తవ్వుకుంటూ.. తోలుకుంటూ..!

ABN , First Publish Date - 2020-12-19T05:45:48+05:30 IST

ఇక్కడి బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరసామి ఆలయం వెనుక సర్వే నంబరు 301లో వంద ఎకరాల విస్తీర్ణంలో గల కొండ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

తవ్వుకుంటూ.. తోలుకుంటూ..!
కారులోంచి మాట్లాడుతున్న తహసీల్దార్‌కు సమాధానం చెపుతున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌

  కరిగిపోతున్న కొండ

 బలిఘట్టం సర్వే నంబరు 301లో యథేచ్ఛగా తవ్వకాలు

  పది ట్రాక్టర్లతో పట్ట పగలు గ్రావెల్‌ రవాణా

  తహసీల్దార్‌ చూసినా పెద్దగా పట్టించుకోని వైనం!

నర్సీపట్నం, డిసెంబరు 18 : ఇక్కడి బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరసామి ఆలయం వెనుక సర్వే నంబరు 301లో వంద ఎకరాల విస్తీర్ణంలో గల కొండ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మూడు రోజులుగా ట్రాక్టర్లతో గ్రావెల్‌ను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం పట్టపగలు 10 ట్రాక్టర్లతో తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం గమనార్హం. అక్టోబరు 4న ‘తరుగుతున్న కొండ- అధికారుల అండ’ శీర్షికతో కొండ అక్రమ తవ్వకాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు కూలీలను విచారించి, బతుకుతెరువు కోసం తవ్వుకుంటున్నారని తహసీల్దార్‌ విడిచిపెట్టేశారు. అక్టోబరు 31న అక్రమ తవ్వకాల విషయాన్ని మరోసారి స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో తప్పనిసరి స్థితిలో తవ్వకాల ప్రాంతం నుంచి రెండు ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. మైనింగ్‌ శాఖకు కేసును అప్పగిస్తామని తహసీల్దార్‌ చెప్పారు. 

ఇదిలావుంటే, మూడు రోజులుగా యథేచ్చగా కొండను పిండి చేస్తున్నా అధికారుల్లో చలనం లేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం పది ట్రాక్టర్లతో కొండ మట్టిని బహిరంగంగా తరలించారు. బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో రోడ్డులో మట్టితో ట్రాక్టర్లు వెళుతుండగా, అదే సమయంలో తహసీల్దార్‌ జయ కారులో వెళుతున్నా పెద్దగా పట్టించుకోకుండా.. డ్రైవర్‌తో మాట్లాడి వెళ్లిపోయారు. దీంతో ‘ఆంధ్రజ్యోతి’ ట్రాక్టర్‌ డ్రైవర్‌ను కొండ మట్టిని ఎక్కడకు తరలిస్తున్నారని ప్రశ్నించగా, శుక్రవారం నుంచి సబ్‌ కలెక్టర్‌ బంగ్లాకు తోలమన్నారని చెప్పారు. ఐదారు సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రాజకీయనాయకుల ప్రమేయంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గనుల శాఖ ఏడీ ప్రకాశ్‌కుమార్‌ను వివరణ కోరగా, అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషం తనకు తెలియదన్నారు. తహసీల్దార్‌ ద్వారా తెలుసుకుంటానని చెప్పారు. 

Read more