అంతా గప్‌చుప్‌

ABN , First Publish Date - 2020-03-02T10:27:24+05:30 IST

రాష్ట్రంలో పెను వివాదానికి దారితీసిన ఎయిర్‌పోర్టు ఘటనపై నగర పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. కానిస్టేబుల్‌ నుంచి పోలీస్‌ కమిషనర్‌

అంతా గప్‌చుప్‌

ఎయిర్‌పోర్టు ఘటనపై పోలీసులు గోప్యం

డీజీపీని కలిసేందుకు విజయవాడ వెళ్లిన సీపీ

నేడు హైకోర్టుకి నివేదిక

సోషల్‌ మీడియా క్లిప్పింగ్‌లపై వైసీపీ శ్రేణుల్లో గుబులు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెను వివాదానికి దారితీసిన ఎయిర్‌పోర్టు ఘటనపై నగర పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. కానిస్టేబుల్‌ నుంచి పోలీస్‌ కమిషనర్‌ స్థాయి అధికారి వరకూ ఎవరూ దీనిపై నోరెత్తకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


గత నెల 27న ఉత్తరాంధ్ర పర్యటన కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టుకు రాగా, అక్కడ వైసీపీ శ్రేణులు ఆయనను బయటకు రానీయకుండా గలాటా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైసీపీ శ్రేణులు వీరంగం చేయడంతోపాటు పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పైగా తాము పర్యటనకు పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రానీయకుండా 151 నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించడంపై టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, సీరియస్‌గా పరిగణించిన హైకోర్టు సోమవారం నాటికి సీపీ, డీజీపీ స్వయంగా హాజరై వేర్వేరుగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.


పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించేలా వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేయగా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కంగుతిన్న పోలీస్‌ అధికారులు ఆగమేఘాల మీద శుక్రవారం ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు టీడీపీకి చెందిన 20 మందిపైనా, వైసీపీ మహిళా నేత అడ్డాల కృపాజ్యోతి, జేటీరామారావుతోపాటు మరో 30 మందిపైనా  క్రైమ్‌ నంబర్‌ 47/2020, 48/2020, 49/2020, 50/2020లతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమందిని పోలీసులు  ఎయిర్‌పోర్టు  పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వేర్వేరుగా వాగ్మూలం నమోదు చేసుకుని తిరిగి పంపేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.


ఆవేశంగా ఆ రోజు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసి, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశామని, ఇప్పుడు వాటివల్ల ఎక్కడ పోలీసులు వచ్చి తీసుకుపోతారోనని భయపడుతున్నారు. అయితే పైన పేర్కొన్న ముగ్గురి పేర్లు మినహా మిగిలిన వారి పేర్లను మాత్రం పోలీసులు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. హైకోర్టుకి నివేదించిన తర్వాతే వారి పేర్లు, వారిపై నమోదుచేసిన సెక్షన్లు వంటి వివరాలను బహిర్గతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ఒకవేళ కేసులు ఎవరిపై నమోదు చేశామనేది కోర్టుకి నివేదించడానికి ముందే బయటకు వచ్చేస్తే కోర్టు మరింత ఆగ్రహం వ్యక్తంచేయడంతోపాటు అసంతృప్తి వ్యక్తంచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఎయిర్‌పోర్టు ఘటనలో పోలీసులు ఆందోళన చేసినవారిని, టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులు విసిరి వీరంగం చేసినవారిని వదిలేసి, శాంతియుతంగా స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లినవారిపై కేసులు నమోదుచేయడం దారుణమంటూ టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.


వైసీపీ నేతలు, కార్యకర్తల వీరంగానికి సంబంధించి ఆ పార్టీకి చెందిన సోషల్‌మీడియా గ్రూపుల్లోనే వైరల్‌ అవుతోందని, అయినా పోలీసులు మాత్రం వాటిని పట్టించుకోకపోవడం ఆ శాఖ పనితీరుని మరింత దిగజార్చినట్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ వీరంగానికి సంబంధించిన వీడియోలతోపాటు పోలీసుపై తిరగబడడం, దౌర్జన్యం చేయడానికి సంబంధించిన వీడియోలను సీపీ ఆర్కేమీనాకు అందజేసేందుకు టీడీపీ నేతలు ఆదివారం అపాయింట్‌మెంట్‌ కోరారు. అయితే సీపీ అందుబాటులో లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేసుకున్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. 


విజయవాడ వెళ్లిన సీపీ ఆర్కేమీనా

ఎయిర్‌పోర్టు ఘటనపై హైకోర్టుకు సోమవారం నివేదిక అందజేయాల్సి ఉన్నందున సీపీ ఆర్కేమీనా ఆదివారం విజయవాడ వెళ్లారు. ఆదివారం డీజీపీ, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో భేటీ అయినట్టు సమాచారం. కోర్టుకు అందజేయాల్సిన నివేదికపై లోతుగా చర్చించినట్టు తెలిసింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా తాము ఇచ్చిన అనుమతి, ఎయిర్‌పోర్టులో దిగినప్పటి నుంచి పర్యటన మార్గాల్లో తాము తీసుకున్న భద్రతచర్యలు, బందోబస్తు ఏర్పాట్లను నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. అంతేకాకుండా ఎయిర్‌పోర్టులో వైసీపీ శ్రేణులు అడ్డగించినపుడు తాము వారిని పక్కకు తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు, చంద్రబాబుకు హాని జరగకుండా చేపట్టిన రక్షణ చర్యలకు సంబంధించి తమ వాదన వినిపించేలా నివేదికను రూపొందించినట్టు సమాచారం. అంతేకాకుండా చంద్రబాబుకి సీఆర్‌పీసీ 151 నోటీసు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేదానిపై కూడా పోలీసులు కోర్టుకి తమ వివరణ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. 

Updated Date - 2020-03-02T10:27:24+05:30 IST