మటన్‌ మాస్టర్‌

ABN , First Publish Date - 2020-08-16T09:45:32+05:30 IST

అతనొక ఉపాధ్యాయుడు. ఎంటెక్‌ చదువుకున్నాడు. ఒక ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. కరోనా విలయంలో అ

మటన్‌ మాస్టర్‌

లాక్‌డౌన్‌లో కొత్త ఉపాధిని 

సృష్టించుకున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్


తిరుపతి - ఆంధ్రజ్యోతి :అతనొక ఉపాధ్యాయుడు. ఎంటెక్‌ చదువుకున్నాడు. ఒక ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. కరోనా విలయంలో అతని ఉపాధికి కూడా గండిపడింది. జీతం రాలేదని కుంగిపోకుండా,  తన తండ్రి వృత్తిని తనూ స్వీకరించి దాన్నే కరోనా కాలంలో ఆదాయవనరుగా మలచుకున్నాడు.  కాకపోతే తన తెలివితేటల్తో మటన్‌ కొట్టును ఆన్‌లైన్‌లోకి తెచ్చి మరికొందరికి ఉపాధి కూడా చూపుతున్నాడు. 


ఎంటెక్‌ పాసైన మార్కండేయులుది పుత్తూరు సమీపంలోని రామసముద్రం. 13 ఏళ్లుగా ఒక ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ప్రైవేట్‌ విద్యాసంస్థలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.   మొదట ఆందోళనపడ్డాడు. పుత్తూరులో తండ్రి మునస్వామి మటన్‌ షాపు నడుపుతారు. రోజూ అక్కడికి వెళ్లి తండ్రికి సాయం చేయడం మొదలుపెట్టాడు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మటన్‌కొట్టడం ఏమిటని సిగ్గుపడలేదు. అక్కడి అనుభవం అతనిలో కొత్త ఆలోచనలకు ప్రాణం పోసింది. కరోనా రోజుల్లో మటన్‌షాపుకి వచ్చి తీసుకోవడానికి కూడా ప్రజలు జంకుతున్నారు. తామే మంచి ప్యాకింగ్‌తో మాంసం ఇంటికే అందించగలిగితే అనుకుని  ‘ఫ్రెష్‌ మీట్‌ హబ్‌’ పేరుతో ఒక యాప్‌ రూపొందించాడు.


ఎంత  కావాలో ఆర్డర్‌ చేస్తే చాలు ఇంటికే మటన్‌ చేర్చడం మొదలు పెట్టాడు. నాణ్యత, శుభ్రత పాటించడంతో పుత్తూరులో మంచి డిమాండ్‌ వచ్చింది. దీన్నే ఇప్పుడు తిరుపతికి విస్తరించాడు.  5 కిలోలతో మొదలుపెట్టిన వ్యాపారం మూడువారాల్లోనే రోజుకి 100 కిలోల మటన్‌ ఆర్డర్స్‌ వచ్చే స్థాయికి చేరుకుంది. ఆదివారం, బుధవారం మాత్రమే వీరు మటన్‌ సప్లయ్‌ చేస్తారు. ముందురోజు రాత్రి 9లోగా వచ్చిన ఆర్డర్స్‌ మాత్రమే తీసుకుంటారు. 


 ఆర్గానిక్‌ మటన్‌ 

 ‘మేం అమ్ముతున్నది పూర్తిగా ఆర్గానిక్‌ మటన్‌. సహజసిద్దమైన ఆహారాన్ని అందిస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో పాడిపేట దగ్గర మేమే పొట్టేళ్ళు, మేకపోతులు పెంచుతున్నాం. 10 నుంచి 14 కేజీలు బరువున్నవాటినే వినియోగిస్తాం. 8 నెలలులోపు వయసున్న జీవాల మాంసమే రుచిగా ఉంటుంది. తగినవిధంగా శానిటైజ్‌ చేసి ప్యాక్‌ చేసి అందిస్తున్నాం. అందుకే ఒకసారి మా దగ్గర మాంసం తీసుకున్న వాళ్లు మళ్లీ మళ్లీ ఆర్డర్‌ చేస్తున్నారు.’ అని చెబుతారు మార్కండేయులు.


ఫ్రెష్‌మీట్‌ హబ్‌లో హలాల్‌ చేసిన మాంసం, చేయనిదీ విడివిడిగా లభిస్తుంది. మటన్‌తో మాటూ, కీమా, బోటీ, గారకాళ్ళు, తలకాయ మాంసం కూడా చక్కగా శుభ్రం చేసి అమ్ముతున్నారు.   మటన్‌ ఆర్డర్‌ చేయచ్చు. లేదా, 8143707307 నెంబర్‌కు ఫోన్‌ చేయచ్చు.

Updated Date - 2020-08-16T09:45:32+05:30 IST