లాక్‌డౌన్‌ తర్వాత ఎవరొచ్చినా.. క్వారంటైనే..!

ABN , First Publish Date - 2020-04-26T11:41:40+05:30 IST

వచ్చే నెల 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేస్తే..

లాక్‌డౌన్‌ తర్వాత ఎవరొచ్చినా.. క్వారంటైనే..!

దొడ్డిదారిన వచ్చేసి ఇంట్లో దాక్కుంటే చర్యలే 

బయట రాష్ర్టాల్లో జిల్లా వాసులు లక్షల్లో

యంత్రాంగం వద్ద లేని పక్కా లెక్కలు


(ఆంధ్రజ్యోతి -కాకినాడ): వచ్చే నెల 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేస్తే పొరుగు రాష్ర్టాలు, జిల్లాల్లో ఇప్పటివరకు తలదాచుకున్న వారు జిల్లాకు వచ్చినా వారిని క్వారంటైన్‌ చేయనున్నారు. ఒకవేళ పొడిగించి తర్వాత సడలించినా బయటి వ్యక్తులకు క్వారంటైన్‌ తప్పనిసరి. ఈలోగా దొడ్డిదారిన వచ్చేసి ఇంట్లో దాక్కుంటే అధికారులు చర్యలు తీసుకుంటారు. వాస్తవానికి జనతా కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌కు ముందే జిల్లావాసులు వివిధ పనులపై బయట రాష్ర్టాలు, జిల్లాలకు తరలివెళ్లారు. ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని సమాచారం. అయితే గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటా చేసిన సర్వేలో గాని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అమలు చేసిన సర్వెలైన్స్‌లోగాని ఎంత మంది బయట ఉన్నారో యంత్రాంగం వద్ద పక్కా లెక్కలు లేవు. దీంతో వాస్తవ సంఖ్యపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. జిల్లాలో కోవిడ్‌ 19 వైరస్‌ నియంత్రణ చర్యల్లో యంత్రాంగం అహర్నిసలు కష్టపడి పనిచేస్తోంది.


కానీ నిషేధిత సమయ వేళలు పాటించడంలో కొందరు యంత్రాంగానికి సహకరించడం లేదు. ఏపీలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. మే 3 తర్వాత ఇతర రాష్ర్టాల్లో, జిల్లాల్లో చిక్కుకుపోయిన వారికి వెసులుబాటు ఇస్తే, వారు జిల్లాలోకి ప్రవేశిస్తే అటువంటి వారిని గుర్తించి వారి చేతులపై సిరా చుక్క క్వారంటైన్‌ ముద్ర పడనుంది. జిల్లావాసులు ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో 3 లక్షలకు పైగానే ఉన్నారని సమాచారం. వీరిలో జిల్లాలో వైఎస్సార్‌ పింఛన్‌ కానుక తీసుకుంటున్న వారు 35 వేల మంది, వలస కూలీలు 65 వేల మంది, పెళ్లిళ్ల సీజన్‌ నిమిత్తం కుటుంబాలతో ఆయా ప్రాంతాలకు వెళ్లినవారు 75 వేల మంది,  ఇతర పనుల నిమిత్తం 1.25 లక్షల మంది బయటే ఉన్నారని తెలుస్తోంది.


అయితే లాక్‌డౌన్‌ వల్ల అక్కడ ఎటువంటి కార్య కలాపాలు జరగకపోవడంతో వారంతా ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. స్వగ్రామాలకు రవాణా సదుపాయం కూడా లేకపోవడంతో రాలేకపోయారు. కానీ ఆయా ప్రాంతాల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారడంతో ఎలాగైనా వీరు జిల్లాకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అంతర్‌ జిల్లా, రాష్ర్టాల వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడంతో వీరి ప్రయత్నాలు ఫలించడం లేదు. 


దొడ్డిదారిన..

ప్రజలకు నిత్యావసర సరుకుల రవాణా చేసే విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వ అనుమతితో కాస్త సడలించాయి. దీంతో లారీలు, ట్రక్కులు, సముద్ర మార్గం మీదుగా కొన్ని నౌకలు జిల్లా తీర ప్రాంతాలకు వస్తున్నాయి. వీటిలో కొందరు జిల్లా వాసులు దొడ్డిదారిని స్వగ్రామాలకు చేరుకుంటున్నారని జిల్లా నిఘా విభాగం దృష్టి సారిస్తోంది. బయట ప్రాంతాలను ఎవరు జిల్లాకు వచ్చినా వారి కదలికలపై ఆరా తీస్తుంది. దీంతో అటువంటి వారి ప్రయాణాలకు అడ్డుకట్ట పడింది.


కానీ ఇంకా ఎవరైనా దొంగచాటుగా వస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారి చేతులపై క్వారంటైన్‌ ముద్ర వేసే చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ విషయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం నిర్వహిస్తున్న చర్యలకు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే యంత్రాంగం తగిన ఏర్పాట్లకు దిగింది.
 

Updated Date - 2020-04-26T11:41:40+05:30 IST