సుర్రుమన్న సూరీడు

ABN , First Publish Date - 2020-05-24T07:51:26+05:30 IST

రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. మూడు రోజులుగా వేడి వాతావరణం కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

సుర్రుమన్న సూరీడు

కురిచేడులో 47.33డిగ్రీలు నమోదు  

రాష్ట్రమంతా సెగలు, పొగలు 

రాత్రిపూట కూడా వేడిగాలులు 

ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి 

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు 

27 వరకు వడగాడ్పులు


విశాఖపట్నం/అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. మూడు రోజులుగా వేడి వాతావరణం కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయట వడగాలి, ఇళ్లలో ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల వరకూ అధికంగా నమోదవుతున్నాయి. వాయవ్య దిశ నుంచి వీచిన వడగాడ్పులతో శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఉడికిపోయాయి. ఉదయం నుంచే గాడ్పుల ప్రభావం కొనసాగింది. మధ్యాహ్నానికి తీవ్రత పెరిగింది. కొన్నిచోట్ల రాత్రి కూడా వేడిగాలులు కొనసాగాయి. ఆకాశం నిర్మలంగా ఉండటంతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటుచేసిన కేంద్రాల ప్రకారం కురిచేడులో 47.33డిగ్రీలు, నూజివీడులో 46.55, బనగానపల్లెలో 46.18, సింగరాయకొండలో 45.87, మాచర్లలో 45.70, నందిగామలో 45.55, కుక్కునూరులో 45.50, వేంపల్లెలో 45.15 డిగ్రీలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు శనివారం జంఘమహేశ్వరపురంలో 45, కర్నూలులో 44.5, తిరుపతిలో 42.6, అనంతపురంలో 42.9డిగ్రీలు నమోదయ్యాయి. కాగా, ఈ నెల 27వరకు కోస్తా, రాయలసీమల్లో వడగాడ్పులు కొనసాగుతాయని నిపుణులు విశ్లేషించారు. ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వడగాడ్పులు పెరుగుతాయని, ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎండ, వడగాలులకు అల్లాడిపోతున్న ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. సరఫరాలోనూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కాగా, ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ వరకు 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున 24న ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ ఎండ, వడగాలి ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2020-05-24T07:51:26+05:30 IST