస్‌బండ్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన రాళ్ల గట్టు అడ్డుగా మారడం వలన పాతపోలవరం నుంచి నూతనగూడెం వరకు కార్తీక మాస పుణ్యస్నానాలు ఆచరించడానికి రేవులు అసౌకర్యంగా మారాయి. నూతనగూడెం, దుర్గమ్మ ఆలయ ప్రాంతంలో స్థానిక భక్తులు స్వచ్ఛందంగా రేవులోకి మార్గాన్ని, లైట్లు ఏర్పాటు చేసుకు న్నారు. అయితే ఇటీవల వరదలకు గోదావరి నీటిమట్టం ఎక్కడ చూసినా 100 నుంచి 150 అడుగుల లోతు ఉండడంతో రేవులన్నీ ప్రమాదకరంగా మారాయి. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతీ ఏటా పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానానికి జిల్లాలో పలుచోట్ల నుంచి కార్తీక మాస స్నానాలు ఆచరించటానికి వస్తుంటారు. అయితే చెర్రీ రేవులో స్నానాలు ఆచరించడానికి అనుకూలంగా లేకపోవడంతో పంచాయతీ అఽధికారులు నది దాటి శివక్షేత్రానికి వెళ్లే మార్గంలో ఆవతలి వడ్డున వెదురుకర్రలతో బార్‌కేడింగ్‌ ఏర్పాటు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికంగా బరకాలతో గదిని ఏర్పాటు చేశారు.


హెచ్చరిక బోర్డులు లేవు
కుక్కునూరు, నవంబరు 15: కుక్కునూరు గోదావరి తీరంలో కార్తీక స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. గోదావరిలోకి దిగి స్నానం ఆచరిం చేందుకు మెట్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఇదే సమయంలో గోదావరి స్నానాలకు వెళ్లే భక్తులకు తగిన జాగ్రత్తలు తీసు కోవాలని ప్రచారం చేపట్టలేదు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు పరదాలు కట్టి తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్ల పరిశీలన
కొవ్వూరు, నవంబరు 15: కొవ్వూరు గోష్పాదక్షేత్రంకు వచ్చే భక్తులకు వసతులు  కల్పిస్తున్నట్లు ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఆర్డీవో లక్ష్మారెడ్డి, కమిషనర్‌ కేటీ సుధాకర్‌లు క్షేత్రంలో పర్యటించారు. క్షేత్రంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఫైర్‌ ఇంజన్‌ ద్వారా స్నానఘట్టాలను శుభ్రం చేశారు. కరోనా నేపధ్యం లో భక్తులు కోసం జల్లు స్నానాన్ని ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. ఇటీవల వరదలకు క్షేత్రంలో  షెడ్లు కొట్టుకుపోవడంతో దాతల సహ కారంతో ఐరెన్‌ షెడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్తీక దీపాలు వెలిగించే మహిళలు శానిటైజర్‌లకు బదులుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ పర్యటనలో ఆర్‌ఐ ఎస్‌. సర్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. గోష్పాదక్షేత్రంలో బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారు జాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మానేపల్లి శ్రీనివాసరావు తెలిపారు. క్షేత్రంలోని సాయిబాబా ఆలయం పక్కన ధర్మజ్ఞాన కళావేదికలో సోమవారం నుంచి 22వ తేదీ వరకు కరోనా నివారణ మహాయాగం, పంచాదశ వార్షిక సప్తాహం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.


శివాలయానికి కార్తీక శోభ...!
ద్వారకాతిరుమల, నవంబరు 15: వేంకటేశ్వర స్వామి ఉపాలయమై క్షేత్రపాలకుడైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక  పూజ లకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాలయంలో విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి దేవాలయ పరిసర ప్రాంతాలను కూడా పుష్పాలు, విద్యుత్‌ దీపాలతో తీర్చిదిద్దారు. ఆది వారం రాత్రి దేవాలయ ద్వజ స్తంభం వద్ద ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆలయ అర్చకులు రాఘవయ్య,  దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.Updated Date - 2020-11-16T05:16:28+05:30 IST