సిక్కోలు లాక్‌డౌన్‌...!

ABN , First Publish Date - 2020-03-24T07:35:25+05:30 IST

కరోనా వైరస్‌ను ‘లాక్‌డౌన్‌తో కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని

సిక్కోలు లాక్‌డౌన్‌...!

జిల్లాఅంతటా 144 సెక్షన్‌ అమలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే

ఐదుగురి కంటే ఎక్కువమంది సమావేశమైతే అరెస్టే

ఒడిశా సరిహద్దులు మూసివేత

జిల్లాలో దుకాణాలు మూసివేయించిన అధికారులు 

ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలు నిలిపివేత

అందుబాటులో అత్యవసర సేవలు మాత్రమే 

ఇళ్లకే పరిమితమైన ప్రజలు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ను ‘లాక్‌డౌన్‌తో కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ఈ నెల 31 వరకూ ఈ విధానం అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి లాక్‌డౌన్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. దీంతోపాటు 144 సెక్షన్‌ విధించింది. లాక్‌డౌన్‌ పాటించని వారి విషయంలో చట్టపరంగా వ్యవహరించాలంటూ కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అధికారులు జిల్లాలో ఎక్కడికక్కడ షాపులు మూసివేయించారు. అటు ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేశారు. ఐదుగురి కంటే ఎక్కువమంది సమావేశమైతే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలు నిలిపివేశారు. రవాణా సేవలు  స్తంభించడంతో ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితమవుతున్నారు. 


సిక్కోలు లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. కరోనా మహమ్మారి విజృంభించకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా అంతటా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇందులో భాగంగా 144 సెక్షన్‌ విధిస్తూ కలెక్టర్‌ నివాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా జిల్లాలో ఈ నెల 31 వరకూ లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని వివరించారు. లాక్‌డౌన్‌కు సహకరించని వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురి కంటే ఎక్కువమంది సమావేశమైతే.. వారిని తక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

 

దుకాణాల మూత

జనతాకర్ఫ్యూలో భాగంగా ఆదివారం అంతా మూతపడిన దుకాణాలు.. సోమవారం తెరుచుకున్నాయి. ఈ సమాచారం కలెక్టర్‌కు చేరడంతో అధికారులు రంగప్రవేశం చేశారు. నిత్యావసరాల దుకాణాలు, రైతుబజార్లను మినహాయించి జిల్లావ్యాప్తంగా ఇతర అన్ని దుకాణాలను అధికారులు మూసివేయించారు. లాక్‌డౌన్‌లో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామానికో ఆటోను సిద్ధంగా ఉంచి.. ఎవరికైనా ఆరోగ్యం క్షిణిస్తే.. వారిని ఆ ఆటోద్వారా సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


ఈనెల 29న ప్రతి కుటుంబానికి బియ్యం, కేజీ కందిపప్పు, రూ.1000 వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మత్స్యకార ప్రాంతాల్లో సీమెన్‌లు వేలాదిగా ఉన్నారు. వీళ్లు తరచూ విదేశాలను చుట్టు వస్తుంటారు. దీంతో జిల్లాకు చెందినవారు ఎంతమంది వస్తున్నారు? వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలాఉంది?.. సోషల్‌ డిస్టెన్స్‌మెయింటైన్‌ చేస్తున్నారా? అన్నది పర్యవేక్షించేందుకు మత్స్యశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.


వీటికి మినహాయింపు...

లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం వీటి విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఆహారం, నిత్యావసర సరుకులు, పాలు, పండ్లు, కూరగాయలు, విద్యుత్‌, నీరు, మందులు, మెడికల్‌ సామగ్రి, గ్యాస్‌, పెట్రోల్‌ వంటివి రవాణా చేయవచ్చు. అధికారులు నిర్దేశించిన సయంలో మాత్రమే వీటిని విక్రయించేలా ఆంక్షలు విధించారు. పోలీసులు, వైద్యం, మీడియా, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించి అవసరం మేరకు తిరిగే అవకాశం కల్పించారు.  


ఇవి మూత పడాల్సిందే...

లాక్‌ డౌన్‌ సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్టు వాహనాలు తిరగవు. నిత్యవసర సరుకులు రవాణా చేసే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉంటుంది. కార్యాలయాలు, పరిశ్రమలు, వర్క్‌ షాపులు, గోదాములు మూసివేయాలి. ఒకవేళ తీయాల్సి వస్తే తక్కువ సిబ్బందితో మాత్రమే నిర్వహించాలి. కనీసం పది మంది కలిసి చేసే కార్యక్రమాలు ఏవీ చేయకూడదు. 


