‘నేను వెళ్లుపోతున్నా.. నాతోపాటు నా బిడ్డ కూడా’అంటూ.. చిన్నారిని చున్నీకి కట్టుకొని..

ABN , First Publish Date - 2020-12-17T06:06:37+05:30 IST

‘నేను వెళ్లుపోతున్నా. దయచేసి బాధపడకండి..

‘నేను వెళ్లుపోతున్నా.. నాతోపాటు నా బిడ్డ కూడా’అంటూ.. చిన్నారిని చున్నీకి కట్టుకొని..
కమల, భాష్యధన్విన్‌ మృతదేహాలు

నాతోపాటు వాడూ..

చిన్నారిని చున్నీకి కట్టుకొని చెరువులోకి దూకిన వివాహిత

ఇద్దరూ మృతి

అత్తింటి వేధింపులే కారణం

పోలీసులకు చిక్కిన  సూసైడ్‌ నోట్

ఒంగోలులో విషాదం


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ‘నేను వెళ్లుపోతున్నా. దయచేసి బాధపడకండి. నాతోపాటు నా బిడ్డ కూడా ఎవ్వరికీ భారం కాకూడదు. అందుకే వాడిని కూడా తీసుకుపోతున్నా. నా పిల్లాడిని బాగా చూసుకునే వాళ్లు ఉన్నారు. కానీ వాడు పెద్దయిన తర్వాత తల్లిలేని వానిగా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇన్నాళ్లూ నాకు సహకరించిన బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతలు. తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నా. అమ్మా నేను నాన్న వద్దకు వెళ్లిపోతున్నా. తమ్ముడు సిద్ధూ జాగ్రత్త’ అని ఓ వివాహిత సూసైడ్‌ నోట్‌ రాసింది. అనంతరం బిడ్డతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన సంఘటన ఒంగోలులో బుధవారం చోటుచేసుకుంది. 


వివాహమైనప్పటి నుంచి వేధింపులు 

ఒంగోలు నగరం గోపాలనగరం ఒకటోలైన్‌లో నివాసం ఉండే ఉలిచి విజయమ్మ కుమార్తె కమల (25) పాలిటెక్నిక్‌ చదువుకుంది. ఆమెకు తండ్రి లేడు. రెండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వలిగొండ గ్రామానికి చెందిన చిల్లకూరి అఖిలేష్‌రెడ్డితో కమలకు వివాహమైంది. వారికి భాష్యధన్విన్‌ (11నెలలు) కుమారుడు ఉన్నాడు. వివాహం అయినప్పటి నుంచి కమలకు అత్తింటి వేధింపులు తప్పలేదు. ఈక్రమంలో ఆమె వేధింపుల కేసు కూడా పెట్టింది. పెద్దలు పలుమార్లు పంచాయితీ చేశారు. వేరు కాపురం పెట్టుకుని భార్యతో ప్రశాంతంగా ఉండాలని అఖిలేష్‌రెడ్డికి సలహా ఇచ్చారు. అందుకు అఖిలేష్‌ అంగీకరించలేదు. భార్యాభర్తల మధ్య తరచూ కీచులాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెలన్నర క్రితం కమలను పుట్టింటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆమె తల్లి విజయమ్మ పలుమార్లు అఖిలేష్‌తోపాటు, పెద్దమనుషులతో కూడా ఫోన్‌లో మాట్లాడింది. అఖిలేష్‌కు వేరు కాపురం పెట్టడం ఇష్టం లేదు. ఈక్రమంలో భార్య కమలపై కూడా ద్వేషం పెంచుకున్నాడు. కనీసం ఫోన్‌ కూడా చేయడం మానేశాడు. 


ఎవరికీ భారం కాకూడదనే..

ఈ క్రమంలో మంగళవారం కమలను తల్లి విజయమ్మ సున్నితంగా మందలించిది. ఏదోరకంగా భర్తతో కాపురం చేసుకోవాలని హితవు పలికింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కమల తన డైరీలో మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటి నుంచి బుధవారం ఉదయం బయటకొచ్చింది. తనకు పుట్టిన బిడ్డ కూడా ఎవరికీ భారం కాకూడదన్న నిర్ణయం తీసుకుంది.


రంగారాయుడు చెరువులో దూకి ఆత్మహత్య

రంగారాయుడు చెరువు వద్దకు చేరుకొంది. ఉదయం 11గంటల సమయంలో చంటిబిడ్డతో కమల బోరున విలపిస్తుండటాన్ని సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే కొందరు గమనించారు. మధ్యాహ్నం రెండు గంటలకు తల్లీబిడ్డల మృతదేహాలు నీటిపైకి తేలాయి. గుర్తించిన స్థానికుకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను వెలికి తీయించారు. చెరువు వద్ద చాలా చేపు కూర్చొని ఏడ్చిన తర్వాత కమల తన బిడ్డను చున్నీకి కట్టుకొని నీటిలోకి దూకి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆమె చెరువులో దూకిన వెంటనే ఓ యువకుడు గుర్తించి రక్షించేందుకు తన స్నేహితుడి సహాయం కోరినట్లు తెలిసింది. ఆయన అందుకు సమ్మతించకపోవడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.  కమల తల్లి విజయమ్మ ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారామయ్య సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.


Updated Date - 2020-12-17T06:06:37+05:30 IST