అంతా ఓకే! ముగిసిన దుర్గా ఫ్లై ఓవర్‌ సామర్ధ్య పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-16T15:26:46+05:30 IST

దేశంలోనే వినూత్న టెక్నాలజీతో నిర్మించిన దుర్గా ప్లై ఓవర్‌ సామర్ధ్య పరీక్షల్లో..

అంతా ఓకే! ముగిసిన దుర్గా ఫ్లై ఓవర్‌ సామర్ధ్య పరీక్షలు

260 టన్నుల లోడ్‌తో ఐదు చోట్ల పరీక్ష 

చివరగా ఉషా బిల్డ్‌ కాన్‌ చేపట్టిన పనుల పరిశీలన

ఘాట్ల వెంబడి భారీ గడ్డర్లతో రెయిలింగ్‌ 

రంగులు హంగులతో ప్రారంభానికి సిద్ధం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): దేశంలోనే వినూత్న టెక్నాలజీతో నిర్మించిన దుర్గా ప్లై ఓవర్‌ సామర్ధ్య పరీక్షల్లో నెగ్గింది. మరో రెండు రోజుల్లో ఫ్లై ఓవర్‌ ప్రారంభం కానుండగా, ఆరు వరసల ఫ్లై ఓవర్‌పై మొత్తం ఐదు చోట్ల కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ సామర్ధ్య పరీక్షలను మంగళవారం పూర్తి చేసింది. 


ఒంటి స్తంభంపై నిర్మితమైన ఆరువరసల కనకదుర్గా ప్లై ఓవర్‌ సామర్ధ్య పరీక్షలు పూర్తి చేసుకుని, ప్రారంభానికి సిద్ధమయింది. కొద్ది రోజులుగా ఫ్లై ఓవర్‌ను మూసివేసి, 260 మెట్రిక్‌ టన్నుల లోడ్‌ను వింగ్స్‌ మీద మోపి, ఒక్కో చోట 102 గంటల చొప్పున మొత్తం 510 గంటల పాటు ఉంచి రెక్కల పటుత్వాన్ని, స్పాన్‌ దృఢత్వాన్ని పరీక్షించారు. కుమ్మరిపాలెం దిగువన రెండు చోట్ల, హెడ్‌వాటర్‌ వర్క్స్‌ వద్ద, దుర్గగుడి మలుపు, కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలోని ల్యాండింగ్‌ పాయింట్ల వద్ద సామర్ధ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 260 మెట్రిక్‌ టన్నుల లోడ్‌ను తొమ్మిది పెద్ద టిప్పర్‌లతో ఫ్లై ఓవర్‌ మీద ఉంచారు. ఒక్కో టిప్పర్‌లో 29 మెట్రిక్‌ టన్నుల లోడ్‌ ఉంచారు. బరువు తీసిన తర్వాత కూడా ఫ్లై ఓవర్‌ రెక్కలు, స్పాన్‌ నూరు శాతం సమస్థితిలో ఉన్నట్టు గుర్తించారు. 


ఫ్లైఓవర్‌ చివరి సామర్ధ్య పరీక్షలు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన పోర్షన్‌లో జరిగాయి. ఫ్లైఓవర్‌ నిర్మాణ సమయంలో కృష్ణానది ఘాట్లు మూసుకుపోకుండా ఉండేందుకు వీలుగా పిల్లర్ల మీద వయాడక్ట్‌ను నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే డిజైన్‌ మార్చితే ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అప్పుడు కేంద్రం నిబంధన పెట్టింది. అందుకనుగుణంగానే కృష్ణా తూర్పు కెనాల్‌ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు 160 మీటర్ల మేర ఉషా బిల్డ్‌ కాన్‌ అనే సంస్థ పనులను చేపట్టింది. ఈ పనులు కూడా నూరు శాతం ఖచ్చితత్వంతో ఉన్నట్టు గుర్తించారు.


బంప్‌ ఇంటిగ్రేటెడ్‌తో ఎత్తు పల్లాల పనుల పరిశీలన  

ఫ్లై ఓవర్‌ సామర్ధ్య పరీక్షల తర్వాత, ఎత్తుపల్లాల్లో తేడాలను కనిపెట్టేందుకు కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ బంప్‌ ఇంటిగ్రేటెడ్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ఒక యంత్రానికి బరువైన రోలర్‌ను ఉంచుతారు. ఇది వైబ్రేషన్‌ ఇస్తుంటుంది. దీనిని ఫ్లై ఓవర్‌కు రెండు వైపులా మొత్తం ఆరు లైన్ల మీదా కొద్ది రోజులుగా నడుపుతున్నారు. ఈ యంత్రం ఎక్కడైనా ఎత్తు పల్లాలు ఉంటే అప్రమత్తం చేస్తుంది. ఫ్లై ఓవర్‌ పై ఇది ఎలాంటి లోపాలను చూపించక పోవటం విశేషం. 


సామర్ధ్య పరీక్షలు సంతోషాన్నిచ్చాయి

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ సామర్ధ్య పరీక్షలు విజయవంతం కావటం ఆనందంగా ఉంది. ‘సోమా’ సంస్థ తలపెట్టిన ఫ్లై ఓవర్‌కు కెనాల్‌ నుంచి మేము గడ్డర్లు, పిల్లర్ల విధానంలో వయాడక్ట్‌ను పూర్తి చేశాం. చివరి సామర్ధ్య పరీక్షలు మా పోర్షన్‌లో జరిగాయి. 102 గంటలపాటు 270 మెట్రిక్‌ టన్నుల బరువును ఉంచాం. గేజ్‌లో ఎక్కడా తేడా రాలేదు. దేశంలోనే నెంబర్‌ 1 ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో సోమా సంస్థతో కలిసి పాలు పంచుకోవటం ఆనందంగా ఉంది. 

- సూరపనేని శ్రీకాంత్‌, కాంట్రాక్టర్‌, ఉషా బిల్డ్‌ కాన్‌

Updated Date - 2020-09-16T15:26:46+05:30 IST