పులివెందులలో వైసీపీలోకి సతీష్‌రెడ్డి.. కారణం ఇదేనా?

ABN , First Publish Date - 2020-03-24T16:26:57+05:30 IST

పులివెందులలో వైసీపీలోకి సతీష్‌రెడ్డి.. కారణం ఇదేనా?

పులివెందులలో వైసీపీలోకి సతీష్‌రెడ్డి.. కారణం ఇదేనా?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పులివెందుల అనగానే గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబం. అలాంటి నియోజకవర్గంలో టీడీపీకి పెద్దదిక్కుగా మొన్నటివరకు సతీష్‌కుమార్‌రెడ్డి వ్యవహరించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు వైఎస్ కుటుంబానికి ఆయన బద్ధశత్రువుగా కొనసాగారు. అలాంటి సతీష్‌కుమార్‌రెడ్డి.. వైఎస్ కుటుంబంతో తనకున్న శత్రుత్వాన్ని మరిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వైసీపీలోకి ఆహ్వానించడంతో ఆయన స్నేహహస్తం చాచారు. ఇలా అక్కడ ఉన్నట్టుండి మిత్ర- శత్రు బంధం తారుమారు కావడానికి కారణాలేంటి? సతీష్‌రెడ్డిని స్వయంగా సీఎం జగన్ తమ పార్టీలోకి ఎందుకు ఆహ్వానించారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? 


   రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటారు. ఇది నిజం అని మరోసారి నిరూపితమైంది. ఈ ఉదంతానికి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేదికగా నిలిచింది. నిజానికి కడప జిల్లా పులివెందుల.. వైఎస్ కుటుంబానికి రాజకీయ కంచుకోట. 50 ఏళ్ల క్రితం ఇక్కడ వైఎస్ కుటుంబం రాజకీయంగా పురుడు పోసుకుంది. నాలుగు దశాబ్దాల క్రితం వరకు రాజారెడ్డి, పదేళ్ల క్రితం వరకు ఆయన కుమారుడు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలా నాటినుంచి నేటివరకు వంశపారంపర్యంగా పులివెందుల రాజకీయాలు వైఎస్ కుటుంబానికే సొంతమయ్యాయి. మొదట పులివెందులలో వైఎస్ రాజారెడ్డి ప్రజల యోగక్షేమాలు చూసేవారట. ఆయన మరణానంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. నాడు సీఎంగా వైఎస్ఆర్ బిజీబిజీగా ఉన్న సమయంలో.. ఆయన సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర రెడ్డిలు పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకంగా మెలిగేవారు. ఇలా ఇక్కడ వైఎస్ కుటుంబం 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో బయటివ్యక్తులను గానీ, ఇతర పార్టీల వ్యక్తులను గానీ తమ పార్టీలో చేర్చుకుని.. ఊరిపై పెత్తనం మాత్రం ఇచ్చేవారు కాదని పరిశీలకులు అంటుంటారు.


   ఇక్కడికి సీన్ కట్ చేస్తే.. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి 26ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పట్లో పులివెందుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చేవారు. నాడు ఆయనపై పోటీ కోసం టీడీపీకి అభ్యర్థి లేకపోవడంతో సతీష్ కుమార్ రెడ్డే ముందుకు వచ్చారు. టీడీపీ తరఫు అభ్యర్థిగా ఆయన వైఎస్ఆర్ పై ప్రతిసారీ పోటీ చేసేవారు. పులివెందుల ఓడిపోయే సీటు అని సతీష్ రెడ్డికి తెలిసినప్పటికీ.. పార్టీ హైకమాండ్ ఆదేశాలను ఆయన  పాటించేవారు. పులివెందులలో  వైఎస్ కుటుంబంపై పోటీచేసి.. వారి వర్గీయులు పెట్టే బాధలు, దౌర్జన్యాలు భరించడం అంత ఆషామాషీ కాదని మొన్నటిదాకా సతీష్ కుమార్ రెడ్డే చెప్పుకుంటూ వచ్చారు. తనతోపాటు టీడీపీకి చెందిన రాంగోపాల్ రెడ్డి, ఇతర టీడీపీ వర్గీయులు ఆస్తులు, ప్రాణ నష్టాలు జరిగి తీవ్రంగా నష్టపోయామనీ, జైళ్లలో మగ్గామనీ, తమపై రౌడీ షీట్ కేసులు ఉన్నాయనీ సతీష్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసేవారు. 


  ఇదిలాఉండగా, గతేడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పులివెందులలో తెలుగుదేశం పార్టీపరంగా సతీష్ కుమార్ రెడ్డి అన్నివిధాలా వెనక్కి తగ్గుతూ వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబుతోనూ ఎన్నికల తర్వాత ఒకటి రెండుసార్లు మాత్రమే కలిశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, టీడీపీ కార్యక్రమాలకు సతీష్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పులివెందులలోని వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, జగన్ కుటుంబసభ్యులు కలిసి సతీష్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకుందామని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వారితో పులివెందులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులపై జగన్ చర్చలు జరిపారట. ఆ తర్వాత సతీష్ ని పార్టీలోకి తీసుకునేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. వివేకా హత్య కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళుతున్నందున పులివెందులలో పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదముందనీ, జిల్లా వైసీపీ కీలక నేతలు కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయనీ, అందుకే పులివెందులలో పార్టీకి సతీష్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడి అవసరం ఉంటుందనీ పార్టీ సీనియర్ నేతలు భావించారట. ఈ ముందస్తు ఆలోచనతోనే సతీష్ రెడ్డిని పార్టీలోకి తీసుకుందామని వైసీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.


   మరోవైపు టీడీపీ నాయకులు.. తమ పార్టీని సతీష్ కుమార్ వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబంపై టీడీపీ తరఫున పోటీకి దిగడం వల్లనే సతీష్ రెడ్డికి ఆ మాత్రమైనా గుర్తింపు వచ్చిందని వారు అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు అన్నివిధాలా న్యాయం చేసినప్పటికీ.. కేవలం స్వార్థం కోసమే జగన్ చెంతకు సతీష్ చేరారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జి బాధ్యతలను ఎమ్మెల్సీ బీటెక్ రవికి పార్టీ అధినేత అప్పగించారు. ఏదిఏమైనా  మూడు దశాబ్దాలపాటు వైఎస్ కుటుంబంతో శత్రుత్వం కలిగివుండి, 26 ఏళ్లు టీడీపీలో కొనసాగిన సతీష్ కుమార్ రెడ్డి.. చివరకు ముఖ్యమంత్రి జగన్ చెంతకు చేరడం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Read more