మా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు

ABN , First Publish Date - 2020-06-25T07:47:02+05:30 IST

రాష్ట్రంలో రోజురోజుకూ పౌరుల రాజ్యాంగహక్కుల ఉల్లంఘన పెరిగిపోతోందని, టీడీపీ నేతల ఫోన్లు వైసీపీ ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని..

మా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు

విపక్ష నేతల హక్కులకు భంగం.. ప్రభుత్వంపై టీడీపీ ధ్వజం

అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజురోజుకూ పౌరుల రాజ్యాంగహక్కుల ఉల్లంఘన పెరిగిపోతోందని, టీడీపీ నేతల ఫోన్లు వైసీపీ ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని, ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ ఆరోపించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టినా, తీరులో మార్పు కన్పించడం లేదని పేర్కొన్నారు. ‘‘పదవిలో ఉన్నారోలేదో తెలియని ఓ వ్యక్తిని ఇద్దరు బీజేపీ నేతలు కలిస్తే, మధ్యలో విపక్ష నేత చంద్రబాబును విమర్శించడం వైసీపీకే చెల్లింది.


ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలను లొంగదీసుకునేందుకు అక్రమకేసులు, అరెస్టులు, గృహనిర్బంధాలతో ఈ ప్రభుత్వం నిరంకుశధోరణి అవలంబిస్తోంది’’ అని విమర్శించారు. ‘‘సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం, వాటిని షేర్‌ చేయడం, వాటిపై చర్చ జరగడం సహజం. సోషల్‌ మీడియా పోస్టుల కారణంగా ఒకరి భావప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు ఎవ్వరికీ లేదని సుప్రీం కోర్టు ఎన్నోసార్లు తీర్పులిచ్చింది. అలాగే అభ్యంతరకర పోస్టింగులు పెడితే శిక్షించే ఐటీ చట్టం 2005- 66(ఏ) దుర్వినియోగం అవుతోందని కూడా పేర్కొంది. కానీ మన రాష్ట్రంలో ఈ చట్టాలను, తీర్పులను కనీసం పట్టించుకోవడంలేదు.

Updated Date - 2020-06-25T07:47:02+05:30 IST