దిగుబడులు కిందకి.. ధరలు పైకి

ABN , First Publish Date - 2020-11-21T06:51:04+05:30 IST

వరుస ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైనా అరటి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో అరటి ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.

దిగుబడులు కిందకి.. ధరలు పైకి
రావులపాలెం మార్కెట్‌ యార్డుకు అరటి గెలలు తీసుకొచ్చిన రైతులు

  • గోదావరి జిల్లాల్లో గణనీయంగా తగ్గిన అరటి ఉత్పత్తులు
  • కరోనాతో అప్పుడు, వరుస ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పుడు కుదేలైన రైతులు
  • కార్తిక మాసంలో పుంజుకున్న ధరలు
  • కర్పూర రకానికి గిరాకీ


వరుస ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైనా అరటి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో అరటి ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. శ్రావణ మాసంలో అంతంతమాత్రంగా ఉన్న అరటి మార్కెట్‌ కార్తిక మాసం వచ్చేసరికి పుంజుకుంది. అయితే వినియోగానికి తగ్గ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాషా్ట్రల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్తిక మాసంలో పూజలతో పాటు వచ్చే ఏడాది జనవరి మొదటివారం వరకు వివాహ ముహూర్తాలు ఉండడంతో కర్పూర, చక్రకేళి రకాలకు డిమాండు పెరుగుతోంది.


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌-19 కారణంగా గత ఎనిమిది నెలలుగా వివిధ రాష్ట్రాలకు అరటి ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో పాటు లాక్‌డౌన్లు, సెమీ లాక్‌డౌన్ల కారణంగా విక్రయాలు సైతం గణనీయంగా తగ్గిపోయాయి. అప్పట్లో రావులపాలెం నుంచి 50శాతం మేర ఉత్పత్తులు మాత్రమే ఎగుమతులు స్థానిక మార్కెట్లకు తరలిపోవడంతో రైతులు కుదేలలయ్యారు. సాధారణంగా శ్రావణమాసం వచ్చిందంటే కర్పూర అరటికి అనూహ్యమైన డిమాండ్‌ ఉండేది. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లో కర్పూర ధర పడిపో యింది. ఇతర రాషా్ట్రలకు ఎగుమతులు కూడా నిలిచిపోవడంతో అరటి రైతులు స్థానిక మార్కెట్లపైనే ఆధారపడి అయినకాడికి విక్రయించుకోవాల్సి వచ్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన వరదలు, భారీ వర్షాలు వంటి వరుస ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రంలోనే అత్యధికంగా అరటి ఉత్పత్తి అయ్యే ప్రాంతాలున్న గోదావరి జిల్లాల్లో పంట అంతా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. దాంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. పంట తిరిగి సాగు చేసినప్పటికీ ప్రస్తుత సీజన్లకు అందుకునే పరిస్థితి లేదు. అయితే గతేడాది కార్తిక మాసంతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడులు తక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగాయి.

గోదావరి జిల్లాల్లోనే కీలకమైన రావులపాలెం కేంద్రంగా గత ఏడాది రూ.200 నుంచి రూ.250 ఉన్న గెల ప్రస్తుతం రూ.250 నుంచి రూ.300 దాటి విక్రయిస్తున్నారు. చక్రకేళీ గతంలో రూ.300 ఉంటే ఇప్పుడు రూ.400 నుంచి రూ.450 మధ్య పలుకుతోంది. ఎరుపు చక్రకేళీ రూ.350 నుంచి రూ.400కు చేరింది. బుషావళి గతంలో రూ.200 ఉండగా ఇప్పుడు రూ.300 అయ్యింది. కూర అరటి గత ఏడాది రూ.200 ఉంటే ధర రూ.250కు అమ్ముడవుతోంది. ప్రస్తుతం కర్పూర ఉత్పత్తులు లేకపోవడంతో స్థానిక అవసరాలు, డిమాండును బట్టి ధరలు భారీగానే ఉన్నాయి. ధరలు పెరిగినప్పటికీ ఉత్పత్తులు లేకపోవడంతో రైతులకు ప్రయోజనం లేదని కొత్తపేట మండలం వానపల్లికి చెందిన రైతు బండారు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. దిగుబడులు తగ్గి వినియోగం పెరగడం వల్లే ధరల పెరుగుదలలో మార్పు కనిపిస్తుందని చెప్తున్నాడు. ప్రస్తుతం డిమాండుకు తగ్గ సప్లయి లేకపోవడం వల్ల రైతులు తమ వద్ద ఉన్న ఉత్పత్తులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర రాషా్ట్రలకు సైతం ఎగుమతులు మందకొడిగా జరుగుతున్నాయి.


Read more