విశాఖకు 17 లక్షల డోసులు

ABN , First Publish Date - 2020-12-19T06:16:57+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో వ్యాక్సిన్‌ వేయాల్సిన ఆరోగ్య సిబ్బంది వివరాలను సేకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ...తాజాగా ఆయా జిల్లాలకు ఎంత మోతాదులో వ్యాక్సిన్‌ డోసులు పంపిస్తామన్నది తెలియజేసింది.

విశాఖకు 17 లక్షల డోసులు

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల వ్యాక్సినూ ఇక్కడికే...

కేంద్రం నుంచి సమాచారం

సుమారు 40 క్యూబిక్‌ లీటర్లు

జిల్లాలోని కోల్డ్‌ చైన్‌ కాంప్లెక్స్‌ నుంచి ఆయా జిల్లాలకు పంపిణీ


విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో వ్యాక్సిన్‌ వేయాల్సిన ఆరోగ్య సిబ్బంది వివరాలను సేకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ...తాజాగా ఆయా జిల్లాలకు ఎంత మోతాదులో వ్యాక్సిన్‌ డోసులు పంపిస్తామన్నది తెలియజేసింది. విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల వ్యాక్సిన్‌ను విశాఖకు పంపించనుంది. ఈ నాలుగు జిల్లాలకు కలిపి 40 క్యూబిక్‌ లీటర్లు...అంటే 17 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను పంపనుంది. ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి జిల్లా ఇమ్యునైజేషన్‌ కార్యాలయంలోని కోల్డ్‌ చైన్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాట్లుచేశారు. ఇక్కడ నుంచి ఆయా జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా వ్యాక్సిన్‌ను పంపించనున్నారు. ఏ జిల్లాకు ఎన్ని డోసులు అన్నది వ్యాక్సిన్‌ చేరుకున్న తరువాత కేంద్రం వెల్లడిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా జిల్లాలో మొదటి దశ వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ఇవ్వాల్సిన మెడికల్‌ ఆఫీసర్లకు వర్చువల్‌ విధానంలో శిక్షణ పూర్తి చేశారు. ఆయా మెడికల్‌ ఆఫీసర్లు స్థానికంగా పీహెచ్‌సీలో పనిచేసే ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 


Updated Date - 2020-12-19T06:16:57+05:30 IST