ఎస్‌ఈబీ ఓవరాక్షన్‌!

ABN , First Publish Date - 2020-12-19T07:51:42+05:30 IST

‘ఇసుక, మద్యం, మట్టి తవ్వకాలు, జూదం, మత్తు పదార్థాలు రవాణా చేసే స్మగ్లర్ల ఆట కట్టించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని ఏర్పాటు చేస్తే

ఎస్‌ఈబీ ఓవరాక్షన్‌!

ప్రభుత్వం, అధికారులపైనే కేసులా? సీఎం ఫైర్‌

అంగన్‌వాడీ, సచివాలయ భవనాలను

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎలా అడ్డుకుంటుంది?

కలెక్టర్లు, ఎస్పీలకు గట్టిగా చెప్పండి

లిఖితపూర్వక ఆదేశాలివ్వండి

రెవెన్యూ శాఖకు సీఎం జగన్‌ నిర్దేశం

కేబినెట్‌ తర్వాత మంత్రులతో ముఖాముఖి

300 యూనిట్లు దాటినా పథకాలు కోయొద్దు

పింఛన్లు అందకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ఠ

బ్యాంకులు ఇంకా ప్రీమియం చెల్లించలేదు

సమస్యలు ఏకరువు పెట్టిన అమాత్యులు

చిత్ర పరిశ్రమకు చేయూత

థియేటర్ల ఫిక్స్‌డ్‌ చార్జీలపై ఊరట


అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘ఇసుక, మద్యం, మట్టి తవ్వకాలు, జూదం, మత్తు పదార్థాలు రవాణా చేసే స్మగ్లర్ల ఆట కట్టించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలపైనే కేసులు పెడతానంటూ ఓవరాక్షన్‌ చేస్తోంది. దీని వల్ల ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. ‘జిల్లా కలెక్టర్‌, తహశీల్దార్‌  అనుమతులు ఇచ్చాక.. ఇసుక వాడొద్దు. మట్టి తవ్వొద్దు అనేందుకు ఎక్సైజ్‌ సీఐ ఎవరట? ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు వీలుగా భూమిని చదును చేయాలి. దీనికి కూడా ఎస్‌ఈబీ అడ్డుపడితే ఎలా? అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయ భవనాలు నిర్మించేందుకు ఇసుక, మట్టి పనులు అవసరం. దీనికి కూడా అభ్యంతరం చెబుతారా? ప్రభుత్వాధికారులపైనా.. ప్రభుత్వం చేపడుతున్న పనులపైనా ఓవరాక్షన్‌ చేస్తే ఎలా? దీనిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు గట్టిగా చెప్పండి’ అని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. నోటి మాటగా కాకుండా లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారమిక్కడ సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో అజెండా అంశాలు ముగిశాక..


మంత్రులతో ముఖ్యమంత్రి దాదాపు 45 నిమిషాల పాటు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగానే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి ఎస్‌ఈబీ వ్యవహార శైలిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ భవనాలు, ప్రభుత్వ స్కూళ్లు, ఇతర భవనాలు నిర్మించేందుకు ఇసుకను, మట్టిని తీసుకువస్తుంటే.. కేసులు పెడతామని ఎస్‌ఈబీ అధికారులు బెదిరిస్తున్నారని.. లారీలను రోడ్లపైనే రోజుల కొద్దీ ఆపేస్తున్నారని చెప్పారు. ఇసుకను తీసుకొచ్చేందుకు ప్రభుత్వాధికారుల ఆదేశాలు ఉన్నాయని.. తహశీల్దారు నుంచి అనుమతులు తీసుకున్నామని చెబుతున్నా ఎక్సైజ్‌ సీఐ వినడం లేదని.. మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకుంటేనే తాము ఆమోదిస్తామని.. లేదంటే కేసులు పెడతామంటూ మంత్రులనే బెదిరిస్తున్నారని తెలిపారు. తమ ఇబ్బందులనూ ఇంకొందరు మంత్రులు ప్రస్తావించారు. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఈబీ హద్దుల్లో ఉండాలంటూ లిఖితపూర్వక ఆదేశాలివ్వాలని సూచించారు. కాగా.. కొత్త సంవత్సరం నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తున్నందున ఎస్‌ఈబీ ప్రమేయం పూర్తిగా తగ్గిపోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.


అర్హతలున్నా.. లబ్ధి అందడం లేదు..

నెలకు 300 యూనిట్లు కరెంటు వినియోగం దాటితే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేస్తున్నారని తూర్పు గోదావరికే చెందిన మరో మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ప్రధానంగా పింఛను నిలిచిపోతోందని, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని చెప్పారు. ఇదే విషయాన్ని కృష్ణా జిల్లాకు చెందిన ఇంకో మంత్రి కూడా ప్రస్తావించారు. 9 లక్షల మందికి పంటల బీమా ప్రీమియంను బ్యాంకుల ద్వారా కట్టామని.. కానీ బ్యాంకులు ఇప్పటి వరకూ 2 లక్షలు కూడా అప్‌లోడ్‌ చేయలేదని మరో మంత్రి చెప్పారు.


  దీనిపై సీఎం స్పందించారు. ‘అర్హులైన వారందరికీ పథకాలను అందజేస్తామని నేను హామీ ఇస్తున్నాను. ఆర్థిక శాఖ దానిని అమలు చేయకపోతే ఎలా’ అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌తో అన్నారు. ముఖ్యమంత్రిగా తాను మాటిచ్చానంటే ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు చేయాల్సిందేనని ఆయన చెప్పినప్పుడు.. ఒకదాని వెంట ఒకటిగా పథకాలు వస్తున్నాయని.. నిధుల సర్దుబాటు ఆలస్యమవుతోందని రావత్‌ పేర్కొన్నట్లు సమాచారం. అయితే తాను మాటిచ్చానంటే.. దానిని అమలు చేయాల్సిందేనని సీఎం పునరుద్ఘాటించారు. అర్హులందరినీ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటూ తానే కోరుతుంటే.. వాటిని ఫలప్రదం చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జల వనరుల శాఖకు రూ.500 కోట్లు మంజూరు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. రోడ్ల నిర్మాణాలకు నిధులివ్వాలని పలువురు మంత్రులు జగన్‌ను అభ్యర్థించినట్లు తెలిసింది.

Read more