ఏర్పాట్ల పర్యవేక్షణ

జిల్లా కేంద్రంలో కరోనా వైద్య చికిత్సల కోసం కనీసం 200 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల క్వారంటైన్‌ సదుపాయం కల్పించనున్నారు. కరోనా నివారణ చర్యలకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారిని హోమ్‌ క్వారంటైన్‌లో 260మందిని ఉంచారు. వీళ్ల ఆరోగ్య పరిస్థితిని స్థానిక వైద్యబృందం పరిశీలిస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు.. నిబంధనలు అతిక్రమించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రతి ఇద్దరికి ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి చేతికి స్టాంపులు, స్టిక్కర్లను వేసేందుకు కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్‌ బెడ్స్‌ను ఏర్పాటు చేశారు.  విదేశాల నుంచి వచ్చినవారిని నేరుగా తీసుకువచ్చేందుకు 500 బెడ్స్‌ సౌకర్యం కల్పించారు. అదనంగా పది వెంటిలేటర్లను కూడా సమకూర్చారు. అంబేద్కర్‌ యూనివర్సిటీ,  సర్వజనాసుపత్రి, ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వ్యక్తిగత రూమ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు.


స్తంభించిన రవాణా 

జిల్లా అంతటా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమైపోయాయి. ఈనెల 31 వరకు ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని ఆర్టీసీ సీటీఎం స్పష్టం చేశారు. ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. సరైన కారణాలు వెల్లడించని వారిని తిరిగి వెనక్కి పంపేశారు. శ్రీకాకుళం నగరంలోకి ద్విచక్ర వాహనాలను సైతం అడ్డుకుని.. వారు నగరంలోకి ఎందుకు వస్తున్నారు?.. అత్యవసర పరిస్థితా?.. అనే వివరాలను సేకరించారు. ఇతర పనుల కోసం వచ్చిన వారిని వెనక్కి పంపేశారు. అంతటా పోలీసుల భద్రత పెరిగింది. ఒడిశా సరిహద్దులు మూసివేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో ఉన్న ప్రైవేటు వాహనాలతో జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. 


సాధారణ వైద్యసేవలు నిలిపివేత 

శ్రీకాకుళంలో పెద్దపెద్ద ప్రవైట్‌ ఆసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలను నిలిపివేశారు.  లాక్‌డౌన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రుల ముందు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులు... గత్యంతరం లేక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తున్నారు. మరికొందరు మందుల దుకాణాల్లో మందులను కొనుగోలు చేస్తున్నారు. ఇక మందుల దుకాణాల్లోను, షాపింగ్‌మాల్స్‌లోనూ శానిటైజర్లు లభించలేదు. మాస్కులు, శానిటైజర్లు మాత్రం అడగవద్దని.. ప్రస్తుతం స్టాక్‌ తమవద్ద లేదని బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో మాస్కులకు, శానిటైజర్లకు  గిరాకీ పెరిగింది. 


నిత్యావసరాలకూ.. కంట్రోల్‌రూమ్‌

లాక్‌డౌన్‌ ప్రకటించడంతో శ్రీకాకుళం రైతుబజార్‌లో సరుకుల కోసం ప్రజలు ఎగబడ్డారు. మధ్యాహ్నం 12గంటలకే రైతుబజార్‌ మూతపడింది. ధరలు కూడా కొన్ని చోట్ల అమాంతం పెంచేశారు.  నిత్యావసర సరుకులపై ఫిర్యాదులకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కరోనావ్యాధిపై కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తోంది. ఇక్కడే నిత్యావసరాల సరుకుల లోపాలు, ధరల పెంపు వంటి సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. స్పందన కార్యక్రమానికి కూడా ప్రజలు రానవసరం లేకుండా.. ఫోన్‌లో సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాట్లు చేశారు.




మొత్తం మూడు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేశారు. సాధారణ సమస్యల కోసం (స్పందన కార్యక్రమం) 08942 240605 (భాస్కరరావు, పర్యవేక్షకులు), నిత్యావసరాల సరుకులపై ఫిర్యాదు ఇచ్చేందుకు 08942 240606 (కృష్ణకుమారి, సీనియర్‌ సహాయకులు), కరోనా సమాచారంపై 9491222122, 08942 240699 నంబర్లకు జిల్లా ప్రజలు నేరుగా ఫోన్‌చేసి సమాచారం అందించవచ్చు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని.. అధికారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-24T07:35:25+05:30 IST