278 పేర్లు గల్లంతు

ABN , First Publish Date - 2020-12-30T05:33:08+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు పొందిన వారికి చుక్కెదురవుతోంది. అప్పట్లో ఇళ్లకోసం డబ్బులు చెల్లించి.. తరువాత ఇంటి ధ్రువపత్రాలు పొందిన వారి పేర్లు సైతం తాజా జాబితాలో లేవు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. టిడ్కో ఇళ్ల మంజూరులో మొదటి నుంచీ తీవ్ర జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం... ఇపుడు కొందరి పేర్లను కావాలనే తొలగించి ఇబ్బందులకు గురిచేస్తోందని బాధితులు వాపోతున్నారు.

278 పేర్లు గల్లంతు

  

టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీలో గందరగోళం

 కావాలనే తొలగించారని లబ్ధిదారుల ఆరోపణ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు పొందిన వారికి చుక్కెదురవుతోంది. అప్పట్లో ఇళ్లకోసం డబ్బులు చెల్లించి.. తరువాత ఇంటి ధ్రువపత్రాలు పొందిన వారి పేర్లు సైతం తాజా జాబితాలో  లేవు.  దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. టిడ్కో ఇళ్ల మంజూరులో మొదటి నుంచీ తీవ్ర జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం... ఇపుడు కొందరి పేర్లను కావాలనే తొలగించి ఇబ్బందులకు గురిచేస్తోందని బాధితులు వాపోతున్నారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ కలిపి 4,310 ఇళ్లను మంజూరు చేస్తూ అప్పట్లో జిల్లా కమిటీ నిర్ణయించింది. ఇందులో 4,160 ఇళ్లు అనుమతి పొందాయి. వాటిలో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 3,076 ఇళ్లు మంజూరయ్యాయి. పట్టణ సమీపంలోని సారిపల్లి, సోనియానగర్‌ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు అప్పట్లోనే పూర్తయాయి. వీటికోసం ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ లబ్ధిదారులను ఎంపిక చేసింది. విజయనగరంలో సుమారు 278 మంది పేర్లను తొలగించారు. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. తమను ఎందుకు తొలగించారో కారణం కూడా చెప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం చేయవద్దని ప్రాధేయపడుతున్నారు.

  ఆత్మహత్యే శరణ్యం

మేము నిరుపేద కుటుంబానికి చెందిన వారం. గతంలో టిడ్కో ఇల్లు మంజూరు చేశారు. అందుకు అప్పట్లో రూ.3500 చెల్లించాం. నాకు భర్త లేరు. ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇప్పుడు నా పేరు అర్హుల జాబితాలో లేదు. దీంతో కొద్ది రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్‌ స్పందనలో ఫిర్యాదు చేశాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇల్లు కేటాయించకపోతే  ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు.

          -   షేక్‌ నూరి, 10వ వార్డు విజయనగరం పట్టణం


అప్పు చేసి డీడీ చెల్లించా

టి డ్కో పథకం కింద పక్కా ఇల్లు మంజూరు కావడంతో అప్పు చేసి రూ.50,000 చెల్లించాను. సారిపల్లిలో ఇల్లు వస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు అర్హుల జాబితాలో నా పేరు లేదు.  దుస్తుల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మిగిలిన డబ్బులకు బ్యాంకు వారు రూ.2,84,000 రుణం చెల్లించాలని మెసేజ్‌ పంపించారు. ఇప్పుడు ఇళ్లు ఇవ్వకపోతే చావే మార్గం .

                  - తెడ్లాపు సునీత, 10వ వార్డు, విజయనగరం పట్టణం

----------------


Updated Date - 2020-12-30T05:33:08+05:30 IST