కనులపండువగా వరలక్ష్మీవ్రతం

ABN , First Publish Date - 2020-08-01T10:34:10+05:30 IST

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కనులపండువగా వరలక్ష్మీవ్రతం జరిగింది.

కనులపండువగా వరలక్ష్మీవ్రతం

ఏకాంతంగా పూజాకైంకర్యాలు


తిరుచానూరు, జూలై31: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కనులపండువగా వరలక్ష్మీవ్రతం జరిగింది. కొవిడ్‌ కారణంగా ఏకాంతంగా వ్రతాన్ని కేటీ మండపంలో నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తిని ఆలయంలోని కృష్ణస్వామి ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. పూజలు చేశారు. అనంతరం రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు, తామరపూలు వంటి సంప్రదాయ పుష్పాలతో ఆరాధించారు. అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో (నూలుపోగులు) అనంతరం భవిష్యోత్తర పురాణంలో సూతమహర్షి వివరించిన వరలక్ష్మీవ్రతాన్ని టీటీడీ ఆగమ పండితుడు శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు.


అమ్మవారికి నైవేద్యం నివేదించాక దర్శనానికి అనుమతించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా వరలక్ష్మీవ్రతాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించామన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు మొదటిసారి వర్చువల్‌ విధానంలో ఈ సేవకు 3507 మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారన్నారు. వీరి గోత్రనామాలను అమ్మవారికి అర్చకులు నివేదించారని, ఇప్పటికే తపాలా శాఖ ద్వారా అమ్మవారి ప్రసాదాలను బట్వాడా చేశామని వివరించారు. వరలక్ష్మీవ్రతంతో అష్టలక్ష్మి పూజాఫలం లభిస్తుందని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ సభ్యులు గోవిందహరి, వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవో బసంత్‌కుమార్‌, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, అర్చకుడు బాబుస్వామి, ఏవీఎస్‌వో చిరంజీవులు, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్లు కుమార్‌, మధు, గోపాలకృష్ణారెడ్డి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-01T10:34:10+05:30 IST