దుకాణం ఎత్తేద్దాం!

ABN , First Publish Date - 2020-03-02T09:00:34+05:30 IST

‘‘ఎక్సైజ్‌ సరుకు తీసుకోదు. తీసుకున్న సరుకుకు బిల్లులు చెల్లించదు. భవిష్యత్తులో సరుకు తీసుకుంటుందన్న గ్యారెంటీ లేదు. వారు అడిగే కమీషన్లు మనం ఇచ్చుకోలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రాష్ట్రంలో...

దుకాణం ఎత్తేద్దాం!

  • సరుకు తీసుకోరు.. డబ్బులివ్వరు
  • ఎక్సైజ్‌ కమీషన్ల దాహం తీర్చలేం
  • మద్యం ఉత్పత్తిపై కంపెనీల ఆవేదన
  • ఇప్పటికే ఉత్పత్తి తగ్గించిన డిస్టిలరీలు
  • సరుకు తీసుకోకపోవడంపై ఆందోళన
  • పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడంపై దృష్టి


అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘‘ఎక్సైజ్‌ సరుకు తీసుకోదు. తీసుకున్న సరుకుకు బిల్లులు చెల్లించదు. భవిష్యత్తులో సరుకు తీసుకుంటుందన్న గ్యారెంటీ లేదు. వారు అడిగే కమీషన్లు మనం ఇచ్చుకోలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రాష్ట్రంలో మద్యం ఉత్పత్తిని కొనసాగించాలా? లేక ఇక్కడ దుకాణం బంద్‌ చేసి వేరే రాష్ర్టాలకు వెళ్లిపోవాలా?’’ అని మద్యం కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. కమీషన్‌ ఇస్తేనే ఆర్డర్లు ఇస్తామనే సంస్కృతికి ఒక్కసారి తలొగ్గితే ఎప్పటికీ ముడుపులు చెల్లిస్తూనే ఉండాల్సి వస్తుందని, దానికంటే మొత్తానికే మూసేసుకున్నా పోయేదేమీ లేదని కొన్ని మద్యం కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.


ఎలాగూ నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధానికి వెళ్తే అప్పుడైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని, ఈ నేపథ్యంలో ముందే జాగ్రత్త పడదామని కంపెనీలు ఆలోచన చేస్తున్నట్లు మద్యం ఉత్పత్తి వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి భారీస్థాయిలో బకాయిలు రావాల్సి ఉన్నందున వాటిని తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కేవలం ఉన్నామనే పేరు కోసం రాష్ట్రంలో అగ్రిమెంట్లు రెన్యువల్‌ చేసుకుని, వ్యాపారం విషయంలో మాత్రం ఇతర రాష్ర్టాల్లో దృష్టి పెట్టాలని ఎక్కువ కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే పలు డిస్టిలరీలు, బ్రూవరీలు దాదాపుగా మూసేసే పరిస్థితిలో ఉండడం గమనార్హం. 


నామమాత్రపు ఉత్పత్తే

కమీషన్ల మిషతో ఆయా డిస్టిలరీలు, బ్రూవరీల్లో ఉత్పత్తి అయ్యే బ్రాండ్లకు ఎక్సైజ్‌ నుంచి ఆర్డర్లు వెళ్లకపోవడంతో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకుని, నామమాత్రంగా ఉత్పత్తి చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై పెద్దగా ఆందోళన చెందడం లేదు. కొత్త బ్రాండ్లు తెరపైకి రావడం, ఎంతకావాలంటే అంత సరుకు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో షాపులు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ప్రభుత్వం ధీమాగా ఉంది. ఈనెలాఖరుతో ప్రస్తుతం డిస్టిలరీలతో చేసుకున్న ఒప్పందాలు ముగియనున్నాయి. వ్యాపారం కొనసాగించాలంటే కంపెనీలు తిరిగి ఎక్సైజ్‌తో ఒప్పందాలు చేసుకోవాలి. లేదా ఉన్న ఒప్పందాలను రెన్యువల్స్‌ చేసుకోవాలి. ఈ నెలాఖరులో కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే విషయంపై మద్యం వ్యాపారుల్లో ఆసక్తి నెలకొంది.


పాపులర్‌ బ్రాండ్లకే ఈ పరిస్థితి

రాష్ట్రంలో కేవలం పాపులర్‌ బ్రాండ్లకు మాత్రమే ఈ పరిస్థితి ఎదురవుతోంది. 10ు కమీషన్‌ చెల్లిస్తున్న అనామక బ్రాండ్లకు ఎక్సైజ్‌ నుంచి విరివిగా ఆర్డర్లు వెళ్తున్నాయి. ఆ బ్రాండ్లే మద్యం షాపుల్లో కనిపిస్తున్నాయి. పేరున్న బ్రాండ్లు మాత్రం 10ు కమీషన్‌కు ససరేమిరా అంటున్నాయి. ఫలితంగా వారికి ఎక్సైజ్‌ నుంచి ఆర్డర్లు నిలిచిపోయాయి. దీంతో డిస్టిలరీలో ఉత్పత్తి చేసినా వాటిని నిల్వ పెట్టుకోవడం తప్ప వేరే దారి లేక ఉత్పత్తినే తగ్గించుకున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు సరఫరా చేసినా మద్యానికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు.   


ఆ బ్రాండ్లు ప్రమాదకరమా?

ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దర్శనమిస్తున్న కొత్త బ్రాండ్లపై ‘ప్రమాదకరం’ అనే ప్రచారం మొదలైంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినా, అడిగినంత కమీషన్లు ఇచ్చి మరీ సరఫరా చేయడం అంటే, ఖర్చు చాలా తక్కువ కావడం వల్లే సాధ్యమవుతోందని ఉత్పత్తి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


అన్ని రకాల లిక్కర్‌లో 45ు ఆల్కాహాల్‌ ఉంటుంది. అయితే, దానిని తయారు చేసే విధానంపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం తయారీకి వినియోగించే ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కాహాల్‌(ఈఎన్‌ఏ) నాసిరకంగా తయారు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పాపులర్‌ బ్రాండ్లు అయితే బ్రాండ్‌ నేమ్‌ కోసం ఈఎన్‌ఏను పూర్తిస్థాయిలో ప్రాసెసింగ్‌ చేసి, అందులో వ్యర్థాలు తొలగించిన తర్వాతే మద్యాన్ని తయారుచేస్తారు. కానీ, బ్రాండ్‌ ఇమేజ్‌ లేని కంపెనీలు ప్రాసెసింగ్‌ విషయంలో ప్రమాణాలు పాటించవని అంటున్నారు. ఆ బ్రాండ్లు తాగిన వారికి ఒక్కసారిగా గుండెల్లో మంట రావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు గతంలో ఉండేవని అంటున్నారు. ప్రస్తుతం ఇవే ప్రచారంలో ఉన్నాయి. 


Updated Date - 2020-03-02T09:00:34+05:30 IST