స్పెషల్‌ దోపిడీ!

ABN , First Publish Date - 2020-09-12T17:17:30+05:30 IST

కొత్త ప్రత్యేక అధికారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో ఏమి కొనుగోలు చేయాలన్నా సిబ్బంది

స్పెషల్‌ దోపిడీ!

పోరంకి పంచాయతీలోనే రూ.కోటి స్వాహా

పనికిరాని రిక్షాలకు మరమ్మతు పేరుతో రూ.4.43 లక్షలు స్వాహా

ఏసీ కోసం కక్కుర్తిపడి రూ.7లక్షల పంచాయతీ నిధులు వృథా


ఈ చిత్రంలో కనిపిస్తున్న రిక్షాలను చూశారా..! ఒక్కటీ ముందుకు కదలదు. పోరంకి పంచాయతీ పరిధిలో చెత్త సేకరణకు ఉపయోగించే ఇలాంటి రిక్షాలకు మరమ్మతుల పేరుతో రూ.4,43,090 డ్రా చేసేశారు. ఇలాంటి సిత్రాలు ఈ పంచాయతీలో చాలానే ఉన్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లావ్యాప్తంగా 980 గ్రామ పంచాయతీలున్నాయి. 2018 ఆగస్టులో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. నాటి నుంచి పంచాయతీల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లింది. ఇక అక్కడి నుంచి ‘ప్రత్యేక’ దోపిడీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీ జోరందుకుంది. ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని ప్రత్యేక అధికారులుగా బదిలీ చేయించుకున్నారు. అందులో భాగంగా పోరంకి, తాడిగడప పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా స్థానిక ప్రజాప్రతినిధికి అనుకూలమైన వ్యక్తి వచ్చారు. ఈయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సొమ్ముల స్వాహాపైనే దృష్టి సారించారు. తన బంధువు ఒకిరిని బినామీగా పెట్టుకుని దోపిడీ పర్వానికి తెరలేపారు. 
మొవ్వ అంటేనే ముద్దు..!

కొత్త ప్రత్యేక అధికారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో ఏమి కొనుగోలు చేయాలన్నా సిబ్బంది మొవ్వకే పరిగెత్తడం మొదలుపెట్టారు. బ్లీచింగ్‌ పౌడర్‌ మొదలు వీధి దీపాల మరమ్మతుల వరకు అన్నీ మొవ్వకు చెందిన ఓ బినామీ సంస్థకు అప్పగించడం మొదలుపెట్టారు. పోరంకి చెంతనే ఉన్న విజయవాడలో కాకుండా మొవ్వలాంటి చిన్న ఊరు నుంచి కొనుగోళ్లు చేయడం వెనుక ఏముందని ఆరా తీసిన వారికి ప్రత్యేకాధికారి సమీప బంధువే అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న విషయం వెల్లడైంది. 2019 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు పంచాయతీ నిర్వహణ పేరుతో రూ.25 లక్షలు డ్రా చేశారు. కొద్దిరోజులకే పంచాయతీ నిర్వహణ ఖర్చుల పేరుతో మరోసారి రూ.4.10, రూ.2.37 లక్షలు డ్రా చేశారు.


ఈ కొనుగోళ్లన్నీ మొవ్వలోని వ్యాపార సంస్థ నుంచే చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో లెడ్‌ లైట్ల వ్యవస్థను తీసుకొచ్చారు. లెడ్‌ లైట్ల వ్యవస్థ అమల్లో ఉన్న పంచాయతీల్లో వీధిదీపాల నిర్వహణ అంతా జిల్లాస్థాయిలో కేంద్రీకృతంగా ఉంటుంది. ఎక్కడైనా లైట్లు పాడైనా కలెక్టర్‌ అనుమతితో వాటిని మరమ్మతు చేయించాలి. కానీ పోరంకి పంచాయతీలో అత్యవసరంగా వీధి దీపాలను మరమ్మతులు చేసినట్లు చూపి రూ.5.67 లక్షలు లాగేశారు. ఈ మరమ్మతుల బాధ్యతనూ మొవ్వలోని వ్యాపార సంస్థకే అప్పగించారు. 


పంచాయతీలో పారిశుధ్య నిర్వహణకు బ్లీచింగ్‌ కొనుగోలు పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే రూ.4.55 లక్షలు డ్రా చేశారు. అదే నెలలో మంచినీటి నిర్వహణ పేరుతో రూ.6.22లక్షలు డ్రా చేశారు. ఈ పనులన్నీ ఆ వ్యాపార సంస్థకే కట్టబెట్టారు. పంచాయతీ పరిధిలో చెత్త సేకరణకు దాత అనుమోలు ప్రభాకరరావు 20 రిక్షాలను ఇచ్చారు. వీటిలో సుమారు 15 రిక్షాలు మూలనపడగా, ఐదు రిక్షాలు మాత్రం నడుస్తున్నాయి. వీటికి మరమ్మతులు చేయించామంటూ రూ.4.43లక్షలను లాగేశారు. మొత్తం మీద ఆరు నెలల కాలంలో సుమారు రూ.కోటి రూపాయల నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 


జిల్లా అంతటా ఇదే తీరు!

జిల్లావ్యాప్తంగా ఆదాయం బాగా ఉన్న మేజర్‌ పంచాయతీల్లో ‘ప్రత్యేక’ దోపిడీ కొనసాగుతోంది. విజయవాడ చుట్టుపక్కల ఉన్న కానూరు, తాడిగడప, పోరంకి, పెదపులిపాక, యనమలకుదురు, రామవరప్పాడు, నిడమానూరు, గన్నవరం, కేసరపల్లి, గుంటుపల్లి తదితర పంచాయతీల్లో ఆదాయం పుష్కలంగా ఉంటుంది. దానికి తగ్గట్టే స్వాహా పర్వం కొనసాగుతోంది. జిల్లా స్థాయి అధికారే తాను పోస్టింగ్‌ కోసం లక్షలు ఖర్చు పెట్టానంటూ భారీగా దండకాలకు దిగడంతో ప్రత్యేక అధికారులు, ఈవోలు సైతం ఆయన బాటలోనే పయనిస్తున్నారు. 

ఈ ఏసీ ఖరీదు రూ.7 లక్షలు..!

అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగా ప్రత్యేక అధికారి తన స్థాయిలో స్వాహా పర్వం సాగిస్తుంటే, ఈవో ఓ ఏసీ కోసం కక్కుర్తిపడి సుమారు రూ.7 లక్షల పంచాయతీ నిధులను వృథా చేశారు. సాధారణంగా పంచాయతీల్లో ఎక్కడైనా రోడ్లు వేయాలంటే 10 శాతం పంచాయతీ నిధులు కేటాయిస్తే 90 శాతం ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేస్తారు. పంచాయతీలపై ఆర్థికభారాన్ని తగ్గించేందుకు.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ పోరంకి పంచాయతీ పరిధిలో పోరంకి - నిడమానూరు వెళ్లే దారిలో ఒకే ఒక్క అపార్ట్‌మెంటుకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.7 లక్షలు ఖర్చు చేసి సిమెంటు రోడ్డు వేయించారు. వాస్తవానికి రూ.70వేలు పంచాయతీ ఖర్చు చేస్తే మిగిలిన మొత్తాన్ని ఉపాధి హామీ నిధుల నుంచి తీసుకునే వెసులుబాటు ఉన్నా స్వీయ లబ్ధి కోసం పంచాయతీ నిధులు రూ.7లక్షలను ఖర్చు చేశారు. 


Updated Date - 2020-09-12T17:17:30+05:30 IST