ఇంటికే అంగన్‌వాడీ సరుకులు

ABN , First Publish Date - 2020-03-24T09:26:47+05:30 IST

ప్రభుత్వం దిగొచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంగన్‌వాడీలకు కీలక వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది...

ఇంటికే అంగన్‌వాడీ సరుకులు

కరోనా దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం దిగొచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంగన్‌వాడీలకు కీలక వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... మార్చి 31 దాకా టేక్‌ హోమ్‌ రేషన్‌(టీహెచ్‌ఆర్‌)ను అమలు చేస్తూ సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికన్నా ముందు ఊగిసలాట ధోరణి కొనసాగింది. టీహెచ్‌ఆర్‌ను అమలు చేయాలని శనివారమే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ అప్పటికింకా ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదం తెలపనందున ఆ నిర్ణయాన్ని అమలు చేయవద్దంటూ ఆదివారం ఆదేశించారు. దీంతో అంగన్‌వాడీలు, ఉద్యోగులు, పేదల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిణామంపై ‘అంగన్‌వాడీలకు పెద్ద కష్టం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్‌వాడీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 55వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజువారీగా భోజన ం చేసే ఆరేళ్లలోపు చిన్నారులకు నేరుగా ఇంటికే ఆహార పదార్థాలు, గుడ్డు, పాలు పంపిస్తారు. అంటే ఒకేసారి ఈనెల 31 వరకూ సరిపడా ఆహారపదార్ధాలను లబ్ధిదారులకు అందిస్తారు.

Read more