ఫీజు పంచాయితీ

ABN , First Publish Date - 2020-06-11T09:17:49+05:30 IST

జిల్లాలోని అన్ని కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేశాం. ప్రస్తుతం ఏ కళాశాలకు పెండింగ్‌ లేవు.

ఫీజు పంచాయితీ

తేలని రీయింబర్స్‌మెంట్‌ బకాయిల గొడవ

అన్ని కళాశాలలకు నిధులు విడుదల చేశామంటున్న అధికారులు

కొన్నింటికే ఇచ్చారంటున్న యాజమాన్యాలు

ఫీజుల తగ్గింపుపై అభ్యంతరం

కోర్టుకువెళ్లిన పలు కళాశాలల నిర్వాహకులు

అన్నింటినీ ఒకే గాటన కట్టడం సరికాదని వాదన

వాటికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సమాచారం

భారంగా మారిన నిర్వహణ....అప్పులు చేయాల్సిన దుస్థితి

ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు పెండింగ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేశాం. ప్రస్తుతం ఏ కళాశాలకు పెండింగ్‌ లేవు. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలు చదువుతున్న కాలేజీకి ఇప్పటికే ఫీజులు చెల్లించి వుంటే...వెంటనే కాలేజీ యాజమాన్యాల నుంచి తిరిగి తీసుకోండి. ఫీజుల విషయంలో వేధింపులకు గురి చేస్తే మాకు ఫిర్యాదు చేయండి’’ 


...ఇవి అధికారులు చెబుతున్న మాటలు.

‘‘కాలేజీలో ఉన్న వసతులు, సౌకర్యాలను బట్టి ఫీజుల్లో వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వం అన్ని కాలేజీలను ఒకే గాటన కట్టి ఫీజులను నిర్ణయించడం సరైన విధానం కాదు. గతంలో వున్న ఫీజులతో పోలిస్తే ప్రభుత్వం 30 శాతం వరకు తగ్గించేసింది. దీనిపై కోర్టుకు వెళ్లిన కాలేజీలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలన్నీ విడుదల చేశామని అధికారులు చెప్పడం సరికాదు. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్‌-డి వంటి కోర్సులు చదివే విద్యార్థుల ఫీజులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు’’


...ఇదీ నగరంలోని ఓ ప్రముఖ కళాశాల ప్రతినిధి ఆవేదన 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదలపై ప్రభుత్వానికి, కొన్ని కళాశాలలకు మధ్య పంచాయితీ నడుస్తోంది. ప్రభుత్వం ఫీజులను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు కాలేజీల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. కోర్టుకు వెళ్లిన కాలేజీలకు మినహా మిగిలిన వాటికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసినట్టు తెలిసింది. కాగా ఫీజుల నిర్ధారణ విషయంలో ప్రభుత్వం తీరు పట్ల పలు కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, గ్రేడింగ్‌ను బట్టి కాలేజీల్లో ఫీజులు ఉంటాయని, అన్ని కళాశాలలకు ఒకే రీతిన ఫీజులను నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని పలు కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. కాలేజీల నిర్వహణలో లోటుపాట్లు ఏమైనా ఉంటే బయటపెట్టి, ఈ కారణంగా ఫీజులను తగ్గిస్తున్నట్టు చెబితే బాగుండేదని, అటువంటిదేమీ చెప్పకుండా ఫీజులను తగ్గిస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉద్యోగులకు జీతాల బకాయిలు

ప్రభుత్వం భారీమొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో పలు కాలేజీల యాజమాన్యాలు...తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో కాలేజీ నిర్వహణకు నెలకు రూ.20 లక్షలు నుంచి రూ.40 లక్షల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2020-06-11T09:17:49+05:30 IST