జీడి రైతులకు తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలి: పవన్

ABN , First Publish Date - 2020-06-25T23:56:37+05:30 IST

కరోనా ప్రభావంతో జీడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని...

జీడి రైతులకు తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలి: పవన్

అమరావతి: కరోనా ప్రభావంతో జీడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బస్తా జీడి పిక్కల ధర గతేడాది రూ.12 వేలు – రూ.14 వేల మధ్య ఉంటే ఈ యేడాది రూ.8 వేలు మాత్రమే పలుకుతోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జీడి మామిడి రైతులు వాళ్ల కష్ట, నష్టాలను జనసేన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.


‘‘ఆ జిల్లాలో సుమారు 65వేల ఎకరాల్లో సాగవుతోందని పవన్ తెలిపారు. తుపాను, ఇతర ప్రకృతి విపత్తుల్లో జీడి తోటలకు నష్టం కలుగుతోందన్నారు. ‘‘అప్పుడు చేసిన అప్పులను తీర్చేందుకే రైతు కుటుంబాల్లోని పురుషులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా కరోనా కారణంగా పనులు లేకపోవడంతో స్వస్థలాలకు వస్తున్నారు. ఇక్కడ ఉన్న పంటకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. జీడి రైతుల సాగు ఖర్చులు నిమిత్తం బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందడం లేదు. దళారుల నుంచే అప్పులు చేసి చివరకు వాళ్ళకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.’’ అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 


జీడి పంట ప్రభుత్వం నిత్యావసర సాగు కాదని చెబుతూ మద్దతు ధర ప్రకటించకపోవడం సరికాదని పవన్ పేర్కొన్నారు. పొగాకు వంటి వాణిజ్య పంటల తరహాలో  ప్రభుత్వం జీడి పంట కొనుగోలు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘బస్తాకు రూ.15వేలు గిట్టుబాటు ధర ప్రకటిస్తే సంబంధిత రైతులకు ఊరట లభిస్తుంది. ఈ యేడాది కరోనా పరిస్థితులు ఉన్నందున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలి. సేంద్రీయ ఎరువులను అందుబాటు ధరలకు సరఫరా చేయాలి. పంట నిల్వకు అవసరమైన గిడ్డంగులను ప్రభుత్వం నిర్మిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం, ఉద్యాన శాఖ తక్షణం స్పందించాలి.’’ అని పవన్ కల్యాణ్ సూచించారు. 

Updated Date - 2020-06-25T23:56:37+05:30 IST