అప్పన్న సన్నిధిలో ఘనంగా చిలుకు ద్వాదశి

ABN , First Publish Date - 2020-11-28T05:18:11+05:30 IST

చిలుకు ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి)ని శుక్రవారం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

అప్పన్న సన్నిధిలో ఘనంగా చిలుకు ద్వాదశి
చెరకు, రోకళ్లతో దంచుతున్న అర్చకులు

సింహాచలం, నవంబరు 27: చిలుకు ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి)ని శుక్రవారం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామివారి పవళింపు సేవ అనంతరం సాయంత్రం 4 గంటలకు అలంకారి కరి సీతారామాచార్యులు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి, ఉభయ దేవేరులు, శయన పెరుమాళ్‌, ఆళ్వార్లను ఆస్థానమండపంలో ప్రత్యేక రజిత సింహాసనంపై ఉంచారు. స్థానాచార్యులు డా.టిపి రాజగోపాల్‌ పర్యవేక్షణలో విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షోడశోపచారాలతో పాటు, నృసింహ అష్టోత్తర శతనామావళితో పూజలు చేశారు. రోలు, రోకళ్లకు పూజలు చేసిన తర్వాత రోలులో నువ్వులపప్పు, బెల్లం, పాలు వేసి తొలుత చెరకు గడలతో, అనంతరం రోకళ్లతో దంచారు. ఈ మిశ్రమాన్ని స్వామివారికి, ఇతర దేవతామూర్తులకు నైవేద్యంగా సమర్పించి, మంగళాశాసనం, నీరాజనాలందించారు.  ఆలయ ఆచారం మేరకు అనకాపల్లికి చెందిన దివంగత ఆడారి నూకయ్య కుటుంబ సభ్యులు ఉత్సవానికి వినియోగించే నువ్వులపప్పు, బెల్లం, చెరకుగడలు, పాలను సమర్పించారు. ఆలయ అర్చకులు చక్రవర్తి, అప్పాజీ పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ సహాయ కార్యనిర్వహణాధికారి కేకే రాఘవకుమార్‌, పర్యవేక్షణాధికారి దాసరి బంగారినాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.  


Read more