కూలీలు వద్దు.. మిషన్లు ముద్దు

ABN , First Publish Date - 2020-03-02T08:52:27+05:30 IST

ఉగాది నాటికి పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలను చదును చేసే పనులను ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన ప్రభుత్వం... ఆ చట్టానికి యథేచ్ఛగా తూట్లు...

కూలీలు వద్దు..  మిషన్లు ముద్దు

  • ఉపాధి హామీ చట్టానికి యథేచ్ఛగా తూట్లు 
  • ఎక్సకవేటర్లతో ఇంటిస్థలాల చదును
  • కూలీలు చేయదగ్గ పనులూ యంత్రాలతోనే
  • దండుకోవడంలో వైసీపీ కార్యకర్తలు బిజీ
  • కేంద్రం తనిఖీ చేస్తే  నిధులు బంద్‌


అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉగాది నాటికి పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలను చదును చేసే పనులను ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన ప్రభుత్వం... ఆ చట్టానికి యథేచ్ఛగా తూట్లు పొడుస్తోంది. పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసే క్రమంలో 22,647 ఎకరాలను చదును చేసేందుకు 13,569 ఎస్టిమేట్లతో రూ.1496 కోట్ల ఉపాధి నిధులు ఖర్చు చేసేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించారు. కూలీలతో పనులు చేయించే అవకాశమున్నా యంత్రాలను ఉపయోగిస్తోంది. ఏకంగా 90 శాతం మెటీరియల్‌ పనులు చేయిస్తోంది. ఉపాధి చట్టం నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో చేపడుతున్న ఈ పనులపై కేంద్ర అధికారులు తనిఖీ చేస్తే రాష్ట్రానికి రావాల్సిన మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు ఆగిపోతాయని అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఈ నిధులను రాష్ట్రం భరించాల్సి ఉంటుందని అంటున్నారు. 

మెటీరియల్‌ నిధుల కోసం హడావుడి

రాష్ట్రంలో 7 నెలలపాటు ఉపాధి పథకంలో మెటీరియల్‌ పనులు నిలిపేసిన ప్రభుత్వం మార్చితో గడువు మీరిపోనున్న నిధులను వినియోగించుకునేందుకు ఆరాటపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి మార్చి నెలాఖరుకు సుమారు రూ.4 వేల కోట్ల విలువైన పనులు కూలీలతో చేయించే అవకాశముంది. అయితే అందుకు అనుగుణంగా రూ.2600 కోట్లు మేర మెటీరియల్‌ నిధుల కింద శాశ్వత నిర్మాణాలు చేసుకు నే వెసులుబాటు రాష్ట్రానికి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి రూ.1300 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఇంకా రూ.1300 కోట్ల మేర మెటీరియల్‌ పనులు చేసుకునే అవకాశముంది. ఇప్పటికే ఇళ్ల స్థలాల చదును పనులు కూడా ప్రారంభించింది. ఈ ఏడాదికి సంబంధించి ఖ ర్చు చేయాల్సిన నిధులు మార్చి లోపు వినియోగించా లి. లేకపోతే మురిగిపోతాయి. డ్రైన్లు, సచివాలయ భవనాలు తదితర నిర్మాణ పనులు మంజూరుచేసినప్పటికీ... ఆ పనులు చేసేందుకు గ్రామాల్లో ఆసక్తి చూపకపోవడంతో ఉపాధి నిధులను ఖర్చు చేసేందుకు ఇంటి స్థలాల చదును పనులపై దృష్టి సారించారు.  లాభాలు బాగా వస్తాయన్న ఉద్దేశంతోనే వైసీపీ కార్యకర్తలు ఈ పనులు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. 

యంత్రాలకు ప్రభుత్వమే ప్రోత్సాహం!

ఉపాధి చట్టంలో యంత్రాలు ఉపయోగించి పనులు చేపట్టరాదని ని బంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఎక్సకవేటర్లకు ఈ పథకంలో అనుమతి లే దు. ట్రాక్టర్లుతో మట్టి తరలించేందుకు అనుమతించా రు. దానికి కూడా కొన్ని నిర్ధిష్టమైన నిబంధనలు పెడు తూ ఉపాధి చట్టంలోని షెడ్యూల్‌-1లోని పేరా 22లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో కూడా ట్రాక్టర్లకు మట్టిని కూలీల ద్వారానే లోడింగ్‌ చేయడంతో పాటు చదును చేసేందుకు కూడా కూలీల సేవలు వినియోగించాలి. రాష్ట్రంలో ఎక్కడా ఈ పను ల్లో కూలీలను వినియోగించడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. పైగా ప్రభుత్వమే షెడ్యూల్‌ పెట్టి 10 రో జుల్లోపు ఈ పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించింది. యంత్రాలతో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వమే ప్రోత్సహించడంతో యథేచ్ఛగా మెషిన్లతో పనులు కానిచ్చేస్తున్నారు. ఈ పరిణామాలకు రాష్ర్టానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని అంటున్నారు. 


జేబులు నింపుకొంటున్న కార్యకర్తలు

ఇళ్లస్థలాల చదును పనుల్లో గ్రావెల్‌ మాత్రమే వాడాలని ఎస్టిమేట్లు రూపొందించారు. ఇతర రకాల మట్టి కంటే గ్రావెల్‌కు ఇచ్చే ధర కూడా ఎక్కువ. దీంతో వైసీపీ కార్యకర్తలు అందుబాటులో ఉన్న మట్టిని తరలించి గ్రావెల్‌ తరలించినట్లు రికార్డు చేసుకుంటూ భారీగా దోపిడీకి తెరదీశారు. ఇళ్లస్థలాల కోసం గుర్తించిన భూములు ఎక్కువగా చెరువుల్లో, కొండ మీద, జనావాసాలకు సంబంధం లేని చోట ఉన్నాయి. కొన్నిచోట్ల స్థలాలకు అదనంగా మట్టితో నింపాల్సిన అవసరం లేదు. ఉన్న మట్టిని  చదును చేస్తే సరిపోతుంది. అయినా కాం ట్రాక్టు పనుల కోసం అక్కడ కూడా అందుబాటులో ఉన్న చెరువులో మట్టిని తోలి చదును చేస్తున్నారు. రూ.5 లక్షల విలువ కంటే ఎక్కువగా ఉన్న పనులన్నింటికీ డ్రోన్ల ద్వారా ప్రీమెజర్‌మెంట్‌ తీస్తున్నారు. అంతకంటే తక్కువ ఉన్న వాటిని స్థానికంగా సిబ్బంది ముందస్తు కొలతలు తీస్తున్నారు. డ్రోన్ల ద్వారా చేపడుతున్న చాలా ఎస్టిమేట్లుకు సంబంధించి అంచనాలు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ఎస్టిమేట్లు విలువ తగ్గిపోతున్నాయని... అంచనాలన్నీ రూ.5 లక్షల లోపు మార్చేందుకు పావులు కదుపుతున్నారు.  


Updated Date - 2020-03-02T08:52:27+05:30 IST