దాణాపై కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-06-23T11:25:45+05:30 IST

కరోనా దెబ్బ పశువుల దాణా తయారీపై పడింది. ఏప్రిల్‌ మొదటివారం నుంచి దాణా ధరలు అమాంతంగా పడిపోవడంతో పొట్టుమిషన్‌

దాణాపై కరోనా దెబ్బ

జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే జొన్నచొప్ప కొనుగోళ్లు

ఏప్రిల్‌లో అమాంతంగా పడిపోయిన దాణా ధరలు

నష్టాలు చవిచూస్తున్న వ్యాపారులు 


జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 22: కరోనా దెబ్బ పశువుల దాణా తయారీపై పడింది. ఏప్రిల్‌ మొదటివారం నుంచి దాణా ధరలు అమాంతంగా పడిపోవడంతో పొట్టుమిషన్‌ యజమానులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. జూన్‌లోనైనా గట్టెక్కుతామనుకుంటే ఈ ఏడాది డిసెంబరు వరకు ధరలు పెరిగే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్న చొప్పను పొలాల్లోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి హైదరాబాదుకు ప్రతిరోజూ 30 నుంచి 40 లారీల పశువుల దాణా (జొన్నచొప్ప పొట్టు) వెళుతుంది. జొన్నపంట ఎక్కువగా పండించే జమ్మలమడుగు, కోవెలకుంట్ల, తాడిపత్రి, పులివెందుల, నంద్యాల, తదితర ప్రాంతాల నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తారు.


వ్యాపారులు పొట్టుమిషన్‌ ద్వారా దాణాను తయారు చేసి పలు ప్రాంతాల్లో విక్రయిస్తారు. ప్రస్తుతం నాలుగు నెలల నుంచి కరోనా దెబ్బకు హైదరాబాదులోని హోటళ్లు, తదితర షాపులు మూతపడటంతో పాల సరఫరా తగ్గిపోయింది. దీంతో పశువుల దాణాకు డిమాండ్‌ లేకపోవడంతో ధర అమాంతంగా పడిపోయిందని వ్యాపారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కిలో దాణా రూ.8 నుంచి రూ.10 వరకు పలికేది. లాక్‌డౌన్‌ సమయంలో ఈ రేటు 5 రూపాయలకు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒక్కలోడుపై రూ.4 వేల నుంచి రూ.5 వేలు నష్టం వాటిల్లుతోందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. అలాగే లారీ లోడు చేయాలంటే చొప్ప కొనుగోలు, కూలీలు, డీజిల్‌, నీళ్ల ట్యాంకర్‌, హమాలీ ఖర్చులు కలిపి మొత్తం రూ.16 వేలు ఖర్చు వస్తోంది.


లారీ బాడుగ పై ప్రాంతాలకు వెళ్లాలంటే రూ.19 వేల నుంచి రూ.22 వేల వరకు వస్తోందని వ్యాపారులు తెలిపారు. ఒక లారీ ఆరు టన్నుల దాణా తీసుకుని వెళుతుంది. దాణా కిలో రూ.5 వంతున అమ్ముడుపోయినా దళారీ కమీషన్‌ పోను వ్యాపారి చేతికి రూ.30 వేల నుంచి రూ.32 వేలు వస్తుంది. ఒక్క లోడు మీద రూ.4 వేల నుంచి రూ.5 వేలు నష్టం రావడంతో వ్యాపారులు చొప్పను పొలాల్లోనే వదిలేసి వెళుతున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి :  పుష్పరాజు, పొట్టు వ్యాపారి, జమ్మలమడుగు

ప్రభుత్వం దాణా వ్యాపారులను ఆదుకోవాలి. నేను 35 సంవత్సరాల నుంచి దాణా వ్యాపారం చేస్తున్నాను. ఇంత భారీ నష్టాలను ఎప్పుడూ చూడలేదు. ఈ ఏడాది రూ.3 లక్షలు నష్టం వచ్చింది. ప్రస్తుతం రైతులు, వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

Read more